నందనవనం:- కె. వెంకట రమణ రావు

రాజేష్ దాదాపు పది సంవత్సరాల తరవాత మళ్లీ తన స్కూల్ చూడడానికి బయలుదేరాడు. స్కూల్ ముందు తన కారు ఆపి ఒకసారి అంతా కలయ చూసాడు . ఒక నందనవనం లా ఉంది ఆ స్కూల్ . ఒక్కసారిగా గతం లోకి వెళ్ళాడు. ఆ రోజు తన పుట్టిన రోజు , ఫ్రెండ్స్ కి చాక్లెట్లు ఇవ్వాలి ,ఇంట్లో అమ్మ నాన్నను అడిగాడు. చాక్లెట్ ఒక సారి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది రా, అలా కాకుండా చాలా రోజులు అందరికి ఉపయోగ పడే విధం గా ఆలోచించు అన్నాడు నాన్న.
బాగా ఆలోచించి మనం మొక్కలు బహుమతి గా మా క్లాస్ స్టూడెంట్స్ కి ఇద్దాము అన్నాడు రాజేష్. వెంటనే ఒక నర్సరీ కి వెళ్లి పూల మొక్కలు పళ్ళ మొక్కలు తెచ్చారు. 
రాజేష్ , వాళ్ల నాన్న స్కూల్ ప్రిన్సిపాల్ ని కలుసుకుని , మొక్కలు ఇచ్చారు.
ప్రిన్సిపాల్ , రాజేష్ వాళ్ల క్లాస్ కి వెళ్లి , ఇవాళ మన రాజేష్ పుట్టిన రోజు, మీ అందరికీ మొక్కలు బహుమతి గా తెచ్చాడు. పదండి అందరూ మొక్కలు నాటుదురు గానీ అంటూ స్కూల్ ఆవరణలోకి దారి తీసాడు. రాజేష్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఉత్సాహం గా ఒక్కొక్క మొక్క నాటారు. రోజూ ఎవరి కి వాళ్ళు నా మొక్క అని జాగ్రత్త గా పెంచారు. ఒక సంవత్సరం గడిచేసరికి మొక్కలు పెద్దవి అయ్యాయి. స్కూల్ ఫంక్షన్స్ లో అక్కడి పువ్వులే వాడుకునే వాళ్ళు.
టెన్త్ క్లాస్ అవగానే రాజేష్ వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇంటర్ డిగ్రీ ఆ తరవాత ఉద్యోగం ఇలా సమయం గడిచిపోయింది. ఆ చెట్లు చూడగానే రాజేష్ కి తన ఫ్రెండ్స్ అందరు గుర్తు వచ్చారు. ఒక్క సారిగా కళ్లు చెమర్చాయి. స్కూల్ లోపలికి వెళ్ళాడు ఇంకా ఎన్నో చెట్లు మొక్కలు కనిపించాయి.
రాజేష్ ని గుర్తు పట్టిన టీచర్లు సాదరంగా ఆహ్వానించారు. అందరికీ నమస్కరించి , స్కూల్ ఒక ఉద్యానవనం లా ఉంది అని చెప్పాడు.
అవును రాజేష్ నువ్వు మొదలెట్టిన తరవాత అందరూ వాళ్ల పుట్టిన రోజుకి ఒక మొక్క నాటడం అలవాటు చేసుకున్నారు. ఆ అలవాటు ఇవాళ స్కూల్ కి ఇంత అందాన్ని ఇచ్చింది. మంచి వాతావరణం లో పిల్లలు చదువుకుంటున్నారు. నీగురించి మేము పిల్లలకి చెప్తూ ఉంటాము . ఒక స్టూడెంట్ తీసుకున్న మంచి నిర్ణయం వల్ల ఇవాళ మన స్కూల్ ఒక నందనవనం లా మారింది. రాజేష్ తన టీచర్లు అందరికి నమస్కరించి చాలా ఆనందించాడు.


K VENKATA RAMANA RAO
Visakhapatnam
Mobille 9866186864