ల్యాండ్ మార్క్! నిత్యస్మరణీయం!!:-- యామిజాల జగదీశ్

 ల్యాండ్ మార్క్....ఇది ఓ పుస్తకాల దుకాణం. ఇది మద్రాసులోని నుంగంబాక్కంలో ఉండిన ఓ పుస్తకాలయం పేరు. పుస్తకాలను ప్రేమించే నేనీ పుస్తక నిలయాన్ని చూడలేదు. కానీ ఓ తమిళమిత్రుడు ఈ ల్యాండ్ మార్క్ గురించి రాసిన వ్యాసం చదివాను. అందులోని కొన్ని వాక్యాలు నచ్చి ఇక్కడ రాసుకున్నాను. 
వ్యాస రచయిత ఎస్. రామకృష్ణన్ కి పుస్తకాలే ప్రపంచం. ఆయన రాతకోతలపైనే తన జీవితపయనాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన ఏ ఊరుకెళ్ళినా ఆయన కళ్ళు వెతికేవి పుస్తక నిలయాలకోసమే. ఆయన వంద పుస్తకాలుపైనే రాశారు. నాదస్వర విద్వాంసుల జీవితాలను కేంద్రబిందువుగా చేసుకునా రాసిన పుస్తకానికి  సాహిత్య అకాడమీ పురస్కారంకూడా అందుకున్నారు.  పుస్తకాల దుకాణాలకు వెళ్ళడమంటే ఆయనకు మహా సంబరం.
పుస్తక ప్రేమికుడైన రామకృష్ణన్ వారంలో మూడుసార్లో నాలుగుసార్లో ల్యాండ్ మార్క్ పుస్తకాలయానికి వెళ్ళేవారు. 
 కొన్నిసార్లు ఆయన మధ్యాహ్నం రెండు గంటలకు ఈ పుస్తకాలయంలోకి వెళ్తే సాయంత్రం వరకూ అక్కడే ఉండేవారు. పుస్తకాలను తిరగేసేవారు. 
క్రమంగా ఈ పుస్తకాలయ సిబ్బందిలో చాలా మంది ఆయనకు మిత్రులు కావడంతో ఆయన ఎంతసేపు ఆ దుకాణంలో ఉన్నా పట్టించుకునే వారు కాదు. అక్కడ ఏ కొత్త పుస్తకాన్నయినా నిలబడే చదువుకునే వీలుండేది.
 మధ్యాహ్నం పూటైతే ఎక్కువ మంది రాకపోవడంతో రామకృష్ణన్ కొత్తగా వచ్చిన పుస్తకాలు తీసి ఒకటి రెండు పేజీలు చదివేవారు 
ఇక్కడ ఇంగ్లీష్ పుస్తకాల రేట్లు ఎక్కువే. కనుక వాటిని కొనేంత ఆర్థిక స్థోమత ఉండదు. అయినాసరే, ఎంతో ఆశతో ఆ పుస్తకాలను తీసి పేజీలు తిప్పేవారు. అందులో ఆయన పొందే ఆనందం అంతా ఇంతా కాదు.
కొత్తగా వచ్చిన కవితల పుస్తకాల నించి రెండేసి మూడేసి కవితలు అక్కడే చదివేసేవారు.
 
ఓమారు అమెరికా నుంచీ వచ్చిన తన మిత్రుడితో కలిసి ఆయన ఈ పుస్తకాలయాన్ని సందర్శించారు. అప్పుడు తనకు కావలసినప్పుడు తాను కొనుక్కుంటానని రామకృష్ణన్ ఎంత చెప్పినా వినకుండా ఆ అమెరికా మిత్రుడు తమ స్నేహబంధానికి గుర్తుగా అయిదు పుస్తకాలు కొనిస్తానంటే ఏ పుస్తకం కొనుక్కోవాలో తెలీలేదట. 
ల్యాండ్ మార్క్ లో అరుదైన పుస్తకాలు కనిపిస్తే ఆయన వాటిని దాచేసేవారు. డబ్బులు సమకూరాక ఆ పుస్తకాలను కొనుక్కోవచ్చని ఇలా దాచేసేవారు. అలా తాను ఎంపిక చేసి దాచుకున్న ఓ అయిదు పుస్తకాలను మిత్రుడి కానుకగా కొనుక్కున్నారు.
పుస్తకాలతో ల్యాండ్ మార్క్ లోంచి ఇవతలకు వచ్చాక ఇద్దరూ కలిసి ఓ చోట టీ తాగడానికి వెళ్ళారు. అయితే రామకృష్ణన్ మనసంతి తాను కొనుక్కున్న పుస్తకాలపైనే ఉంది. వాటిని వెంటనే చదివెయ్యాలని ఆరాటం. ఆశ. ఈ విషయం గ్రహించిన మిత్రడు ఆయన దగ్గర వీడ్కోలు పొందారు. అక్కడి నుంచి రామకృష్ణన్ తన ఇంటికి బస్సెక్కడంతోనే దొరికిన సీటులో కూర్చుని ఓ పుస్తకం చదవడం మొదలుపెట్టారు. అది లాటిన్ అమెరికన్ కథల పుస్తకం.
ఎంతో ఆశతో కొనుక్కున్న ఈ పుస్తకాలను భద్రపరచుకోవడానికి అప్పట్లో ఆయనకు తగిన వసతులు లేకపోవడంతో చాలా పుస్తకాలు పోగొట్టుకున్నారు. కొన్ని పుస్తకాలను కొందరు తస్కరించేసారట. 
  
ల్యాండ్ మార్క్ దుకాణాన్ని ఆనుకుని ఓ చిన్న టీకొట్టుండేది. ఏ మిత్రులెవరైనా కనిపిస్తే వీరంతా సమావేశమయ్యేది ఆ టీకొట్లోనే. ఒక్కొక్కప్పుడు ఈయన అక్కడే ఉండి మిత్రులకోసం నిరీక్షించేవారు. సెలవు 
రోజుల్లో ఎక్కువ మంది ఈ పుస్తకాలయానికి వచ్చి పుస్తకాలు కొనుక్కుపోతుంటే ఆయనకెంతో ఆనందమేసేదట. పుస్తకాలు చదివేవారంటే ఆయనకు మహదానందం. ఊళ్ళ నించి మిత్రులెవరొచ్చినా వారినితప్పనిసరిగా ల్యాండ్ మార్క్ దుకాణానికి తీసుకుపోవడం ఆయన అలవాటుగా ఉండేది.
 ఆయన రాసిన కథో వ్యాసమో అచ్చయి వాటికొచ్చే పారితోషికంతో ల్యాండ్ మార్క్ కి వెళ్ళి ఏదో ఒక పుస్తకం కొనడం ఆయనకున్న ఐలవాట్లలో ఒకటి.
తమిళ రచయితలలో ప్రముఖులైన సుజాతా (ఇది కలంపేరు. ఆయన అసలు పేరు రంగరాజన్) తరచూ ఈ పుస్తకాలయానికి వస్తుండేవారట. ఆయన ఏ ఏ పుస్తకాలు కొంటారోనని రామకృష్ణన్ పరిశీలిస్తుండేవారట. సుజాతా ప్రతీసారి కనీసం పదో ఇరవయ్యో పుస్తకాలు ఎంపిక చేసేవారట. తన అభిమానులెవరైనా అక్కడ కనిపిస్తే ఓ చిరునవ్వు నవ్వేవారట. 
ఒక్కొక్కప్పుడు డిస్కౌంట్ రేట.లకు పుస్తకాలు అమ్ముతుండేవారట. ఈ అవకాశం కోసం నోరీక్షిస్తుండేవారు రామకృష్ణన్. 
పుస్తకాలు కొనకపోయినా ఈ పుస్తక నిలయానికి వెళ్ళడమంటే ఆయనకు మహాసంబరం. ఈ పుస్తకాలయంలో ఆయన తమిళ రచయితలకన్నా మళయాల రచయితనే ఎక్కువమందిని కలిశారట.
మద్రాసు (చెన్నై అనడం ఇష్టం లేక మద్రాస్ అనే వాడుతున్నాను. నేను పుట్టి పెరుగుతున్న రోజుల్లో చెన్నై పేరు మద్రాసే కావడం నాకిష్టమైపోయింది)లో హిగ్గిన్ బాథమ్స్ , ఒడిస్సీ, అమెరికన్ బుక్ సెంటర్ అంటూ ఎన్నో పుస్తక దుకాణాలున్నా రామకృష్ణన్ కి ల్యాండ్ మార్క్ తో ఉన్న అనుబంధం వేరు.
అటువంటి ల్యాండ్ మార్క్ ని మూసేసినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డారు. ఓపుస్తక దుకాణంతో ఉన్న బంధాన్ని మాటల్లో వర్ణించలేమంటారాయన. ఇప్పటికీ ఆయన నుంగంబాక్కం వెళ్తే ల్యాండ్ మార్క్ ఉండిన చోటుని వెతుకుతుంటాయి ఆయన కళ్ళు. 
ఈ పుస్తక నిలయంతో ఉన్న అనుబంధం గురించి, అక్కడ కొనుక్కున్న పుస్తకాల గురించి ప్రత్యేకించి విపులంగా రాయాలన్నది రామకృష్ణన్ ఆకాంక్ష. 
 
చదివే అలవాటున్న వారందరికీ ఈ ల్యాండ్ మార్క్ జ్ఞాపకాలు చిరస్మరణీయమని ఆయన అభిప్రాయం.

కామెంట్‌లు