తెనాలి రామకృష్ణుడు అంతగా ప్రాముఖ్యత చెందడానికి కారణం కాళికాదేవి ఇచ్చిన ప్రత్యేకమైన వరం అని చదివాము. కాళికాదేవి ప్రత్యక్షమై ఆయన రెండు పాత్రలు చూపించి ఒక దానిలో డబ్బు ఇంకొక దానిలో చదువు , ఏదైనా ఒకటి మాత్రమే తీసుకో అని అడిగిందట. దానికి అతడు ఏది ఒకసారి చూడవచ్చా? అని రెండు పాత్రలను తీసుకుని రెండింటిని గటగటా తాగేశాడుట, ఒకటేసారి.
అదిగో అలాంటి కోవకు చెందిన వాళ్ళమే మేము ఐదుగురం కూడా . ఎందుకంటే మాకు చదువు దాని తో కూడిన భవిష్యత్తు కాలేజీలో కావాలి మళ్లీ దానితో బాటే మాకు వర్తమానంలో ఆ కాలేజీలో ప్రతి విషయాన్ని ఆనందిస్తూ గడపాలి . చదువు సరిగా లేకుంటే భవిష్యత్తు పాడవుతుందని ఒక రకంగా భయం కూడా ఉండేది. కానీ ఆ వయసుకు తగ్గట్టుగా కాలేజీలో మేము కోతి పనులు చేయడానికి మాత్రం వెనుకాడే వాళ్ళం కాదు. అదిగో ఆ విధానంలో మేము ఎదుర్కొన్న ఒక విచిత్రమైన సంఘటన సందర్భం చెబుతాను.
పంచపాండవులు అనబడే మేము ఐదుగురం
కాలేజీలో జరిగే ఎన్సిసి లో కూడా చేరాము . ముఖ్యంగా నేను ,రావు , సంజీవన్ కూడా.
మేము సైన్స్-సెక్షన్( బి ఎస్ సి) అవటం మూలాన కాలేజీలో వేరే సెక్షన్స్ కి అన్ని క్లాసులు అయిపోయినా సరే మాకు వారంలో కొన్ని రోజులు ఇంకా 45 నిమిషాలు క్లాస్ ఉండేది. కానీ అప్పటికి ఎన్సిసి ట్రైనింగ్ స్టార్ట్ అయి పొయ్యేది.
నిజం చెప్పాలంటే ఎన్. సి. సి. లో జాయిన్ కావడానికి కారణం వాళ్ళిచ్చే మిలిటరీ బూట్లు , బట్టలు. అంతేకాకుండా ఎన్సిసి తరగతులు అయిపోయిన తర్వాత మాకు రిఫ్రెష్ మెంట్ అంటూ తినడానికి పూరీలు ఇచ్చేవాళ్ళు . అదేమిటో గాని ఆ పూరీలు చాలా రుచికరంగా ఉండేవి. ఎన్సిసి ట్రైనింగ్ తరగతులు అవుతూ ఉన్నంతసేపు మాకు మనసంతా ఆ పూరీల మీద ఉండేది. కాకపోతే అక్కడ కూడా మేమే లీడర్స్ కనుక అందరికీ పంచిన తర్వాత మిగిలినవి ఉంటే మేము తినాల్సి వచ్చేది. అవి దొరకక పోతే నేను తెగ బాధపడి పోయె వాణ్ని ,కానీ రావు గాడు మాత్రం ఎక్కడ ఫీల్ కాకుండా గంభీరంగా ,గౌరవప్రదంగా ప్రవర్తించేవాడు. సంజీవన్ మాత్రం మిలటరీ వాళ్ళు చూస్తున్నంత సేపు చాలా సీరియస్ గా ,వాళ్లు మరోవైపు తిరగ్గానే కోతి వేషాలు వేసేవాడు. నాకేమో ఆ రెండూ చేత కాకుండా ఉండేది. అక్కడ మిలటరీ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్లో ఉండే మిషన్ గన్స్ , రైఫిల్స్ చాలా ఉద్వేగాన్ని కలిగించేవి. అంతేకాకుండా అందులో పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణులు అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో మరియు ఉద్యోగాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్సిసి లో చేరడానికి మాకు ఇది కూడా ఆసక్తిని కలిగించింది.
ఒకరోజు ఆఖరి గంటలో ఉండే బాటనీ క్లాస్ ఎగ్గొట్టి కాలేజీ బిల్డింగ్ పక్కన ఉన్న మైదానంలో ఎన్సిసి లో పరేడ్ చేస్తున్నాం. మా మిలటరీ ఆఫీసర్ ఆ పరేడ్ లో భాగంగా ఆ రోజు మమ్మల్ని కాలేజీ చుట్టూత పరేడ్ చేయించాడు. మేము ఎన్సీసీ డ్రెస్ లో తల పైన క్యాప్ తో ఉండడం మూలాన మా జానకి మేడం గుర్తు పట్టదులే అనుకొని ధైర్యంగా ఉన్నాం. క్లాసులో లేకుండా ఎన్సిసి తరగతిలో ఉండడం మా బాటనీ మేడం జానకి గారు చూసేశారు. చూడటం మాత్రమే కాకుండా మమ్మల్ని ఎంచక్కా గుర్తు కూడా పట్టేశారు.
మరుసటి రోజు మామూలుగా బాటనీ క్లాస్ మొదలయింది. మేము ఏమీ తెలీని అమాయకుల లాగా మొహాలు పెట్టి సీరియస్ గా, రాసుకోవడం మొదలు పెట్టాం. జానకి మేడం మమ్మల్ని తేరిపార చూసి తల పంకించి" ఏంటి క్లాసుకు వచ్చారు "అని అడిగారు . ఎందుకైనా మంచిదని అప్పటికి కూడా మేము ఏమీ తెలియనట్టుగా మొహాలు పెట్టి లేచి నించున్నాము.
"మీకు బాటని సబ్జెక్ట్ కంటే ఎన్ సి సి ముఖ్యం కదా?. మరి ఈ రోజు ఎందుకు వచ్చారు?" అని అడిగారు. "అలాంటిది ఏమీ లేదు మేడం మాకు సబ్జెక్ట్ చాలా ముఖ్యం" అన్నాము.
"అలాగా, అయితే మరి నిన్న ఎందుకు వెళ్ళారు?" అంది.
ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక "నిన్న మీరు చెప్పిన సబ్జెక్టు మాకు వచ్చు మేడం " అని చెప్పాము.
"అలాగా అయితే రేపు మీకు కణ కేంద్రకం (cell nucleus) గురించి పరీక్ష ఉంటుంది !రాయండి చూద్దాం ,మరి ఎంత రాస్తారో!!"అని కోపంగా చూస్తూ చెప్పింది.
మేము ఏమంటావో అని తరగతిలో ఉన్న మిగిలిన విద్యార్థులు అందరూ మమ్మల్ని ఆసక్తిగా చూడడం గమనించాం. ఇక్కడ మేం భయపడి కానీ ,మేడం కు కోపం వస్తుందని కానీ వెనక్కి తగ్గితే, మా ఇమేజ్ కి అవమానం అని అర్థమైంది. పైగా క్లాసులో ఉన్న అమ్మాయిల ముందు ఓటమి ఒప్పుకోవడానికి మా హీరోయిజంకు మనసొప్పలేదు . మేము సారీ అని క్షమాపణ చెబితే సరిపోయేది. అలా చెప్పడానికి మా మనసు ఒప్పుకోలేదు. కానీ ఇంక ఏమి చేయలేక సరేనని ఒప్పుకొని కూర్చున్నాం.
రాత్రంతా చాలాసేపు పుస్తకాలు ముందు వేసుకొని చదివాం. పరీక్షకు సంబంధించిన విషయం చాలా సరళంగా ,ఏమీ కష్టం లేకుండా ఉంది. అసలు ఇంత ఈజీ గా ఉన్న విషయాన్ని ఎందుకు పరీక్ష పెట్టిందో మాకు అర్థం కాలేదు. అందులో ఏమైనా కిటుకు ఉందా అని కూడా ఆలోచించాము. మాకు తృప్తిగా అనిపించలేదు. ఎందుకంటే అది తిప్పి కొడితే ఒక పేజి కంటే ఎక్కువ లేదు. మేము చాలా బాగా గొప్పగా రాయడానికి అక్కడ , ఎక్కడా కూడా పెద్దగాఅవకాశం కనిపించలేదు. బాగా ఆలోచించి ఉదయాన్నే మళ్లీ రిఫరెన్స్ లైబ్రరీ కి వెళ్ళిపోయాం.
అక్కడ షరా మామూలే. మాకు కావాల్సిన పుస్తకాలు మళ్ళీ దొరకలేదు. లైబ్రరీ ఉద్యోగిని అడిగి ఇంగ్లీష్ లో ఉన్న పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొని రకరకాల విషయాలన్నీ రాసుకొని దాని రైటర్ పేర్లు కూడా రాసుకొని వెళ్ళాం. ఆ రోజంతా మిగిలిన తరగతులలో కూడా టెన్షన్ తోనే గడిపాం . మేము చేస్తున్న పద్ధతి కరెక్టో కాదో తెలియదు. అసలు మా దగ్గర సిలబస్లో లేనివి రాయడం సరి అయినదో కాదో అర్థం కాలేదు. మా మొహాలు అన్నీ గంభీరంగా ఆలోచనలతో సీరియస్ గా,ఉండిపోయాయి. కానీ మా తోటి విద్యార్థులు మమ్మల్ని గమనిస్తూ ఉండడం మూలాన నవ్వుతూ నవ్విస్తూ ఏమి లేనట్టుగా , అసలు ఏమీ పట్టనట్టుగా నటించాం.
ఆ రోజు సాయంత్రం అన్ని తరగతులు అయిపోయిన తర్వాత మమ్మల్ని మాత్రమే కూర్చోబెట్టి పరీక్ష మొదలుపెట్టారు. అప్పటికి విద్యార్థులు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు . ప్రత్యేకంగా మాకు పరీక్ష పెట్టడం అవమానంగా పెద్ద శిక్షగా భావించాము. మేము వ్రాయటం మొదలు పెట్టాం . మామూలుగా అయితే పది నిమిషాల్లో అయిపోయేది కానీ మేము దాదాపుగా నాలుగు పేజీల విషయం రాయటమే కాకుండా అవి ఏ పుస్తకాల నుంచి క్రోడీకరించినవి మరి ఆ పుస్తకాలు రాసిన శాస్త్రజ్ఞులు ఎవరు ,వగైరాలు అన్నీ కూడా రాస్తూ పోయాం. దాదాపుగా అరగంట గడిచిపోయింది. మా జానకి మేడం కి ఏమీ అర్థం కాక వచ్చి చూడటం మొదలు పెట్టారు. మేము ఆపకుండా ఇంకా రాస్తూ ఉండగా, మేడం అన్ని గమనించి "ఇంక చాలు చాలు! చాలా ఎక్కువ అయిపోయింది,
మా బాగా రాశారు " అంటూ రాస్తూ వున్న మ పేపర్లు మధ్యలోనే లాక్కుని వెళ్లిపోయారు. మాకు అర్థం అయిపోయింది మేము ఈ చాలెంజ్లో బ్రహ్మాండంగా గెలిచామని.
పుస్తకాలు సర్దుకొని కాలేజీ బయటికి వచ్చి చూద్దుము కదా !మా తరగతిలోని మిగతా విద్యార్థులు అందరూ మా గురించి ఎదురుచూస్తూ ఉన్నారు. జరిగిందంతా విని వాళ్ళు మమ్మల్ని రకరకాల ప్రశ్నలు వేశారు,. అసలు మీకు ఇలా చదవాలని ఎలా తోచింది? ఎవరు చెప్పారు? మేము ఏమీ మాట్లాడకుండా నవ్వి గుంభనంగా వెళ్ళిపోయాం .
ఇదంతా తెలిసిన తర్వాత మరుసటి రోజు అబ్బాయిలు అందరూ మమ్మల్ని ఇంకా గౌరవంగా చూడటం , అమ్మాయిలందరూ ఆరాధనా పూర్వకంగా చూడటం మొదలుపెట్టారు. అలా చూసే చూపులే మాకు పెద్ద బహుమతి.
అందరు అమ్మాయిలు కూడా మాతో చాలా స్నేహంగా ఉంటూ గౌరవం ఇచ్చేవారు . ఒక్క శ్రీదేవి అనే మా క్లాస్మేట్ తప్ప. ప్రతి విషయంలో నాతో పోటీ పడుతూ ఉండేది. ఒక్క మార్కు తేడాతో వచ్చే మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు గురించి మేమిద్దరం ఎప్పుడూ లెక్చరర్స్ దగ్గరికి వెళ్లి పోట్లాడుకునే వాళ్ళం. నా వైపు ఎప్పుడైనా చూసే చూపుల్లో కూడా కోపమే కనిపించేది. దానికి కారణం ఏంటో మాకు ఎవరికీ అర్థం కాలేదు. కానీ అలాంటి పోటీతత్వం నాలో పెంచి నాకు మంచి మార్కులు రావడానికి కారణం అయిన ,ఆ శ్రీదేవి నా శ్రేయోభిలాషి గా భావిస్తాను. కాలేజీ అయిపోయిన తర్వాత ఉద్యోగ అన్వేషణ అనే జీవిత సమరంలో నేను గెలవడానికి ఆ మార్కులు దోహదం చేశాయని చెప్పాలి.
ఈ విధంగా ప్రతి విషయంలో మేము మా యొక్క విలక్షణమైన పద్ధతిలో విజయం సాధించి మమ్మల్ని మేము నిరూపించుకునే వాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి విషయంలో విజయం సాధించడం మరియు ఆ విజయంతో వచ్చే మానసిక బలం ఎలాంటిదో,ఎలా ఉంటుందో మాకు అర్థమైంది. జీవితంలో ప్రతి పరీక్షలో విజయం సాధించడం అనేది మాకు ఒక పట్టుదల గా మారిపోయింది.
దీనికి కారణం మా కాలేజీ వాతావరణం , దానిని అమలు చేసిన అధ్యాపకులు మాత్రమే. వారు మా దేవుడి రూపాలు కదా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి