నిజాయితీ విలువ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  రంగారావు ధనవంతుడు అంతకుమించి మంచి మనసున్న వ్యక్తి.
        ఒకరోజు  రంగారావు పక్కవీధి లో నడచుకుంటూ వెళుతున్నాడు.ఒక ఇంటి ముందు జనం గుమికూడి ఉన్నారు.ఏం జరిగిందోనన్న ఆలోచనతో అక్కడఉన్న ఒక వ్యక్తిని "ఏంజరిగింది?" అని అడిగాడు.
       "ఈ ఇంట్లో ఉన్న ఆయన రైతు రమణయ్య తన పొలానికి ఎంతో డబ్బుపెట్టి పొద్దుతిరుగుడు గింజలు కొంటే అవి మొలకెత్త లేదు,వేరే చెట్లకు ఎరువులు కొంటే అవి పనిచేయలేదు!నష్టంతో దిగులు చెందిన రమణయ్య ఆత్మహత్యా ప్రయత్నంచేస్తే ఇంట్లో వాళ్ళు సకాలంలో ఆసుపత్రిలో చేర్చి ప్రణాపాయంనుండి తప్పించారు.విషయం తెలుసుకున్న  ఈ వీధిలోని వారందరం అతనికి ధైర్యం చెప్పడానికి వచ్చాము" అని చెప్పాడు. రంగారావు కూడా రమణయ్యను కలసి తగిన విధంగా ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళాడు.
         అలా ఇంటికి వెళ్ళిన రంగారావు రైతులను గురించి ఆలోచించాడు.తనకు అనేక వ్యాపారాలు ఉన్నాయి,అయినా రైతులకు ఆదుకోవాలంటే వారికి మంచి విత్తనాలు,ఎరువులు సరఫరా చెయ్యాలి అందుకే తనే ఒక మంచి 'రైతు అంగడి'ని ప్రారంభించాలని నిశ్చయించాడు.
       అందుకుగాను ఊర్లో ఉన్న రాధాకృష్ణ రైతు అంగడికి వెళ్ళి ఆవ్యాపారంలో ఉన్న కష్టనష్టాలు పాటించ వలసిన మెళకువలను గురించి అడిగాడు. రంగారావు ఆలోచన విని రాధాకృష్ణ ఈ విధంగా చెప్పాడు.
        "ఎందుకు ఈ వ్యాపారం మీకు,రైతులకు ఒక్కొక్క సారి అప్పుగా విత్తనాలు,ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది.అందుకే లాభం రావాలంటే కొంత కల్తీ వ్యాపారం తప్పదు.ఈ కష్టాలు మీకు ఎందుకు? మీకున్న వ్యాపారాలు అభివృద్ధి చేసుకుంటే సరిపోతుంది కదా? ఆలోచించండి" అని చెప్పాడు.
        "చూడు రాధాకృష్ణ వ్యాపారం అన్నాక లాభనష్టాలు ఉంటాయి,కానీ విపరీత లాభాల కోసం కల్తీ వ్యాపారం చెయ్యకూడదు,దాని వలన తోటి మనిషిని వంచించిన వారం అవుతాము.మన వలన ఎవరికీ నష్టం జరగకూడదు.లాభం తక్కువైనా పరవాలేదు.అందులో అన్నం పెట్టే రైతును అసలు మోసం చెయ్యకూడదు"అని చెప్పాడు.
       అసలు విషయం ఏమిటంటే ఊరిలో రంగారావుకి మంచి పేరుంది.అతను గనుక రైతు అంగడి ప్రారంభిస్తే తన వ్యాపారం దెబ్బతింటుందని రాధాకృష్ణ భయం.అందుకే  రైతు అంగడి వద్దని రంగారావుని నిరుత్సాహ పరిచాడు. 
        అయినా రంగారావు పక్కఊరిలో మరొక రైతు అంగట్లో మెళకువలు తెలుసుకుని ఓ మంచి ఎరువుల,విత్తనాల అంగడి ప్రారంభించాడు.
       అనుకున్నట్లుగానే  రంగారావు నిజాయితీ మీద నమ్మకం ఉంది కనుక రంగారావు వద్ద ఎరువులు,విత్తనాలు కొనసాగారు రైతులు.వారికి శ్రేష్టమయిన విత్తనాలు,ఎరువులు దొరికేటట్లు రంగారావు శ్రద్ద తీసుకున్నాడు.క్రమేపీ రాధాకృష్ణ వ్యాపారం దెబ్బతినింది.
      ఇక రాధాకృష్ణ కూడా మంచి సరుకును రైతులకు ఇస్తేనే తను,తన వ్యాపారం నిలబడుతాయని తెలుసుకుని,నాణ్యమైన సరుకుతో వ్యాపారం చెయ్యసాగాడు.
       రంగారావు మంచితనం,నిజాయితీ రాధాకృష్ణ వంటి స్వార్థపరుణ్ణి మార్చింది.రాధాకృష్ణే కాదు పక్క గ్రామల్లోని రైతు అంగళ్ళవారు కూడా మారారు!
        వ్యాపారంలో గానీ,జీవితంలోగానీ నిజాయితీ,మంచితనం ఉంటే ధనం వచ్చి తీరుతుందని రాధాకృష్ణ తెలుసుకున్నాడు.