నవతరంగం:-- యామిజాల జగదీశ్


 నిజంగా నవతరంగమే. తన పుస్తకానికి నవతరంగం అనే శీర్షిక అన్నివిధాల సరిపోయింది. ఎప్పుడు చదివితే అప్పుడే కొత్తగా అనిపిస్తుందీ పుస్తకం. ఈ నవతరంగ స్పర్శ చైతన్యానికి స్ఫూర్తి. తన ముప్పై రెండో ఏటకే ఆంధ్రప్రభ వారపత్రికకు సంపాదకులై వల్లూరి రాఘవగారు వారం వారం రాసిన సంపాదకియాల సంకలనమే నవతరంగం. ఈ పుస్తకం కొన్నేళ్ళ క్రితం తిరగేసిన నేను మరొక్కసారి మళ్ళీ ఇందులోని అక్షరసమూహానికి కళ్ళప్పగించాను మనసారా. పరాజయాలు, అవమానాలు‌, చీదరింపులు, ఆకలిరోజులు, అసూయపరులు, అక్షర ద్వేషులు, ప్రమాదాలు....తదితరాలన్నీ తీర్చిదిద్దడంతో రాఘవగారి కలం తరంగాలై పాఠక లోకం ముందుకొచ్చింది. 
గోవిందరాజు చక్రధర్ గారు తానున్నానంటూ వెన్నుతట్టడంతో రాఘవగారి మాటలన్నీ నవతరంగ అకృతిని పొందాయి. నూట డెబ్బై అయిదు అంశాలలోని ప్రతి మాటా పాఠకుడికి ఆలోచింపచేస్తుంది. నడిపిసస్తుంది.. దారి చూపుతుంది. ఆ దారి అంతా వెలుగుమయమే. ఏ పేజీకా పేజీ ఆణిముత్యమే. ఏదో ఒక కథతోనో ఏదో ఒక సంఘటనతోనో చదువరిలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. జీవితగమనం సవ్యంగా సాగడానికి చేతికర్రవుతుంది. భాష ఆయుధం. ఈ ఆయుధాన్ని సంధించడంలో అన్ని విధాల కృతకృత్యులైనందువల్లే చదవడానికి హాయిగా ఉంది. ఆసక్తిగానూ ఉంది. 
మనసుని శాంతపరిచే రీతిలో ఈ నవతరంగం ఓ కాలజ్ఞానమే అనడం అతిశయోక్తి ఏమీ కాదు. అక్కడక్కడా కావలసిన మోతాదులో ఇంజక్షన్ ఎక్కిస్తున్నట్టే అనిపిస్తుంది పదప్రయోగం.
భద్రత అనేది కేవలం ఓ భావన. అది వాస్తవం కాదు. ఆ సంగతి తెలిసినా ఒప్పుకోలేని అహం. అహాన్ని కాదనలేని బలహీనత.....చివరికి ఈ సంఘర్షణ పెరిగి పెరిగి మనసు సంచి బరువెక్కి ఊపిరాడని స్థితి వస్తోంది. నిజానికి కారణం లేకుండా ఏ విపత్తూ రాదు.....అన్న రచయిత మనిషికి మనసే తీరని శిక్ష అన్నదందుకే అనేది ముమ్మాటికీ వాస్తవం. 
ఇంకొక చోట అంటారిలా....
చిన్న పిల్లలు నమూనా భాష మాట్లాడరు. అందుకే గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ భాష. కొన్నిసార్లు అద్భుతంగా అనిపిస్తుంది వాళ్ళ భావన. ఉరుములు మెరుపులతో వచ్చే వర్షాన్ని చూసి ఆకాశానికి జలుబు చేసిందా మమ్మీ...అలా ఏడుస్తోంది అని ఏ చిన్నారైనా అడిగితే నవ్వుకుని కొట్టిపారేస్తాం.....అనడం నూటికి రెండు వందల పాళ్ళు నిజం.  
కానీ చిన్నపిల్లల భావాలను ఆస్వాదించడం తెలిస్తే వారి భాష అద్భుతంగా అనిపిస్తుంది కదూ. కానీ మనమెందుకో వారి మాటలను తీసిపారేస్తాం. మనసుతో వినం. అదే మనం చేసే పొరపాటు. 
ఇలా నవతరంగంలోని ప్రతి అక్షరం నిత్యసత్యమే. వరుసగా చదవాలనేం లేదు. ఏ పేజీ అయినా తీసి చదివితే ఏదో ఒక జవాబు లభిస్తుంది. ఇందులో అనుమానం లేదు. 
మనం ఎదుర్కొనే అనేక సమస్యలకు ఈ పుస్తకం ఓ పరిష్కారం చూపుతుందనడం అతిశయోక్తికాదు. 
హృదయ నిశ్శబ్దాన్ని భరించలేనివాళ్ళే మాటలతో బతుకుతారు. ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. నిజానికి మన పునాదులు బయటి ప్రపంచంలో లేవు, మన స్వగతంలోనే ఉన్నాయన్న రాఘవగారి మాటలతో ఏకీభవించకతప్పదు....
మంచి భావాలను చదివింప చేసినందుకు రచయితకు వందనం.

కామెంట్‌లు