కరోనా రుబాయిలు-డాక్టర్ అడిగొప్పుల సదయ్య
దూరమైన బంధాలను ముడివేశావు
బండలైన గుండియలను తడిచేశావు
ఎంత మంచి హృదయమున్నదాన కరోన!
ప్రేమామృత సాగరమున పడవేశావు

మరుగుపడిన అలవాట్లను నేర్పించావు
పరుగుపెట్టు జీవితమును మార్పించావు
కరడుగట్టి గుండెయున్నదాన కరోన!
అందమైన కొత్తబడిన చేర్పించావు

ఇంత మంచి నియమాలను చూడకపోతె
చింతలేని మనుషులంత నడవకపోతె
కొంత కూడ దయచూడక ఓసి కరోన!
మంచి చెడ్డ చూడకుండ చంపుతావటె

మనిషిలో మానవత మసిబార పూశావు
రక్త సంబంధాల రగిలింపజేశావు
జగతిపై పగ ఇంత ఎందుకే కరోనా?
గుండె లోగిళ్ళనల గొళ్ళెమున మూశావు

పేగు బంధములను దెంపి వేరుచేసి చూశావే
వెజ్జులలో గుండె దీసి పైస ఆశ పోశావే
పగబట్టితివెందుకింత కరుణలేని ఓ కరోన?
లోకమంత విషముజల్లి వల్లకాడు చేశావే


కవిచక్రవర్తి
అడిగొప్పుల సదయ్య
వ్యవస్థాపక అధ్యక్షుడు
మహతీ సాహితీ కవిసంగమం-కరీంనగరం
9963991125