బాబా మహిమ ...!!:-శీరంశెట్టి కాంతారావు.రచయిత పాల్వంచ

 మా ఊరు మధ్యనుండి వెళ్ళే జాతీయ రహదారి ఎప్పుడూ రద్దీగా వుటుంది.
ఆరునెల్ల కింద హఠాత్తుగా చుక్కతెగి పడ్డట్టు
రాజస్థాన్ నుండి  మల్లెపూల అరుగు సెంటర్లలో రాందేవ్ బాబా హోటల్ వచ్చివాలింది
అప్పట్నుంచి ఊళ్ళో మగవాళ్ళంతా దాదాపు ఇండ్లల్లో కాఫీ, టీలు తాగడమే అరుదైపోయింది
కాఫీ టీల్లో వాడు నల్లమందో? గంజాయో కలిపి పోస్తున్నాడు అందుకే ఈ మగవెధవలంతా ఇళ్ళల్లో మానేసి అక్కడికి అలవాటు పడ్డారని ఆడవారంతా నెత్తీనోరు కొట్టుకోసాగారు .
ఇంతలో కొంచం వయసుడిగిన
ఓ పిచ్చావిణ్ణి ఏ లారీవాడో తీసుకొచ్చి ఊరిచివర ఎక్కడో
వదిలేసి వెళ్ళాడు 
ఆవిడ మెల్లిగా ఊరి అండకు చేరింది
తనకు హిందీ తప్ప అన్యం రాదు 
మాఊళ్ళో సాయిబ్ లకు తప్ప వేరెవ్వరికీ హిందీ తెలీదు
కొన్నాళ్ళపాటు ఊళ్ళో అటు తిరిగి ఇటు తిరిగి తను రాందేవ్ హోటల్ దగ్గర అలవాటయ్యింది
గుణం కుదిరితే ఏదోపనిచేసి పెట్టింది తినేది
లేకుంటే లారీడ్రైవర్ల వెంటపడి పావులో బేడో అడుక్కునేది
ఆవిడొచ్చిన ఏడాదికి 
ఓరోజు పొద్దున్నే హఠాత్తుగా వస్తున్న లారీకిందపడి కప్పపిల్లలా చితికి పోయింది
ఊరు అయ్యో అంది తప్ప అడుగు ముందుకెయ్యలేదు  మా అమ్మైతే అట్లాగే వదిలేస్తానా అంటూ రాందేవ్ నడుం కట్టి అయిదువేలు ఖర్చుపెట్టి  
ఊరంతా విస్తుపోయేలా ఘనంగా మట్టిచేశాడు
ఆ దెబ్బతో ఊరి వాళ్ళ దృష్టిలో అతనో మానతామూర్తయ్యాడు 
మరో ఆరునెల్లకు రాందేవ్   ఎట్లావచ్చాడో అట్లాగే 
ఓరోజు రాత్రి హఠాత్తుగా
మాయమయ్యాడు
అట్లెందుకు చేశాడో!? 
ఊరికి అర్థంకాలేదు
చచ్చిపోయిన పిచ్చావిణ్ణి తన తల్లిగా కాగితాలు పుట్టించి ఇన్సూరెన్స్ ఐదులక్షలు ఎత్తుకొని ఎగిరిపోయాడని ఆలస్యంగా తెలుసుకున్న ఊరు చావుకి ఐదువేలు ఖర్చుపెట్టి..! ముక్కున వేలేసుకుంది
కానీ, పాలుపోసే ఆడవారికి
అధికవడ్డీ ఆశచూపి లక్షల్లో పిండుకుపోయాడన్న విషయం 
ఎక్కడా పొక్కలేదు
ఎందుకంటే? పాపం!
తేలుకుట్టిన దొంగలు ఏడవలేరు కదా?
                

కామెంట్‌లు