జీవనరాగం ..!! (వచన పద్యాలు):-------డా.కె.ఎల్.వి.ప్రసాద్ హన్మకొండ.

 కోపతాపాలూ -బంధువులతో విభేదాలు ,
ఇరువైపుల దండిగా పట్టుదలల పరాకాష్టలు ,
తెగేవరకు లాగరాదు తాడు ,తెలుసుకో సొదరా !
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
------------------------------------------------------------------
పంతాలూ-పట్టింపులు ,కుటుంబ కలహాలు ,
ప్రేమలూ -పెళ్లిళ్లు ,కలసిరాని సహవాసాలు ,
సమీక్షించి -సర్దుకుపోవాల్సిన అవసరాలు !
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
-------------------------------------------------------------------
స్నేహమన్నది జీవితాన,చెరగకూడని ముద్ర,
తేడాలూ-విభేదాలూ,తప్పవేమో ఎక్కడైనా!
ఒకరినొకరు తెలుసుకుంటే సడలిపోదు స్నేహం ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------------
భార్యా-భర్తలు,ప్రేమ పక్షులు మాత్రమే కాదు,
మంచి స్నేహితులుగా కూడా మారిపోవాలి...!
కష్ట సుఖాలను తెగువతో కలసి పంచుకోవాలి,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
---------------------------------------------------------------------
పిల్లల సమక్షంలో,తగువులు-పోట్లాటలు తప్పు
ఒకరికొకరు దుర్భాషలాడుట మహా ముప్పు అని,
తెలుసుకోవాలితల్లి దండ్రులు తమభవిశ్యత్ ఘొష !,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము...!!
--------------------------------------------------------------------
పిల్లలుండు చోటు అందరికీ పరమ పవిత్రమైనది ,
సరస సల్లాపములకది అసలు నెలవు కాదు.....!
కొంటెచేష్టలన్నీ పిల్లలకు మిమిక్రీ దినుసులు కావచ్చు,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
---------------------------------------------------------------------
చిన్న పిల్లల చిట్టి -పొట్టి చేష్టలు ,చిలిపిపనులు ,
జీవిత మనో ఫలకాన చిత్రించబడే మైలురాళ్ళు !
'అతి'కి సున్నితముగా ఆనకట్ట వేయవలే సుమా ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము.....!!
-------------------------------------------------------------------
పిల్లలను గారాభము చేయుట తప్పుకాదు ,
అతిగారాభం మాత్రం వారి భవితకు చేటు ..!
తెలివిగా మెలగవలయు తల్లిదండ్రులెప్పుడూ ,
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సుమ్ము....!!
--------------------------------------------------------------------
తెలియక పిల్ల లు చిన్న తప్పు లెన్నో చేస్తారు,
పెద్దల భయానికి అబద్దాలు ఎన్నో చెబుతారు !
తప్పు గుట్టును మృదువుగా విప్పిచెప్పవలె...
వినుము కె.ఎల్వీ.మాట,నిజము సు మ్ము....!!
---------------------------------------------------------------------
క్రమశిక్షణ పేరుతో పిల్లల ను  దండించ రాదు  ,
బయపెట్టి పసిమనసుల ను ,హింసించరాదు !
మంచిమాటలతోనే హితవు పల్కుట మేలుగదా,
వినుము కె.ఎల్వీ.మాట ,నిజము  సుమ్ము...!!
---------------------------------------------------------------------