నాన్నగారి డైరీ....!!:-- యామిజాల జగదీశ్

 మా నాన్నగారికి (యామిజాల పద్మనాభ స్వామిగారు) ముగ్గురు గురువులు. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారి దగ్గర కవిత్వం, హరికథ పితామహులు ఆదిభట్ట నారాయణదాసుగారి దగ్గర సంగీతం, జ్యోతిషం, కావ్యకంఠ గణపతిముని గారి దగ్గర మంత్ర శాస్త్రానికి సంబంధించిన అంశాలు నేర్చుకున్నారు. తర్వాతి కాలంలో నారాయణదాసుగారి గురించి పూర్ణపురుషుడు అనే పుస్తకం, గణపతి ముని అనే పుస్తకం రాశారు. ఈ గురుత్రయం దగ్గర ఆయా శాస్త్రాలలోని ప్రధానాంశాలు అభ్యసించిన తర్వాత విజయనగరంలోని మహారాజా కాలేజీలో సంస్కృతం, తెలుగు చదువుకున్నారు. ఈ భాషాప్రవీణ సర్టిఫికెట్ తోనే మద్రాసులోని శ్రీ రామకృష్ణా మిషన్ వారి శారదా విద్యాలయ పాఠశాలో తెలుగు మేష్టారుగా పని చేశారు. 
అదలా ఉంటే, జ్యోతిషానికి సంబంధించి అనేక మందివి జాతకచక్రాలు గణించి ఫలితాలు కట్టేవారు. పత్రికలకు విరివిగా వ్యాసాలు రాశారు. వసుచరిత్ర ఇష్టం.
మా నాన్నగారికి డైరీ రాసే అలవాటుండేది. 1998 మార్చి 25న మద్రాసులోని భారతిరాజా ఆస్పత్రిలో కన్నుమూసిన ఏడాదిలో మార్చి రెండో తేదీ వరకూ డైరీ రాశారు. ఆ తర్వాత కలం ముట్టలేదు. కలం పట్టుకునే శక్తి పోయింది. 1995, 1997, 1998 సంవత్సరాలలో ఆయన రాసుకున్న డైరీలు నా దగ్గరున్నాయి. అవి ఒక్కొక్కటీ తిరగేస్తే తనను కలుసుకున్న వారి వివరాలు, వ్యాసాలు రాస్తే వాటి వివరాలు, ఆరోగ్య విషయాలు, రాసిన ఉత్తరాలు, అందుకున్న ఉత్తరాల వివరాలు కనిపించాయి. చివరి రోజుల్లో తన శిష్యురాలైన వసంతలక్ష్మి గారి గురించి రాసుకున్న వివరాలున్నాయి. అలాగే ఇరుగుపొరుగువాళ్ళు వచ్చి జాతకాలు చూపించుకున్న వారి పేర్లు వగైరా కనిపించాయి. ఒక తమిళ సుమంగళి వచ్చి శిశువును తాతగారి ఇంటి నించి తీసుకురావలసి ఉంది, ఆగస్ట్ 15 తర్వాత ముహూర్తం చెప్పమన్నాదని, పంచాంగం చూసి రెండు దినాలు (తదియ, పంచమి) చెప్పగా ఆమె సంతోషించి అరటిపళ్ళు, మధురపదార్థాల ప్యాకెట్, పదకొండు రూపాయలుఇచ్చి నమస్కరించిందని1997 జూన్ 24వ తేదీన రాసారు. అదే ఏడాది మార్చి 18వ తేదీన ఒక తెలుగు వ్యక్తి, ఒక తమిళ వృద్ధుడు వచ్చినట్టు, తెలుగాయన కొడుకు జాతకం చూసి ఫలితాలు చెప్పినట్టు, ఇరవై రూపాయల తాంబూలం ఇచ్చి వెళ్ళినట్టు రాసారు. ఇలా ఎవరెవరో వచ్చి జాతకాలు చెప్పించుకునేవారు. అలాగే ఎందరికో గణపతి మునిగారి ఇంద్రాణీ మంత్రోపదేశం చేసేవారు. కానీ నాకు మాత్రం తను చెప్పక జి. విజయ్ గారనే ఆయనతో ఆ మంత్రోపదేశం చేయించారు. ప్రస్తుతం విజయ్ గారు విజయవాడలో ఉంటున్నారు. ఈయనకూడా జాతకాలు చెప్పేవారు. 
జాతకాల నోట్ బుక్కులో తమ గురుపాదులు శతావధాని బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు, బ్రహ్మశ్రీ మదజ్జాడాదిభట్ట నారాయణదాసు (శివయోగ జాతకుడు), సముద్రాల రాఘవాచార్యులు (సీనియర్), జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, గుడిపాటి వేంకటచలం, ముద్దుకృష్ణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శివలెంక రాధాకృష్ణ, ఇలా ఎందరెందరివో జాతకచక్రాలు రాసుకున్నారు. వాటిని అప్పుడప్పుడూ గణిస్తూ వాటి పక్కన వివరాలు రాసేవారు.  చెళ్ళపిళ్ళ వారు " కుసుమయోగ " జాతకులట.
అలాగే భారతి పత్రికలోనూ, ఆంధ్రప్రభ‌, ఆంధ్రపత్రికలలో జ్యోతిషానికి సంబంధించి సందర్భానుసారం వ్యాసాలు రాయడం చూసాను. 
నాకు పద్యాలు ఎలా రాయాలో, జాతకాలు ఎలా చెప్పాలో నేర్పుతానన్నారు కానీ ఎందుకో అప్పట్లో ఆ మాట చెవికెక్కించుకోలేదు. పెడచెవిన పెట్టాను. అవెందుకన్నట్లు నేర్చుకోవడానికి ఆసక్తి చూపలేదు. 
అప్పట్లో ఎంతసేపూ తమిళ కవితలపట్ల ఉన్న మక్కువ "అమ్మ భాష" పట్ల చూపలేకపోయాను. ఇప్పుడా లోటు తెలుస్తోంది. 
ఒక మనిషి విలువ ఉన్నప్పుడు తెలీదని, దూరమైనప్పుడే తెలుస్తుందన్న మాట నా విషయంలో అక్షరసత్యం.