మనుగడ సాగించాలంటే? (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

  పిల్ల కాలువ అప్పుడే బయలు దేరింది. చిన్నగా నిదానంగా కదులుతూ వుంది. పెద్ద కాలువవద్దకు వచ్చింది. పిల్లకాలువను చూసి పెద్ద కాలువ పకపకా నవ్వింది. "ఏం పిల్లకాలువా! ఏమిటి విశేషం?నువ్వెంటి. నీ నడకేమిటి. హుషారుగా ఉండు. వేగంగా కదులు" అని హేళనగా అంది.  అందులో ఉన్న పిల్లకాలువ నీళ్లు పెద్దకాలువ  వెటకారం మాటలు విన్నాయి. బాధపడ్డాయి.  దానికి బుద్ధి చెప్పాలి అనుకున్నాయి. తరువాత నుండి పెద్దకాలువలో కలవటం మానేశాయి. పిల్లకాలువలు కలవకపోవటంతో పెద్దకాలువ పీక్కుపోయింది.  నీరసించిపోయింది. మెల్లగా నది వద్దకు చేరింది. నది పెద్ద కాలువను చూసి పళ్లికిలించింది. "ఏమిటి ఆ నీరసం. వేగంగా కదులు" అంది.  పెద్దకాలువ  చిన్నబోయింది.  అప్పుడు పెద్దకాలువలోని నీళ్లన్నీ నదిలో కలవటం మానేశాయి. ఇంకేముంది  నది పూర్తిగా ఎండిపోయింది.  ఒకరి మీద ఆధార పడ్డప్పుడు. వారిని గౌరవంగా చూసుకుంటేనే మనం మనుగడ సాధించగలము. వారిని చిన్నచూపు చూస్తే మన మనుగడకే ముప్పు. చిన్నావారే అని ఎప్పుడు చిన్నచూపు చూడకూడదు.