ఊరు ఉమ్మగిల్లిపోయింది ..!!:-------శీరంశెట్టి కాంతరావు రచయిత పాల్వంచ

 జాతీయ రహదారిని దాటి ఫకీర్ల వీథిగుండా ముందుకెళితే మా పాఠశాలవస్తుంది
ఆ వీథికి ఎడమపక్క ఏనాటిదో విశాలమైన మజీద్ నల్లగా గారసున్నంతో గతవైభవ చిహ్నంగా మౌన గంభీరంగా వానర సమూహాలకు ఆవాసంగా నిల్చివుంటుంది.
కుడిపక్కన ఇరుక్కంతతో పొలాలకు వెళ్ళే డొంక దారి చెదిరిపోయిన బండ్ల గాడితో వింతగా కన్పిస్తుంది
బడిచుట్టూ వున్న చేలల్లో రకరకాల పంటలు మాకు అనాయాసంగా వ్యవసాయ శాస్త్రాన్ని బోధిస్తుండేవి
ఓసారక్కడ ఎకరంన్నర దోసతోట వేశారు
సన్నని తీగల్తో, పసుపుపచ్చ పువ్వుల్తో నదీ ప్రవాహపు సానరాళ్ళమీద నునుపుదేరిన గుండ్రాల్ల మాదిరిగా పిందెలప్పుడు ఆకుపచ్చగా కాయలప్పుడు పసుపు పచ్చగా తోటంతా పర్చుకున్న నక్కదోస కాయలు తరగతి గదుల్లో కూర్చున్న మమ్ముల్ని నిరంతరం రారండోయ్! రారండోయ్! అంటూ ఆహ్వానిస్తున్నాయ్
పంతుళ్ళ పర్యవేక్షణలో తలగూడా తిప్పిచూడలేని  మానిస్సహాయతను మౌనంగా తోటతో విన్నవించుకునేవాళ్ళం
అయితే
మజీద్ లోని వానరమూకలు మాత్రం తోటమీద  పదే పదే దాడి చేస్తూతోటమాలిని చికాకు పర్చి పంటకు నష్టం చేస్తుండేవి
యజమాని హెచ్చరికల్తో కినిసిన తను మజీద్ దిక్కు తోటలోని కాయలకు బొక్కలు తొల్చి , ఎండ్రిన్ పోసి పక్కకు తప్పుకున్నాడు
అతని అంచనా ఫలించింది
ఒక్కగుంపుగా వచ్చిపడిన కోతులు ఇరైనాలుక్కు ఇరవై నాలుగూ
రాగివర్ణపు ముద్దల్లా పడి అశువులు బాశాయి
విషయంతెలిసిన ఊరు ఒక్కసారిగా గగ్గోలు పెట్టింది తల్లినికోల్పోయినఓరోజుల పిల్ల
రొమ్ములు పట్టిచీకుతూ రోదిస్తుంటే చూసిన
ఊరు ఉమ్మగిల్లిపోయింది యజమాని, తోటమాలి 
ఊరువిడిచిపారిపోయారు
పాపం పసిపిల్ల స్ప్రుహతప్పిపోతుంటే వందలమంది వాగులు వంకల్లో పడి నత్తగుల్లలేరుకొచ్చి పగులగొట్టి నీళ్ళల్లో జలపరించి ఆ నీటిని పట్టించారు
రెండు బండ్ల మీద ఊరేగించిన మృతవానరాల్ని ఖననంచేశారు
బ్రతికిన పిల్లను ఓ నిస్సంతు దంపతులు సాదుకున్నారు
ఆరునెల్లు తిరిగొచ్చేటప్పటికి
తోటమాలి పిచ్చెక్కి చచ్చాడు
పిల్లను సాదిన తల్లి గర్బం దాల్చింది.!!
 .