తల్లి మనసు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   గోపన్న,వెంకన్న ఇరుగు పొరుగువారే.ఇద్దరికీ మంచి ఆవులు ఉన్నాయి.ఇద్దరి ఆవులు చూడుతున్నాయి,అంటే వాటికి బుజ్జి తువ్వాయిలు పుట్ట బోతున్నవన్న మాట.మరి కొద్ది రోజుల్లో అవి ఈనుతాయి అనగా కనిపించకుండా పోయాయి! గోపన్న,వెంకన్న వాటికోసం వెదకసాగారు. అవి రెండూ ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న అడవిలో దొరికాయి.అప్పటికే అవి దూడల్ని ఈనాయి. దురదృష్ట వశాత్తు ఒక దూడను ఏదో అడవి మృగం పొట్టన పెట్టుకుంది.
        ఆ రెండు ఆవులు ఆ చిన్న దూడకు పాలిస్తూ ప్రేమగా చూసుకుంటున్నాయి.ఆవుల్ని దూడను గమనించిన గోపన్న,వెంకన్న  ఆ దూడ నా ఆవుదంటే నా ఆవుది అని తగవు లాడుకొని న్యాయం కోసం గ్రామాధికారిని ఆశ్రయించారు..
       ఆ రాత్రి గ్రామాధికారి బాగా ఆలోచించి,రెండో రోజున ఆవులను,దూడను ఒక చిన్న నది వద్దకు తీసుకవెళ్ళి దూడను ఒక ఒడ్డున, రెండు ఆవుల్ని ఇంకొక ఒడ్డున విడిచి పెట్టి గోపన్న,వెంకన్నలను పిలిపించాడు.
        వాటిని అందరూ గమనించసాగారు. ఒక ఆవు మటుకు దూడను చేరుకునే ప్రయత్నం చేయలేదు.దూరంగా కనబడుతున్న దూడకేసి చూస్తుండి పోయింది! 
       మరొక ఆవు బాధగా "అంబా"అని అరచి వేగంగా నదిని ఈదుకొని వచ్చి దూడను సమీపించి ఎంతో ఆప్యాయంగా దూడను నాకింది! గ్రామాధికారి గోపన్న ఆవుదే ఆదూడ అని నిర్ధారించి ఈ విధంగా చెప్పాడు,"చూసారా,నిజమైన తల్లి ఆవు దూడను దూరంగా చూసాక నిలువలేక నదిని ఈది తన దూడ వద్దకు చేరింది,దూడమీద ఆప్యాయతను చాటుకుంది.మనిషైనా,గోవు అయినా తల్లి మనసు తల్లి మనసే"చెప్పాడు గ్రామాధికారి. తమలో ఉన్న అనుమానాన్ని తొలగించినందుకు ఇద్దరూ గ్రామాధికారికి కృతజ్ఞతలు చెప్పి ఆవుల్ని,దూడను తీసుకవెళ్ళారు. గోపన్న,వెంకన్నలు ఆవుల్ని దూడను ఏ అరమరికలు లేకుండా ప్రేమగా చూసుకో సాగారు.
-----------------------------------------------------------
ఆధారం:Farah  Hussain కథకు అనుసృజన.
                *