బోటనీక్లాస్ ...బాగోతం....!!:---------శ్యామ్ కుమార్ నిజామాబాద్.

కాలేజీ జీవితంలో 'డిబార్ 'అన్న పదము చాలా భయంకరమైనది.  చాలా పెద్ద తప్పు చేస్తే డిబార్  చేస్తారు అని భయం ఉండేది ఆ రోజుల్లో.  విద్యార్థుల ను కంట్రోల్ చేయడానికి అదొక పెద్ద బ్రహ్మాస్త్రం లాగా పని చేసేది.  కానీ మేము చేసి న చిన్న తప్పు కి మా ప్రిన్సిపాల్ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం  లాగా  పెద్ద శిక్ష వేసారు మా మీద.అది
 ఎలాగ జరిగిందంటే!!
 మేము ఐదుగురం స్నేహితులం కాలేజీలో అన్నింటా ముందు ఉంటూ టాప్ ర్యాన్కర్లలో ఒకరి గా ఉండేవాళ్ళం.  మా లో ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం లాగా కనిపించే కేవీ శ్రీనివాస్ ఎప్పుడు సరదాగా ప్రతి మాటను నవ్వు పుట్టించే విధంగా మార్చేసే వాడు.   ఎంతటి  గంభీరమైన సమయాల్లో కూడా నవ్వు పుట్టించే మాటలు మాట్లాడి అక్కడ ఉండే సీరియస్ వాతావరణాన్ని మార్చేసేవాడు.
 ఒకసారి బోటనీ క్లాసులో నారాయణ రెడ్డి గారు  అని మా లెక్చరర్ చాలా  ముఖ్యమైన విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు  ఇంతలో ఎవరో ఒక విద్యార్థి చాలా మెల్లిగా గ్యాస్ వదిలినట్టు గా    కుయ్యి  అంటూ చప్పుడు వినిపించింది  .  అప్పటికే అది విని మేము నవ్వును   కంట్రోల్ చేసుకొని కూర్చున్నాం.
 అయితే శ్రీనివాస్ మాత్రము విని కూర్చోకుండా ఒక చిన్న మాట వదిలాడు అది మా నలుగురికి మాత్రమే వినిపించే ట్టుగా.  
అదేమిటంటే  "ఒరేయ్!  చిన్న ప్లేన్ ల్యాండింగ్ అయింది" అన్నాడు. ఇక నవ్వు కంట్రోల్ చేసుకోవడం మా వల్ల కాలేదు. మేం నలుగురం నవ్వటం మొదలు పెట్టాం. నోరు మూసుకుని  నవ్వుతున్న ప్పటికీ మా లెక్చరర్ నారాయణరెడ్డిగారు  అది గమనించి మమ్మల్ని నలుగురిని చూసి "యు ఫోర్ స్టాండ్ "అన్నారు.
మేము  చేసేదేమీ లేక లేచి నిలబడ్డాం. 
" ఎందుకు నవ్వుతున్నారు అసలు నవ్వుకు కారణం ఏంటి చెప్పండి "  అన్నారు , పుస్తకం, చాక్ పీస్   బల్ల మీద పడేసి. 
 మేము నవ్వు ఆపుకుంటూ :ఏం లేదు సార్" అన్నాం .
" మీకు క్లాస్ మీద ఇంట్రెస్ట్ లేదా "అన్నారు.
" ఉంది సార్ "అన్నాం .
" మరి అయితే  నవ్వు లు ఎందుకు వస్తున్నాయి?" అన్నారు .
ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాం. క్లాసులో  అమ్మాయిలు కూడా మమ్మల్ని చూస్తున్నారు. అటువంటప్పుడు మేము  ఏమని చెప్పాలో అర్థం కాలేదు. 
"అంటే నా క్లాసు మీకు నవ్వులాటగా ఉందా , లేక నేను మీకు జోకర్ లాగా కనపడుతున్నానా ?"అని అడిగారు  .
"లేదుసార్ అటువంటిది ఏమీలేదు "అన్నాం.
" పర్వాలేదు మీకు క్లాస్ ఇంట్రెస్ట్ లేనట్టుంది ,మీరు బయటికి వెళ్ళిపోవచ్చు" అన్నారు.
" ప్లీజ్ సార్  క్లాసు లో వుంటా"మని  చెప్పాం.
 "అవసరం లేదు క్లాస్ డిస్టర్బ్ చేస్తున్నారు మీరు బయటికి వెళ్ళండి" అని మమ్మల్ని పంపించేశారు. బయటకు వచ్చి మిగిలిపోయిన నవ్వులు నవ్వుకొని  శ్రీనివాసుని పై అందరం తలా నాలుగు  ముష్టి ఘాతాలు వేసి  క్యాంటీన్ వైపు  చాయ్ కొట్టడానికి అడుగులు  వేశాం. 
 అక్కడ  బిల్లు మాత్రం ఎప్పుడు కామేష్ కాని లేదా రావు గాడు కానీ కట్టేది.  నాన్నగారు నాకు అతికష్టం మీద ఇచ్చిన ఐదు రూపాయల నోట్ ని నేను చాలా జాగ్రత్తగా సీక్రెట్ ప్యాకెట్ లో  దాచుకుని పెట్టుకునే వాణ్ని.  మా అందరి లోకి  ధైర్యవంతుడు  వెంకు అని చెప్పాలి.  గొడవలకి, కొట్టుకోవడానికి జంకే వాడు కాదు.  కానీ స్నేహితుల కి ,  కావలసిన వారికి ఎంతో సహాయం చేసేవాడు.  మంచి    స్ఫురద్రూపి,  అందమైన వాడు.  కాస్త ఉద్రేక స్వభావం ఉన్నప్పటికీ,  మంచి హిందీ పాటలు పాడుకుంటూ జీవితంలో ఉన్న మాధుర్యాన్ని  ఆస్వాదించేవాడు .
      ఒకరోజు కాలేజీకి వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నాం. కాస్త దూరం వెళ్ళగానే రోడ్డు పక్క నుంచి ఏనుగును నడిపించుకుంటూ ఒక అతను వెళుతూ కనిపించాడు. అక్కడే బస్సు ఆగింది. అది సుభాష్ నగర్ బస్ స్టాప్ ,అటు పక్కనే ఉన్న  గవర్నమెంట్  కాలనీ లో నుండి బస్సు ఎక్కటానికి మా ప్రిన్సిపాల్ గారి కూతురు వస్తోంది.  ఆ అమ్మాయి కాస్త ఒళ్ళు చేసి    బొద్దుగా కనిపించేది. 
 ఆ సమయానికి మా శ్రీనివాస్"అదిగదిగో ఏనుగు వస్తుంది " అన్నాడు,   ప్రక్క నుంచి వెళ్తున్న  ఏనుగును గమనించి.  మమ్మల్ని మాత్రమే ఉద్దేశించి చాలా చిన్నగా అన్న సంభాషణ  . కానీ దగ్గర్లో ఉన్న అమ్మాయిలు విని అది ప్రిన్సిపాల్ గారి కూతురు గురించి అంటున్నాడు అని భావించుకొని నవ్వేశారు.  అంతటి తోటి ఆ అది ముగిసిపోయింది అని అనుకున్నాం. కానీ అది చాలా సీరియస్ పరిణామాలకు దారితీస్తుందని మేము ఊహించలేదు.
 కాలేజీ కి వెళ్ళిన తర్వాత మొదటి  క్లాస్ అయిపోయిన వెంటనే మాకు ప్రిన్సిపాల్ నుంచి కబురు వచ్చింది.  మేము ఐదుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని కారణం తెలియక ప్రిన్సిపాల్ గారి   రూమ్ లోకి వెళ్ళి నిల్చున్నాము. 
 ఆయన కాసేపు మమ్మల్ని  తీక్షణంగా చూసి, "మీరు మంచి పిల్లలు అనుకున్నాను ,చదువులో కూడా బాగానే ఉన్నారు ,కానీ క్రమశిక్షణ అన్నది మీలో తక్కువ అవుతుంది .  మిమ్మల్ని ఒక వారం డిబార్ చేస్తున్నాను మీరు కాలేజీకి రావాల్సిన అవసరం లేదు ఇక వెళ్ళండి" అన్నారు. 
అసలు దేని గురించి  డిబార్ చేస్తున్నారో ,దేని గురించి  పిలిపించి   చివాట్లు   పెట్టారో,  మాకు ఎవరికీ తెలిలేదు.
  మేము ఆశ్చర్యపోయి చర్చించుకున్నాం.  అసలేం జరిగింది ?  యే విషయంలో ఆయన సీరియస్ అయ్యారు? దేని గురించి ఈ చర్య తీసుకున్నారు ? అని .  తల బద్దలు కొట్టుకున్నా మాకు అర్థం కాలేదు.    ఎందుకంటే మేము చేసే కోతి పనుల లో ఏది అంతగా సీరియస్ అయ్యే విషయమో మాకు అర్థం కాలేదు .ఈ విషయం ఇంట్లో కూడా చెప్పలేదు.  ఎప్పటిలాగే మరుసటిరోజు కూడా పుస్తకాలు, టిఫిన్, డబ్బులు తీసుకొని కాలేజ్ కి బయల్దేరాం. ఆఖరి గంటకొట్టి క్లాసులు మొదలయ్యే సమయానికి మేము వెళ్లి కాలేజీ   వరండా ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో  చిన్న చెట్టు కింద కూర్చున్నామ్. మా తోటి విద్యార్థులు ఎవరికీ ఈ విషయం తెలియక కన్ఫ్యూజన్లో మమ్మల్ని చూస్తున్నారు.  ఉపాధ్యాయులందరికీ  ఈ విషయం తెలుసు గనుక ఎవరూ మాట్లాడలేదు.  క్లాసులో పాఠాలు మొదలయ్యాయి. కాలేజ్ అంతా నిశ్శబ్దం అయిపోయింది.  ఎప్పటిలాగే మా ప్రిన్సిపాల్   అన్ని క్లాసులను చూసుకుంటూ వరండాలో తిరుగుతున్నారు.  అటుగా వెళుతూ వెళుతూ మమ్మల్ని చూశారు. మేము వెంటనే లేచి  అ టెన్షన్ లో నిలబడి నమస్కారం పెట్టాం.  తల ఊపుతూ సీరియస్ గా మొహం పెట్టి వెళ్ళిపోయారు.   రెండవ రోజు కూడా అలాగే జరిగింది. మూడవ రోజు మేము లేచి నిలబడి నమస్కారం పెట్టగానే మమ్మల్ని చూసి తన రూములోకి  రమ్మన్నట్టు గా తల ఊపి వెళ్ళిపోయారు. మేము వెంటనే లేచి బట్టలు     దులుపుకొని, పుస్తకాలు పట్టుకుని    ఆదరాబాదరా  గా రూం లోకి వెళ్ళాం. ఐదు నిమిషాలపాటు  ఆయన ఏమీ మాట్లాడకుండా పని చేసుకుంటున్నారు. తన పని అయిపోయిన తర్వాత పేపర్లు పక్కన పెట్టి మా వైపు చూసి
"   మీరందరూ మంచి  సంస్కారం కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారు.  
 చదువులో ముందుంటే  సరిపోదు .అదొక్కటే చూసి ,మీరు ఏం చేసినా ఇక్కడ నడుస్తుంది అని పొరపాటు పడవద్దు!!.  ఇది మీకు లాస్ట్ వార్నింగ్!! ఇంకొకసారి మీ గురించి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా మీకు టి సి లు ఇచ్చి కాలేజ్ నుంచి పంపించేస్తాను.  అర్థమైందా? ,   ఇంక  క్లాసులో కి వెళ్లి కూర్చోండి "అన్నారు.
 'హమ్మయ్య బ్రతికి బయట పడ్డామురా బాబు' అనుకుంటూ  ఊపిరి పీల్చుకుంటూ క్లాసు లోకి వెళ్ళిపోయాము.  ఈ విషయంలో మాకు చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లు అయింది.  మాకు అవమానం జరిగినట్లుగా మేము  బాధపడ్డప్పటికీ
 అసలు విషయము మెల్లిమెల్లిగా కాలేజీలో అందరికీ తెలిసి మేము హీరోలుగా ఇంకొక పై మెట్టుకు ఎక్కేసాం.  ఇదంతా జరగటానికి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ చేయడానికి ముఖ్య కారణం , అమ్మాయిల లో  ఒక' 'నాయకురాలు 'అని మాకు తెలిసింది.  కానీ   విచిత్రమైన విషయం ఏమిటంటే   కాలేజీ  చదువు అయిపోయాక  , ఇంకా పై చదువులు చదివిన తర్వాత ఎన్నో సంవత్సరాల కు, మాకు పెల్లీడు వచ్చిన తర్వాత,  మా ఐదుగురిలో ఒకడైన స్నేహితుడితో ఆ.. నాయకురాలికి వివాహం జరిగడం ఇక్కడ కొసమెరుపు!
అందుకే అంటారు 'భవిష్యత్తు తెలుసుకోవడం ఎవరితరం కాదు' అని.అదేగా జీవితమంటే!

ఫోటోలో-----2021 లో చదువుకున్న కళాశాల దగ్గర శ్రీమతులతో  మిత్రత్రయం.