దేవుడు మెచ్చేపని: డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు


 అమరావతి నగరంలోని అటవీశాఖ విశ్రాంత ఉద్యోగి రాఘవయ్యగారి ఇంటి అరుగుపై ఆ వాడకట్టులోని పిల్లలు నీతికథ విననడానికి చేరారు. అందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్య  "బాలలూ! ఈసృష్టిలో మనిషి చాలా గొప్పవాడు. తన అవసరానికి మాట్లాడే విధంగా భాషను, సాహిత్యాది కళలను ఏర్పరచుకున్నాడు. వృత్తిని బట్టి కులాలను, పూజించే విధానాన్ని బట్టి మతాన్నీ ఏర్పరచుకున్నాడు. ఏ కులం గొప్పది కాదు.. ఏ మతం తక్కువది కాదు. ఇవన్ని ఒకరిని ఒకరు గౌరవించుకోవడానికి ఏర్పచుకున్నవే. నదులు అన్ని సముద్రంలో కలసినట్లే అన్నికులాల, మతాలవారు చివరకు  ఈ నేలలో చేరవలసిందే.  ఏ మతం బోధించినా దాని సారాంశం "మానవ సేవే మాధవసేవ"  అని బోధిస్తాయి.

       ఒకరోజు శబరిమలై వెళ్ళి వస్తున్న భక్తుల వాహనం ప్రమాద వశాత్తు చెట్టును ఢీకొనడం  వలన దానిలోని భక్తులు  గాయాల పాలైయ్యారు. కొందరికి రక్తస్రావం జరిగింది. అదే సమయంలో 'నమాజు' కు వెళుతున్న ఉస్మాన్ బాషా అక్కడికి చేరుకుని తన సుమో వాహనంలో గాయపడినవారిని  ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లాడు. కొందరు అయ్యప్ప భక్తులకు రక్తం కవలసి వచ్చింది, దగ్గరలోని  చర్చి హాస్టల్ లోని యువకులకు పరిస్ధితి వివరించాడు బాషా. వెంటనే కొందరు యువకులు వైద్యశాలకు వచ్చి,  వైద్యులు కోరిన గ్రుపు రక్తాన్ని ఇచ్చి వెళ్లారు. మరుదినం అయ్యప్ప భక్తులు అందరు సంతోషంగా తమ ఊరు  వెళ్ళిపోయారు.

       సాయంత్రం నమాజుకు వెళ్ళిన బాషాని' "భయ్య! ఎనాడు రెండు పొద్దుల నమాజు మానని నీవు నిన్న రాకుండా అపరాధం చేసావే" అని అడిగారు కొందరు సహచరులు.. "సోదరులారా! అల్లా సాటి వారికి సహయపడే అవకాశం నిన్న నాకు కలిగించాడు. కొందరు మనుషులను కాపాడే అవకాశం లభించింది. అందుకే రాలేక పోయాను. ఏమతంలోనైనా సాటివారిని ఆదుకోమనే చెపుతారు. నిన్న నేను చేసింది దేముడు మెచ్చేపని" అని మసీదులోనికి నమాజుకు  వెళ్లాడు.

       "బాలలు! కథ విన్నారుగా . ఇలా కులమతాలకు అతీతంగా మీరు జీవించాలి. ఏనాడు మీ జీవితాలలో కుల,మత వైషమ్యాలకు చోటు ఇవ్వకండి" అన్నాడు రాఘవయ్య. 

       బుధ్ధిగా తల ఊపారు పిల్లలు.