ఆశ-ఆసక్తి:- త్రిపురారి పద్మ.తెలుగు ఉపాధ్యాయిని

 చదువుకోవాలనే ఆశ,నేర్చుకోవాలనే ఆసక్తి విద్యార్థుల్లో దండిగా ఉన్నప్పుడే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయి.ఉపాధ్యాయులలో విద్యార్థులు ఎదగాలనే  తపన ఎంత ఉన్నా,ఎన్నో ఆలోచనలను ఆవిష్కరణలను ప్రయోగాత్మకంగా ఆచరింపజేసినా,విద్యార్థినుండి కానీ,తల్లిదండ్రుల నుండి కానీ ఉపాధ్యాయులు ఆశించిన సహకారం అందకపోతే,వందకు వంద శాతం కృషి చేసినా తగిన ఫలితాన్ని పొందలేకపోవచ్చు.అలాగని ఉపాధ్యాయులు ప్రయత్నపూర్వకంగా అటువంటి విద్యార్థుల్లో మార్పు తేలేరని నేననను.ప్రేమాభినాలతో,ఉత్సాహవంతమైన ప్రోత్సాహంతో,ఆకర్షణీయమైన అంశాలతో ముందుకు వెళితే ,తెల్లకాగితంవంటి విద్యార్థి మనసుపై జ్ఞానసుగంధాన్ని లిఖించవచ్చు.విద్యార్థులను జ్ఞాన తేజస్సంపన్నులుగాను మలచవచ్చు.కానీ,ఇక్కడ కూడా ఉపాధ్యాయుల ప్రయత్నాన్ని, బోధనలను విద్యార్థులు అందిపుచ్చుకోగలిగే పరిస్థితులతో పాటు,స్వతసిద్ధమైన అభిలాష కూడా ముఖ్యమే.విద్యార్థి-ఉపాధ్యాయుడు త్రాసులోని రెండు తక్కెడలాంటివారే అని నా అభిప్రాయము.జ్ఞానాన్ని అందించాలనే ఉపాధ్యాయుడి ఆలోచనను విద్యార్థి  సమంగా స్వీకరించినపుడు,జ్ఞానం సమతూకమై నిలుస్తుంది.
    ఇన్నేళ్ళ బోధనా విధానంలో నేను గమనించిన మరొక అంశము కూడా ఉన్నది.అదేంటంటే విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీని సృష్టించి,వారి విద్యావిషయక కృషికి ఒక వేదికనిచ్చి,ఇదిగో మీ రచనను పలానావాళ్ళు గమనిస్తున్నారు.అభినందిస్తున్నారు.మిమ్మల్ని మరింత ముందుకి తీసుకువెళ్ళడానికి ఉన్నతులెందరో సలహాలు సూచనలిస్తున్నారనే ఆశ కల్పించి,ఆ ఆశను ఆచరణాత్మకంగా చేసి,ప్రముఖుల అభినందనలను,మార్గదర్శకత్వాన్ని,సలహాలు సూచననలను పిల్లలకు అందించినపుడు ,వారిలో ఉత్సాహం మరింత పెంపొంది,రాయాలి చదువాలనే తపన పెరిగిన సందర్భాలు నా అనుభవాల్లో అనేకం.

     అలాంటి అనుభవంలోనుండి వచ్చినవే ఈ చిత్రాలు.
     ఇటీవల మా అమ్మాయి కృష్ణ చిన్మయి చెప్పిన కథను ,పదవతరగతి విద్యార్థుల సమూహంలో పోస్ట్ చేసి,ఎవరైతే ఈ కథకు చక్కని సమీక్ష చేస్తారో,ఆ సమీక్షను గెలుపు-పిలుపు పుస్తక రచయిత, ఐ.ఎ.ఎస్.ఆఫీసర్ బుర్రా వెంకటేశం సార్ కి పంపిస్తానని చెప్పాను.బాలబాలికల్లో మాతృభాషపై అనురక్తిని పెంచి,లక్షమంది బాలకవులను తయారు చేయాలనే దీక్షతో ఉన్న మాతృభాషా ప్రేమికులు బుర్రా వెంకటేశం సార్ ఖచ్చితంగా మీ సమీక్షను చూస్తారనే ఆశ పిల్లల్లో కల్పించాను.వెంటనే స్పందించి, దివ్య,శృతి అనే ఇద్దరు అమ్మాయిలు ఈ విధంగా రాసి పంపించారు.
      ఇందులో అక్కడక్కడా అక్షర దోషాలు ఉండవచ్చు. భావవ్యక్తీకరణ లో చిన్న, చిన్న లోటుపాట్లు ఉండవచ్చు. కానీ ఇరవై శాతం ఉన్న తప్పులను ఎలా సరి చేసుకోవాలో తెలియజేస్తూ,ఎనభైశాతం  సరిగా రాసిన ,వారి ప్రయత్న పూర్వక విజయాన్ని అభినందించాలనే ఉపాధ్యాయినిగా నేను భావిస్తాను.
     ఈ విధంగా ఆశను ఆసక్తిని జతచేసి,మరింత జ్ఞానధనాన్ని కూడబెట్టుకోవాలనే విద్యార్థుల సంఖ్య పెరగాలని ఆశిస్తున్నాను.

           
కామెంట్‌లు