ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పిందీయనే!;-- యామిజాల జగదీశ్


 తమిళంలో "కర్ణన్" సినిమా రెండవసారి కొత్త ప్రింట్లతో విడుదలైనప్పుడు ఆ సినిమాలో నటించిన వారిలో ఇద్దరు మాత్రమే ఇప్పుడు మన మధ్య ఉన్నారని, వరిలో ఒకరు వి.ఎస్. రాఘవన్, మరొకరు షణ్ముగసుందరం" అని ఓ దినపత్రిక ఓ వార్తను ప్రచురించింది. అయితే అది సరికాదంటూ మరొక పత్రిక ఓ వార్త ఇచ్చింది. ఆ ఇద్దరితో పాటు కె.వి. శ్రీనివాసన్ అనే తొంబై ఒక్కేళ్ళ మన మధ్యే ఉన్నారంటూ ఆయనతో జరిపిన ఇంటర్వ్యూని ప్రచురించింది ఫోటోతోసహా. రాఘవన్ విదురుడి పాత్రలోనూ, షణ్ముగసుంరం రథసారథిగానూ నటించారు. ఇక శ్రీనివాసన్ గారు ఓ ముని పాత్రలో నటించారు. ఈ పాత్రకన్నా చెప్పుకోవలసిన ఓ ప్రధానాంశం ఒకటుంది. ఈ కర్ణన్ సినిమాలో కృష్ణుడిగా నటించిన ఎన్. టి. రామారావుగారికి తమిళంలో తన గాత్రదానం చేశారు శ్రీనివాసన్ గారు. అప్పట్లో అనేక తమిళ సినిమాల్లో  రామారావుగారికి డబ్బింగ్ చెప్పింది ఈయనే.
అలనాటి పాత చిత్రాలలో శ్రీనివాసన్ వకీలు, డాక్టరు, తండ్రి, స్నేహితుడు ఇలా అనేక పాత్రలలో నటించారు. ఆయన కంఠం ఎంతో బాగుండేదనుకునేవారు.
ఓమారు ఆయన ఓ థియేటర్లో సినిమా చూస్తుండగా ఆయనకు అటూ ఇటూ కూర్చుని ఎంజీఆర్, శివాజీగణేశన్ సినిమాను తిలకించిన సంఘటనను అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.
ఆయన జీవితంలో ఇంతకన్నా మరొక చిరస్మరణీయమైన సంఘటన ఉంది. శ్రీనివాసన్ గారు తన పన్నెండో ఏట " వైష్ణవ జనతో...." అని రాగయుక్తంగా ఆలపించినప్పుడు ప్రత్యక్షంగా వీక్షించిన మహాత్మా గాంధీ ఆయనను "అచ్ఛా" అని ప్రశంసించడం.
ఓ రేడియో నాటికలో ఆయన పాల్గొన్నారు. అప్పుడు రేడియో స్నేషన్ కి అనేక ఉత్తరాలు వచ్చాయి. "ఎందుకని పాత్రధారుల పేర్లలో ఎన్టీఆర్ పేరు చెప్పలేదు" అన్నవే ఆ ఉత్తరాలన్నీ. వెండితెరపై నటించినది ఎన్టీఆర్ గారే అయినప్పటికీ తమిళ రేడియో నాటికలో పాలుపంచుకుని గాత్రదానం చేసింది శ్రీనివాసన్ గారేనని ఆకాశవాణివారు ప్రకటించారు.
మాయాబజార్, కర్ణన్వంటి తమిళ సినిమాలలో ఎన్టీరామారావుగారి మహత్తర నటనకు స్వరాన్ని అరువు ఇచ్చింది శ్రీనివాసన్ గారి కుటుంబంలో న్యాయవాదులూ ఉపాధ్యాయులే ఎక్కువమంది. శ్రీవైష్ణవులైన శ్రీనివాసన్ గారుచిన్నవయస్సునించే పాటలు పాడుతూ వచ్చారు. నవాబ్ రాజమాణిక్యం పిళ్ళై వారి మదురై దేవీబాల వినోద సంగిత సభలో చేరి అనేక నాటలలో నటించారు. నాటి ప్రముఖ దర్శకుడు కె.ఎస్. గోపాలకృష్ణన్ గారి చిత్రాలలో ఆయన వకీలు పాత్రలనే అధికంగా పోషించడంతో చాలామంది ఆయనను వకీల్ శ్రీనివాసన్ అని పిలిచేవారు.
తమిళ సినిమాలలో విలన్ గా నటించిన ఎం.ఎన్. నంబియార్ కు ఆయన అత్యంత సన్నిహితులు. అలాగే ఎంజీఆర్, శివాజీలతోనే సత్సంబంధాలున్న శ్రీనివాసన్ గారి భార్య పేరు సులోచన.

కామెంట్‌లు