పోతన పద్యం :-సుకన్య

 కం . పోతన్న కైత చెప్ప , వి 
       ధాత సతి ప్రసన్నమగు వి  ధానము జూడన్ ,
       పాతకములుడిగి చదువరి 
       లోతౌ  రస  దివ్య ఝరుల లోతుల దెలియున్ . 
ఆ . తేనె కొంత తెచ్చి తీయన్ని పాలతో 
     పానకంబు చేసి పద్యములను 
     నానబెట్టి తీసి నయముగ మనకిట్లు 
     కానుకిచ్చినాడు కావ్యమల్లి . 
ఆ . అందమైన విరులు కుంద మందారాలు 
     జాజి పొన్న పూలు చాలా తెచ్చి 
     పద్య మాల లల్లి భారతి గళమున 
     భక్తి మీర వేసి పరవశించె . 
ఆ. మంచి ముత్యములును , మాణిక్యముల ప్రోవు 
    మించు శారదేందు మెరుగు రాశి 
    ప్రోగు చేసి గుచ్చి పొంకమౌ పద్యాల
    నలువ నాతి కర్చ నంబు చేసే . 
ఆ.  ఒక్క పద్య మైన ఒప్పుగా నేరిచి 
     చదవ వలయు బాల, చవులు మీర . 
     వారసత్వ మింక వదలగా వలదని 
     కోరి నేర్చు కొండు గొప్ప ధనము . 
కం. శారద కరమున పద్మము 
     జారిన మధు బిందువొకటి  మారెను తెలుగై . 
     కోరకె దొరికిన వరమగు 
     తీరుగ మనమిట్లు తెలుగు వారల మగుటన్ . 
పోతన భాగవతం మన వారసత్వ సంపద .  మన భాష ,సాహిత్యం  . మనం కోల్పోకూడదు . 
పిల్లలు ఒక్క పద్యమైనా ,అర్థం చేసుకుని నేర్చుకుంటే ఇప్పటిది గొప్ప సేవ తెలుగు కి.  

కామెంట్‌లు