పరిమళించని ప్రేమలేక .....!!:- --------శ్యామ్ కుమార్. నిజామాబాద్.

 కాలేజీలో చేరే సమయానికి మనస్తత్వాలు 
కూడా మార్పులకి లో ను
అవటమే కాకుండా  జీవిత గమ్యం కూడా మారి పోతుంది.  స్కూల్లో ఉన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పటికీ, ఒక రకమైన క్రమశిక్షణ, ఉపాధ్యాయుల పర్యవేక్షణ మధ్య చదువు సాగుతుంది .  కారణం తెలియదు కానీ  కాలేజీలో ఇవి రెండూ కూడా తగ్గుతాయి.  బాగుపడటానికి మరి చెడిపోవడానికి  కూడా రెండు దారులు అక్కడ ఉంటాయి.  వయసు తో వచ్చే అలవాట్లను వాటికి  లోనయ్యే మనసును అదుపులో  పెట్టుకొని చదువు ,దానితోపాటు కాలేజీలో సంతోషాలను కూడా అనుభవించడమే సరి అయిన మార్గం.   అయినప్పటికీ కొన్నిసార్లు   కొంత సమయం  ఆ వయసు తో వచ్చే ఆకర్షణ లకు కేటాయించడం   మనకు తెలియకుండానే జరుగుతుంది . 
 అదిగో అలాంటి  ఆకర్షణకి  మా కృష్ణ లోనయ్యాడు. రెండు జెళ్ళ సీత  అనబడే రాజ్యలక్ష్మి   ఆలోచన వాడిని రాత్రింబగళ్ళు వేధించ  సాగింది.  మేము ఐదుగురం కాలేజీలో చదువులో మాత్రమే కాకుండా అన్నింటా ముందు ఉండేవాళ్ళం.  ఏరకమైన పోటీలు జరిగినా కూడా మాకు తప్పనిసరిగా బహుమతులు వచ్చేవి!
  రాజ్యలక్ష్మి విషయంలో,నిజం చెప్పాలంటే  కృష్ణ తప్పు లేదు. ఆ అమ్మాయి చాలా ఆకర్షణీయంగా   అమాయకమైన అందంతో  ఉండేది.  మా కాలేజీలో చదివే ప్రతి అమ్మాయి కూడా దివి నుండిభువికి
దిగి వచ్చిన పారిజాతం లా కనిపించేది.
  ఒక సంవత్సరం జూనియర్ అయిన  ఆ   రాజ్యలక్ష్మికి  తన పుస్తకాలు,  నోట్స్ ఇచ్చి లైన్ కలుపుదాము అనుకునే  ప్రణాళిక   సఫలం కాలేదు. సరికదా ఒక రకంగా పూర్తిగా బెడిసికొట్టింది అని చెప్పాలి.  వీటిని గమనించి ఆ అమ్మాయి ఇంకా దూరంగా పారిపోవడం మొదలు పెట్టింది. 
 అయినా సరే మన కృష్ణారావు మాత్రం తన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గించలేదు.  చదువులో   కూడా తగ్గలేదు, మరి అలాగే అమ్మాయి తో  స్నేహాన్నికలిపే ప్రయత్నాలు కూడా విరమించలేదు.
 రాజ్యలక్ష్మి  కాలేజీ  నడవలోకి రావడం గమనించి,  ఏదో పని ఉన్నట్లు గా కావాలని ఆ అమ్మాయికి ఎదురుగా నడుచుకుంటూ వెళ్లేవాడు.  మేమంతా దూరంగా నిలబడి  ఇదంతా గమనించి   నవ్వుకునే వాళ్ళం.
  వచ్చాక అడిగేవాల్లం "ఏరా అటెండెన్స్ అయిపోయిందా? మేము ఇక్కడ నుంచి చూస్తూనే ఉన్నాం ఆ అమ్మాయి కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడలేదు." అని. మా అందరి మొహాల్లో వాడిని చూసి వెక్కిరింత నవ్వులు.  దానికి వాడు "చూడలేదు సరే, కానీ అమ్మాయి కి తెలుసు  నేను ఎదురుగా వస్తున్నానని .అందుకే అంత కిందకి చూస్తూ వెళ్ళింది.  అంటే నన్ను గమనిస్తున్న ట్టే కదా?  అది చాలు!!"అన్నాడు. 
"అదే మరి !నీ మొహం చూడలేక వెళ్ళింది లే !"
అని మేము  నలుగురం పగలబడి   నవ్వుతూ,   క్లాసులు మొదలు అవుతున్నట్టుగా ఆఖరి గంట    కొట్టడంతో అది విని  తరగతి గదిలోకి వెళ్ళిపోయాం.
 మా కాలేజీ  కో-ఎడ్యుకేషన్ అయినప్పటికీ  అమ్మాయిలు చాలా తక్కువగా ఉండేవారు. బహుషా అందుకేనేమో అమ్మాయిలు బిక్కుబిక్కుమంటూ భయంగా వందలకొద్దీ పులుల మధ్య ఉన్న జింకల లాగా ఉండేవారు.
 మేము ఐదుగురు ఎక్కడ నిలబడ్డా ,కాలేజీ లో ఎక్కడ కూర్చున్నా ఉన్నట్టుండి వాడి కళ్ళు సగం బయటికి వచ్చాయి అంటే మాకు అర్థమై  పోయేది ,  చుట్టుపక్కల ఎక్కడో రాజ్యలక్ష్మి వస్తుందని. ఎవరికీ అర్థం కాకూడదని వాడు ఆ అమ్మాయి పేరు అలివేలు అని పెట్టాడు.
 ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అమ్మాయి   వీడి వైపు చూడటం కానీ   అమ్మాయికి వినబడేట్లుగా వీడు వేసే జోకులకి నవ్వడం కానీ చేసేదికాదు. ఒకరోజు అందరం కాలేజీ ఆవరణలో ఉన్న  పచ్చిక బయలులో తలకింద పుస్తకాలు పెట్టుకొని పడుకొని మాట్లాడుతున్నాం.
   అప్పుడు కృష్ణారావు ఉన్నట్టుండి "ఒరేయ్ నేను ప్రేమ లేక ఒకటి రాసి ఇద్దాం అనుకుంటున్నాను" అన్నాడు. 
 అప్పుడు వాడి అన్నయ్య వాసు  అడిగాడు "ఎవరికీ  కామేశ్వరి  కా? అది నీకు  వదిన లాంటిది    అటువైపు మాత్రం చూడకు" అన్నాడు పకపకా నవ్వుతూ.
 అప్పుడు  రావు అన్నాడు" ఎందుకు ఇప్పుడు? నీకేం పోయేకాలం "అని. 
 "ఎందుకు ఇప్పుడు ఏంటి ? అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి!"  ఏడుపు మొహం తో అన్నాడు కృష్ణ. 
 "ఎలా ఇస్తావు ?ఇస్తే ఊరుకుంటుంది ఏంటి? చెప్పు తీసుకుని  పళ్ళు రాల  కొడుతుంది. " అన్నాడు రెడ్డి.
 నేను ఏమాత్రం మాట్లాడకుండా గమనిస్తూ కూర్చున్నాను. 
" అలాంటిది ఏమీ జరగదు .అమ్మాయికి నేను అంటే ఇష్టం .కావాలంటే  చాలెంజి "అన్నాడు. 
" సరేరా నీ ఇష్టం నీ కర్మ "  అని అందరం క్లాసులకు బయల్దేరాం.
  మరుసటి రోజు మమ్మల్నందర్నీ తీసుకొని  విద్యార్థి బుక్ డిపో అని షాప్ కి తీసుకెళ్ళాడు.  అక్కడ రంగుల పెన్నులు , దానితోపాటే రంగురంగుల పూలు ఉన్న ఒక లెటర్ ప్యాడ్ కొన్నాడు.
 మరుసటి రోజు సాయంత్రం అంతా మమ్మల్ని కూర్చోబెట్టి మా సహాయం తీసుకొని ఎలా రాయాలి .,ఏమిటి రాయాలి, అన్నీ  తర్కించి మొత్తానికి ఒక పెద్ద ఉత్తరం తయారు చేశాడు.
 అసలు నిజం చెప్పాలంటే మా కాలేజీలో  ఉన్న అమ్మాయిలు చాలా ఆకర్షణీయంగా మాకు కనపడుతూ ఉన్నప్పటికీ గొప్ప అందగత్తెలు కాదు అని మాకు తర్వాత అర్థమైంది.  కానీ మాకు మాత్రం వాళ్ళు   అప్పుడు అప్సరసల లాగా కనిపించే  వారు.  వాళ్ళు చక్కటి బట్టలు వేసుకుని వస్తే  అబ్బాయిలు చాలా సంతోషించి వాళ్ళని  కళ్లార్పకుండా  చూసేవాళ్ళు.   ప్రతి అమ్మాయి లో ఒక ప్రత్యేకమైన అందం కనిపించేది.  ఏది ఏం చేసినా చదువు విషయంలో మరీ  పరీక్షల సమయంలో ఒళ్లు దగ్గర పెట్టుకొని  చదువు మీద  పుస్తకాల మీద దృష్టి కేంద్రీకరించేవాళ్ళం.  ఇంట్లో నుంచి కాళ్లు బయటకు అసలు పెట్టే వాళ్ళం కాదు.
   ఆఖరికి ఒకరోజు ఆ ప్రేమ లేఖ ఇవ్వడానికి కృష్ణ   ముహూర్తం పెట్టాడు.  ఎక్కడ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని మా అందరి తోటి సంప్రదించాడు.  అసలు మాకు ఎవరికీ  ఇది ఇష్టం లేదు.  కానీ స్నేహితుల గురించి వారి ఆనందం గురించి ఏదైనా చేయాలి. వాడికి అవసరమైతే  ఏమైనా చేయాలి అనుకునే వయస్సు మాది. 
 అమ్మాయి కొద్ది రోజులు సైకిల్ రిక్షా లో కాలేజీకి వచ్చేది.  ముందుగా అమ్మాయి ఎక్కడ ఉంటుందో, ఇల్లు ఎక్కడో చాలా కష్టపడి కనుక్కొని  రిక్షాఎలా వస్తుంది  ఏ దారిలో వస్తుంది అన్నది కూడా  తెలుసుకున్నాం.  ఇప్పటి రోజుల్లో చెప్పాలంటే రెక్కీ చేశాం  అన్న మాట.
 కాలేజీలో అన్నింటా ఫస్ట్ వుంటూ,  ఉత్తమ విద్యార్థులు గా పరిగణింపబడిన మేము ఇలా చేస్తున్నామని మనసులో ఒకింత దిగులుగా కూడా ఉండింది.  ఇలా మేమందరం వాడికి తోడు ఇవ్వడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది.   అదేమిటంటే ముందు రోజు  మాతో మాట్లాడుతూ కచ్చితంగా   రాజ్యలక్ష్మిని వివాహం   చేసుకుని తీరతానని  చెప్పాడు.  దాంతో మా మనసులు   కాస్త కుదుట పడ్డాయి. వీడు ఇంతలా  చెబుతున్నాడు కాబట్టి మనం కాస్త సహాయం చేద్దాం లే అని అనుకున్నాం. సుభాష్ నగర్ దగ్గర  జిల్లా పరిషత్ ముందు  ఆ ప్రేమలేఖను అందచేద్దామని  నిశ్చయించాడు.   మేము ఐదుగురం కాలేజీకి బయల్దేరి అమ్మాయి వచ్చే దారిలో కాస్త ప్రక్కగా  ఒక చెట్టు కింద నిలబడ్డాం.  కాకపోతే మేం నలుగురం కాస్త దూరంగా రాజ్యలక్ష్మికి కనపడకుండా నిలబడ్డాం. మేము అసలు విషయం పట్టించుకోకుండా వేరే విషయాలు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ సమయాన్ని గడుపుతున్నాం .వాడు మాత్రం రోడ్డుమీద చకోర పక్షిలా అటు వైపు చూస్తూ  రాజ్యలక్ష్మి రిక్షా గురించి ఎదురు చూడసాగాడు.  . కాస్త దూరంగా మలుపులో రాజ్యం వస్తున్న రిక్షా కనబడసాగింది.రిక్షా దగ్గరవుతున్న కొద్దీ  మేమంతా గుండెలు అరచేతిలో పెట్టుకొని  ఏం జరుగుతుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నాము.  రాజ్యలక్ష్మి   రిక్షా  కృష్ణకు కాస్త దగ్గరగా  రావడం మాకు కనిపిస్తూ ఉంది. కృష్ణ  చెయ్యి ఊపాడు.   రిక్షా నడిపే అబ్బాయికి అర్థం కాక రిక్షాను ఆపేశాడు. అన్ని మాటలు మాట్లాడిన కృష్ణ భయంతో  బిగుసుకుపోయాడని అర్థమవుతోంది మాకు.  తన శరీరాన్ని వంకర్లు తిప్పుతూ తన చేతిలో ఉన్న ప్రేమలేఖను అమ్మాయికి ఇచ్చాడు.  కానీ అమ్మాయి దాన్ని అందుకోలేదు.  రిక్షా అబ్బాయికి విషయం అర్ధమయ్యి రిక్షాను ముందుకు పోనిచ్చాడు. దాంతో రెండడుగులు పరిగెత్తి ఆ ప్రేమలేఖను రిక్షాలోపలికి   విసిరి వేశాడు.  అంతలో     ఆ సైకిల్  రిక్షా సందు మలుపు తిరగడం వలన ఏం జరిగిందో   కనపడలేదు. కాసేపటికి కృష్ణ నడుచుకుంటూ మా వద్దకు వచ్చాడు.  మొహమంతా కందగడ్డలా ఉంది.  ఏం జరిగింది రా ఏం జరిగింది అన్న మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అటూ ఇటూ చూస్తున్నాడు.  గమనించి చూస్తే మొహం అంతా ఎర్రగా అవమానంతో కందిపోయినట్లుగా కనిపించింది మళ్లీ అడిగాము    చెప్పరా ఏమైంది ఏమైంది అని. 
"ఏమీ లేదు .  తను తీసుకోలేదు ఏం చేయాలో తెలియక నేను  ఆ ఉత్తరాన్ని  రిక్షా లోకి పడ వేసాను."  అని సమాధానం చెప్పాడు.
 "అలాగా. మరి తర్వాత ఏం జరిగింది?"  సస్పెన్స్తో కూడిన టెన్షన్తో అడిగాం.
 వాడు ఏమీ మాట్లాడకుండా   ఆ రిక్షావెళ్ళిన దారి వైపే చూస్తూ నిలబడ్డాడు.
 "ఇంతకీ ఏం జరిగింది రా వెధవా?  చెప్పి చావు! ఏంటి?"అన్నాడు వాసు.
"ఏం జరుగుతుంది వెధవల్లారా నా పరువు పోయింది "అన్నాడు. 
 వాడు కోపంతో కూడిన విసుగుతో మమ్మల్ని చూసి
"నేను వేసిన ప్రేమలేఖను తిరిగి బయటకు విసిరేసింది " అన్నాడు.
వాడి మొహం చూసి ఒకవైపు మాకు నవ్వు ఆగటంలేదు. 
 "మరి నువ్వు ప్రేమ లేఖ  ఇవ్వగానే ఆ రిక్షాలో నుంచి    వెంటనే కిందకు దూకి నీ చేతులు పట్టుకొని  పాటలు పాడేస్తుంది అనుకున్నావా. అవన్నీ సినిమాల్లో జరిగేవి. జీవితంలో కాదు మేం చెప్తే విన్నావా? రోగం కుదిరింది !"అన్నాడు వాసు.
మేము అన్నాం" సరే ఏదో ఒకటి చేశావు కద రా! ఆ ఉత్తరం చదువుకొని ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం పద.    వర్రీకాకు వదిలేయ్!!"  అని సముదాయించాము.
 కృష్ణ    ను  చూసి కాసేపు మాకు బాధ వేసినా రాజ్యలక్ష్మి అలా చేసినందుకు మేము చాలా సంతోషించాం.   ఉత్తరం రిక్షా లో నుంచి బయటకు విసిరి వేసినప్పుడు కృష్ణ  మోహాన్ని తలుచుకుంటూ ఆ రోజంతా నవ్వుకుంటూ నే ఉన్నాం .ఆ రోజే కాదు చాలా రోజులు నవ్వుతూనే ఉన్నాం.
 దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అని ఎవరికి వారు ఆలోచించుకుంటూ కాలేజీకి బయల్దేరాం.
 వీడు చేసే పనులకి అమ్మాయి ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇచ్చేది కాదు.  కనీసం కోపంగా చూడటం గానీ తిట్టడం గానీ ఎప్పుడూ జరగలేదు.  
అందమైన అమ్మాయిల  ను   చూడగానే అబ్బాయిలు ఆకర్షణలకు లోనవుతారు గాని అమ్మాయిలు మాత్రం అబ్బాయిల వ్యక్తిత్వం వారితో జీవితాంతం  పెనవేసుకు బోయే భవిష్యత్తులోని   వివాహ బంధం,  అందులోన సాధ్యాసాధ్యాలు  గుర్తించి  మసలు కుంటారు అనే విషయం మాకు అప్పుడు తెలియదు. 
 క్షణికమైన ఆకర్షణలకు  తాత్కాలికమైన ఆనందాలకు  అబ్బాయిలతో  స్నేహం చేసే  అమ్మాయిలు చాలా అరుదు.  ఒకవేళ అలా  చేస్తే ఆ అమ్మాయికి జరిగే  కష్టనష్టాలను మనం చూస్తూనే ఉన్నాము.
           " ప్రేమించడం సులభం !
             ప్రే మించబడడం చాలా కష్టం!!"
   
కామెంట్‌లు