స్వయంకృతం :--సరికొండ శ్రీనివాసరాజు

 
      ఆ అడవిలో చెట్లను నరికివేస్తున్నారు. జంతువుల వేట ఎక్కువైంది. నానాటికీ అడవిలో పక్షుల, జంతువుల సంఖ్య బాగా తగ్గుతుంది. ఇది అడవికి రాజైన సింహాన్ని ఎంతో బాధ పెట్టింది. సింహం అడవి అంతా తిరిగి రాబోయే ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప తమ నివాస స్థలాలలను వదలి బయటికి రావద్దని ప్రచారం చేసింది. సింహం చేసిన సూచనను విన్న జంతుజాలం క్షేమంగా ఉన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీవులు వేటగాళ్ళకు దొరికిపోయాయి.
       ఇటీవల వేటగాళ్ళు ఆ అడవి వైపు రావడం లేదు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఎక్కడెక్కడికో వెళ్ళిన కోతులు వంటి జీవులు తిరిగి ఆ అడవికే చేరుకుంటున్నాయి. సింహం అడవి జీవులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మార్పుకు కారణం ఏమిటని అడిగింది. అప్పుడు పావురం "మానవులు కరోనా అనే వైరస్ బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. ఇది అంటువ్యాధిలా ఒకరి నుంచి చాలా మందికి సోకుతుంది. ఆలస్యంగా గుర్తించడం, ఒంట్లో ఇతర జబ్బులకు తోడు ఈ వ్యాధి సోకడం వల్ల చాలామంది మరణిస్తున్నారు. అయితే భయం వల్ల చాలామంది చేస్తున్నారు." అంది. ఆ వ్యాధి ఏ కారణంగా పుట్టింది, దాని లక్షణాలను వివరించింది. " భలే భలే! అడవి జీవులను నిత్యం భయపెడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే భయంతో చస్తున్నారు." అంది జింక. "శాకాహారంతో బ్రతుకగలరు కదా! అది చాలదన్నట్లు రుచుల కోసం చాలా అడవి జీవులను చంపి తింటున్నారు. చివరకు గబ్బిలాలను కూడా వదలడం లేదన్నమాట. వారికి తగినశాస్తి జరగాల్సిందే." అన్నది మయూరం. " ఎవరి మీదా కసి మంచిది కాదు. ఇతరుల చెడును మనం కోరుకోకూడదు." అన్నది కోతి. "మీ చుట్టాలు దుర్మార్గులైనా తెగ పొగిడేస్తున్నావే." అని వ్యంగ్యంగా అంది కుందేలు. "మానవులలో అందరూ దుర్మార్గులు ఉండరు. కొందరు స్వార్థపరులు ఉన్నంత మాత్రాన మొత్తం మానవ జాతిని నిందించడం అవివేకం." అంది రామచిలుక.
       అప్పుడు పెద్దపులి ఇలా మాట్లాడింది. "మానవుడు తన జనాభాను విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాడు. నివాస స్థలాల కోసం చెట్లు, అడవులను నరుక్కుంటూ పోతున్నాడు. కాలుష్యం పెరుగిపోయి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆహారం సరిపోక ఇది తినవచ్చా, తినకూడదా అని ఆలోచించకుండా సమస్త జీవజాలాన్ని రాక్షసునిలా తింటున్నారు. దాని ఫలితంగా కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి." అని. అప్పుడు ఏనుగు ఇలా అంది. "ఇప్పటికే పరిస్థితులు చేయి జారి పోయాయి. ఈ విలయం ఇంకా ఎన్నాళ్ళో! ఇంకా ఎంత ప్రాణనష్టం జరుగుతుందో! మానవజాతి ఈ కరోనా ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. ఇప్పటికైనా మానవులు తమ తప్పు తెలుసుకుని, అలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా తృప్తిగా జీవిస్తే వాళ్ళకూ మంచిది.‌ మనకూ మంచిది." అని. "అంతే అంతే" అన్నవి ఇతర మూగజీవాలు.