తిన్నారా తాటి రొట్టె ..!?:-డి.జి.కల్యాణ్ కుమార్ , తూర్పు గోదావరి


  గోదావరి జిల్లాల్లో ఏ మూలకువెళ్లినా అక్కడి పొలాల్లో దొరికే తాటిపళ్ళతో చక్కటి పదార్ధాలు తయారు చేసుకోవొచ్చు. వర్షకాలంలో ఈ తాటిపళ్ళు ఎన్నో అద్భుతమైన మన పల్లెటూరిరుచులను అందిస్తాయి. వీటితో రొట్టెలు, ఇడ్లీలు, గారెలు లాంటివి చేసుకుంటే అద్భుతః.  
నా చిన్నప్పుడు తాటిపళ్లకోసం ప్రొద్దునే  పొలాలకు పెరిగెట్టేవాళ్ళం, అప్పటికే చెట్టు మొదట్లో పళ్ళు రాలి వుండేవి.వాటిల్లో కాస్త మంచివి ఏరుకొని పక్కన నడిచే బోదెల్లోనో,కలువల్లోనో కడుకునేవాళ్ళం.పక్కనే ఉండే గడ్డివాము లోంచి వరి గడ్డి వీటికిచుట్టి  తాటాకుల మంటతో కాస్తా దోరగా కాల్చుకొని అరిగించేసే వాళ్ళం. 
నా  చిన్నప్పుడు అమ్మమ్మ తాటి పళ్ళను   కుంపట్లో పెట్టి,గుండ్రంగా కాలేవరకు తిప్పుతూ కాల్చేది.బాగా కాలిపోయాక పైతొక్క తీసేసి  లోన టెంకకున్న గుంజు కోసం పీచును పళ్ళతో పీకుతూ తింటుంటే భలే తమాషాగా ఉండేది.రుచైతే ఇక చెప్పక్కర్లేదు. 
ఇప్పటి తరానికి ఇవి చెయ్యడం అంతగా కుదరడండి,ఆ మాటకొస్తే మన అమ్మ వాళ్ళకి కూడా చాలా మందికి రాదండి.ఈ తాటిపళ్లతో రొట్టెలు లాంటివి చెయ్యాలంటే మన అమ్మమ్మ, నానమ్మ వాళ్లేనండి ఆయ్... !!
తాటి పళ్ళను పూర్తిగా శుభ్రం చేసి 'పరుగుడు'(ఓ అడుగు ఎత్తువుండే ఇనుప నిచ్చెన లాంటి పనిముట్టు)తో ఆ కాయలనుండి గుజ్జు తియ్యడం పెద్ద పని. దానిని తాటి "పీసం" అంటారు. పేశం తీసాక దానిలో సరిపడా వరి నూక, కొద్దిగా బెల్లం, కొబ్బరి తురుము, యాలికకాయాల పొడి కలిపి నాలుగైదు గంటలు నాన బెట్టుకుని,చిన్న మంటపై మూకుడులో రొట్టెల్లా వేసి కింద నుండి కాసంత సెగ తగిలించి పైన ఒక అరిటాకును బోర్లించి కింద పొయ్యిలో ఉన్న నిప్పుల్ని అరిటాకు మీద వేసి కొంచం సేపు కాలాక ఆ నిప్పులు తీసివేసి పైన ఎందుకు నిప్పులు వెయ్యడం అంటే దిబ్బరొట్టె అంటే బాగా దలసరిగా ఉంటుంది కదా, కింద పెట్టిన మంట వలన బాగా కాలినట్టే మరి పైన కూడా కాలడం కోసం ఆ నిప్పులు వేసేది అలానే తాటి ఇడ్లీ, తాటి గారెలు కూడా వేసుకోవచ్చు. కాల్చిన రొట్టె మరునాటికి మరింత రుచిని ఇచ్చేది. రోట్టేకు పైన క్రిందా కాలిన మాడు కూడా ప్రత్యేకమయిన రుచిని సంతరించుకుంటుంది.
ఈ ఆధునిక కాలంలొ  పట్నాలమాదిరిగా పల్లెల్లో 
కూడా పాతరుచులు అదృశ్యమయి పొయే ప్రమాదం కనుచూపు మేరలో కనిపిస్తున్నట్లుగా 
ఉంది .అంతేగా కాలంతో పాటు మనమూ మారాలి .
మార్పు అనేది సహజంకదా !లేదంటే తాటిపప్ప
తాటిరొట్టెగా మారినట్టే,మరో ఆధునిక నామం
తగిలించుకుని మనకే కొత్తగా కనిపించవచ్చు !!