రాక్షసులు ఉన్నారా?!...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు ఐదో క్లాస్ లో తెలుగు టీచర్  మన పురాణాల కథలు చెప్పింది.పిల్లలకి  బోలెడన్ని  సందేహాలు! జయవిజయులు  ఎలా మూడు  జన్మలు ఎత్తారో రాక్షసులుగా మారారో తెలుసు కున్నారు.రాముడు కృష్ణుడు  బాల్యం లో రాక్షసవధ గావించటం టి.వి.లో చూస్తూనే ఉన్నారు. రోహిత్ కి సందేహం  నిజంగా దానవులున్నారా?అని. ఆదిత్య అన్నాడు "ఉన్నారు కాబట్టే టీచర్ చెప్పారు. "ప్రవీణ్  అన్నాడు "నేను  ఇంటి కెళ్ళి  మా బామ్మ ను అడుగుతా".  టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఇది"రాక్షసులు  చేసిన చెడ్డపనులు  ఒక కాగితం పై రాసి తీసుకుని రండి. " రోహిత్ వాళ్ళ అమ్మ నడిగి నరకాసురుని గూర్చి తెలుసు కున్నాడు.వాడు రాజకన్యలని బంధించి అందరినీ సతాయించాడు. తల్లి భూదేవి కి కష్టం కలిగించాడు. ఆదిత్య వాళ్ళ నాన్న నిఅడిగితే హిరణ్యకశిపుడు  ప్రహ్లాదుని గూర్చి వివరించాడు.  ప్రవీణ్ కి వాళ్ళబామ్మ చరిత్ర లో జరిగిన యుద్ధాల గూర్చి చెప్పింది.హిట్లర్  అతికిరాతకంగా యూదులను ఊచకోత కోశాడు. నేటి ఉగ్రవాదుల పనిఅదే!  ఆమరునాడు రోహిత్  క్లాస్ లో ఇలా చెప్పాడు"టీచర్!సత్యభామ తోకలిసి కృష్ణుడు  నరకుని సంహరించాడు. అదే నరక చతుర్దశి దీపావళి గా మనం జరుపుకుంటున్నాము.ఇప్పుడు మనం ప్లాస్టిక్ వ్యర్థాల తో పర్యావరణం ని నాశనం చేసే నరకాసురులం. "అంతా చప్పట్లు కొట్టారు.  ఆదిత్య అన్నాడు "హిరణ్యకశిపుడు  బాలుడైన కొడుకు ప్రహ్లాదునికి దేవతలగూర్చి నకారాత్మక భావాలు నాటే ప్రయత్నాలు చేశాడు. ఇంటా బైట  తమకు నచ్చనివారి గురించి పెద్దలు  చిలవలు పలవలు గా పిల్లలలో ద్వేషాన్ని  కోపంని అసూయ ని పెంచే మాటలు చెప్పరాదు.రక్త సంబంధాలు  అయిన వారిని ఫ్రెండ్స్ ని దూరం చేయరాదు."
 క్లాసుఅంతా చప్పట్లహోరు! ప్రవీణ్ అందుకున్నాడు"టీచర్!మాబామ్మ  హిట్లర్ని గూర్చి చెప్పింది.నేటి ఉగ్రవాదులు  కిడ్నాప్ చేసేవారు  హత్యలు చేసేవారు అంతా తాటకి కంసులు రావణాసురుడు. " పిల్లలంతా నిజం నిజం అని అన్నారు.  టీచర్ ఇలా చెప్పింది  "శభాష్!బాగా చెప్పారు. ఎన్ని మంచి గుణాలు ఉన్నా ఏంలాభం?కుండెడు పాలలో ఒక విషపు బొట్టు పడితే  పాలన్నీ విషంగా మారుతాయి.  మీరు చెప్పిన దానవులంతా మహా తపస్సంపన్నులు. వారి ఏకాగ్రత నిశ్చలత లో వారికి వారే సాటి.అనుకున్నది సాధించే పట్టుదల వారికి ఉంది. ఇంద్రుడు  అప్సరసలను పంపినా చలించలేదు. బ్రహ్మ శివుని మెప్పించి వరాలు పొంది గర్వం అహంకారం  అధికారమదంతో జనాలను పీక్కుతిన్నారు. ప్రతి మంచి వాడిలో ఒక చెడు ప్రతి  చెడ్డవాడిలో ఒక మంచి ఉంటుంది. మంచిని గ్రహించి   వారి చెడుని మనం అనుసరించకూడదు "క్లాసు అంతా ఆనందంతో అవును టీచర్  బాగా చెప్పారు అని జేజేలు పలికారు.