పోస్ట్, పోస్టుమాన్:-- యామిజాల జగదీశ్

నేను 
నా జీవితంలో అందుకున్న 
తొలి పోస్టు 
ఏ తేదీనో అని గుర్తు పెట్టుకోవడం 
నా తప్పిదమే
నా మతిమరపుని
నిలదీయడం సరికాదు
అయితే
ఇప్పటికి అందుకున్న 
చివరిపోస్ట్ గుర్తుంది
అది మూడు పుస్తకాల ప్యాకెట్...

ఆ తర్వాత 
ఇంకెంత కాలం 
నాకు పోస్టొస్తుందో 
చెప్పలేను కానీ
ఓ పోస్ట్ కోసం మాత్రం
ఓ వారం రోజులుగా
సమయం మధ్యాహ్నం 
రెండవడంతోనే
నా కాళ్ళూ 
నా కళ్ళూ 
బాల్కనీలో 
పోస్టుమాన్ కోసం 
నిరీక్షిస్తున్నాయి
కానీ సైకిల్ మీదొచ్చి 
ఉత్తరాలిచ్చిపోయే 
ఈ పోస్టుమాన్ జాడే లేదసలు

ఆశ్చర్యమూ
విస్మయమూ 
కలిగాయి

పోనీ 
నాకు 
నేననుకున్న పోస్ట్ 
నాకు రాకపోవడం 
అటుంచితే
అసలు పోస్టుమాన్ 
మేముండే కాలనీలోకే రాలేదని
తేలింది ఓ నలుగురైదుగురిని
వాకబు చేయగా....

మేముండేదేమీ అడవి కాదు
భాగ్యనగరంలో
అనేక నాలుకలపై నానే
మౌలాలీ అనే ప్రాంతంలోని 
గాయత్రీ నగర్ కాలనీ
ఈ కాలనీలో 
వందిళ్ళు తక్కువ ఉండవు
అటువంటి కాలనీలో 
ఏ ఒక్కరికీ పోస్టులు రావా
ఏ ఒక్కరూ మరెవరికి 
ఉత్తరాలు రాయరా
పోస్టంటే మ్యూజియంలో 
ఉంచవలసినదిగా మారిపోబోతోందా
ఏమో తెలీదు 
కానీ
ఒకప్పుడు 
వాకిట్లోకొచ్చి పోస్ట్ అని వినపడే మాట
ఎంతానందంగా ఉండేదో
ఇప్పుడా మాట ఏడాదికో శివరాత్రి అన్నట్టయిపోవడం విచారకరం

వాట్సప్పులూ
టెలిగ్రాములూ వంటి 
మాధ్యమాల ప్రవేశంతో
పోస్టనేది అక్కర్లేనిదైపోయిందా
ఆలోచిస్తే
ఎంత బాధేస్తుందో చెప్పలేను

కామెంట్‌లు