శిల్పి...అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆచారి ఒక శిల్పి. ఎంతో కష్టపడుతూ  భక్తి శ్రద్ధలతో ఇష్టం గా శిల్పాన్ని  చెక్కుతున్నాడు.తెల్లారకుండానే కాలకృత్యాలు తీర్చుకుని దైవస్మరణ చేస్తూ శిల్పం చెక్కటానికి కూచుంటాడు.మధ్యలో  టిఫిన్ తిని చాయ్ తాగి రిలాక్స్ అవుతాడు. రోజూ  ఆదారి వెంట వెళ్ళే బాల శివ  కాసేపు  అక్కడ నించొని  ఆయన  చెక్కే పద్ధతి  గమనిస్తారు. పెచ్చులు పెచ్చులుగా  రాతి ముక్కలు ఎగిరెగిరి పడుతుంటాయి."పిల్లలూ!దూరం గా నించోండి.కంటి లో పడితే ప్రమాదం!బడికి వెళ్ళి బాగా చదువు కోవాలి. టైం వేస్ట్  చేస్తే ఎలా?"హెచ్చరిస్తాడు.
కంటి జోడు సవరించుకుంటూ  చెమటోడ్చి పనిచేసే  అరవై ఏళ్ల ఆచారి ఆపిల్లల దృష్టి లో  ఒక అద్భుత వ్యక్తి.
 "అంకుల్!ఇంత పొద్దుటే లేచి  ఎంత శ్రద్ధగా చెక్కుతున్నావో?!మేము  సాయంత్రంఇంటికి వెళ్లేటప్పుడు కూడా అలాగే కూచుని చెక్కుతుంటావు. ఉదయం 9నించి సాయంత్రం 5దాకా  స్పెషల్ క్లాస్ లో కూచోవాలంటే మాకు మహా విసుగు  చిరాకు! ఎప్పుడెప్పుడు  క్లాస్ నించి బైట పడాలా అని ఎదురు చూస్తూ ఉంటాం."  "పిల్లలూ! ఇంత చిన్న వయసులో విసుగు చిరాకు అంటే ఎలా?మీరు మెత్తని  మట్టి ముద్దలు.ఎటుపడితే అటు చక్కగా  సాగదీసి ఎలాగైనా  మలచుకోవచ్చు.చిన్నప్పుడు నేను బడి ఎగ్గొట్టేవాడిని.మాతాత  మానాన్న  ఇలా రాళ్ళు చెక్కుతుంటే చూసి  నేను ఉలి పట్టాను. ఏడోక్లాసు తో ఆపేసి  కులవృత్తి చేపట్టాను.మాకు ఎప్పుడూ పని దొరకదుకదా!?
 పైగా ఇప్పుడు  ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో బొమ్మలు తయారు చేస్తున్నారు.  ఆలయనిర్మాణపనులు ఎప్పుడూ దొరకవుకదా? మారెక్కలు ముక్కలు చేసుకుంటాం.కానీ ఆ తృప్తి చాలు నాకు! ఎందుకో తెలుసా? దైవధ్యానం చేస్తూ శిల్పం చెక్కుతాం.ఈరాతి విగ్రహం కొన్ని శతాబ్దాలపాటు నిలుస్తుంది. మన హంపీ బేలూరు హళీబేడు లేపాక్షి  మహాబలిపురం ఇప్పుడు నిర్మిస్తున్న యాదాద్రి శిల్పాలు శాశ్వతం.   నా కొడుకు  బి.టెక్. అవగానే జాబ్ దొరకటం దేవుని దయకదా?ఈ నా కులవృత్తిలోనే  నాకు తృప్తి ఆనందం! మరి మీస్కూల్ టీచర్స్ మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు.మరి చేతిలో  పుస్తకంని మస్తకం పెట్టి చదవకపోతే ఎలా? కులవృత్తులు మూలపడ్డాయి..ఈపోటీయుగంలో మీరు కంప్యూటర్ నేర్చుకోవాలి. నాకు దానితో పని లేదు. టైం వేస్టు. కంటికి శ్రమ. ఈ బండను నా గుండె తో నిండుగా దేవతావిగ్రహంలా
మలచటంలోనే నాకు తృప్తి  శాంతీ ఆనందం! నేను  అంతరించినా నా కళ శాశ్వతం! మీరు  ఇప్పుడు బాగా చదువుకుంటే ఇంకా కొత్త వి కనిపెట్టి  చరిత్ర లో నిలిచిపోవచ్చు ఒక శాస్త్రవేత్త గా ఒక కవిగా ఒక కళాకారునిగా!ఏమంటారు?" బాబాయి మాటలకు ఔను అంటూ ఆరోజు నించి  శ్రద్ధగా  చదవసాగారు..