అవయవదానం-గున్నాల సరళ

ఉ *మట్టిన పెట్టుదేహమిది మంచినిపంచుచు, పోవు ప్రాణముల్
చుట్టపు బంధమున్గొనక చూపగప్రేమల నంగముల్నిడన్
పట్టున నాల్గురోజులిట ప్రాణమునిల్పెడిదాతనీవుగా
పుట్టినజన్మధన్యతను పొందునుమానవజీవితమ్మునన్

ఉ*బూడిద కుప్పగావరలు పోయినప్రాణముదేహమంతయున్
మాడిన బొక్కలేమిటికి మంచినిపంచని వ్యక్తులేటికిన్
వీడగనాత్మ ,కాయమును వేరొక వ్యక్తికినీయపుణ్యమై
మూడినరోజునైనమది పొందునుతృప్తినిచచ్చిపోయినన్

తే.గీ*దానమందునన్నవయవ దానమేను
గొప్పదనుచును చెప్పగా ముప్పుకాదు
చెప్పగావలె నలుగురు యొప్పునట్లు
ఇవ్వనేర్పినచాలునీవిచ్చినట్లు

తే.గీ*ఉసురునూడగాదేహమ్ము ముసురునీగ
లిచట‌ ,యుండగాసేవలనింతచేయ
పోవుచుండగానంగమ్ము భూరిగాను
దానమిచ్చిన పుణ్యమ్ము దక్కుచుండు

తే.గీ*మందలోపుట్టు జంతువు మనిషిగాక
హృదయమున్నట్టి జీవిగా సదయుడగుచు
అవయవమ్ములదానమ్ము నందనీయ
ధరణి యందున పుట్టుక ధన్యమగును

తే.గీ*కళ్ళదానమ్మునీయగా కంటిచూపు 
నీవునిచ్చినయట్టుల నీడవయ్యి
గుండెదానమ్మునీయగా గుడినిగట్టి
పూజ జేయు వదాన్యుడు పొందుగాను
కామెంట్‌లు