"అపూర్వ ఫోటో":-- యామిజాల జగదీశ్

 చిన్నప్పటి నుంచి ఆటలపట్ల ఉన్న ఆసక్తి చదువుసంధ్యల పట్ల ఉండేదికాదు. అలాగని ఆటలనూ సీరియస్సుగా తీసుకుని ఆడేవాడినా అంటే అదీనూ లేదు.
గ్రౌండుకెళ్ళడం ఇష్టం. ఇంటికి పక్కవీధిలోనే సోమసుందరం గ్రౌండ్ ఉండేది. అక్కడికెళ్ళి క్రికెట్ ఆడటం. లేదా ఎవరైనా ఆడితే చూడటం. ఒక్క క్రికెట్టే కాదు, బాస్కెట్ బాల్ అన్నా వాలీబాల్ అన్నా కబడ్డీ అన్నా చివరికి గిల్లీదండా కూడా ఆడేవాడిని వీలున్నప్పుడు. అన్నీనూ సరదాగా ఆడినవే. అటు చదువుపట్ల శ్రద్ధ లేకపోవడమూ ఇటు ఆటల పట్ల అంకితభావం లేకపోవడంతో ఎందులోనూ రాణించలేకపోయాను. 
హైదరాబాద్ వచ్చాక చిన్నా చితకా ఉద్యోగాలు చేసిన కొంతకాలానికి "ఉదయం" వార్తా పత్రికలో ప్రూఫ్ రీడర్ గా చేరాను. ఓ ఏడాదిన్నరో లేక రెండేళ్ళ తర్వాతో సబ్ ఎడిటర్ అయ్యాను కె.ఎన్.వై. పతంజలిగారి కృపతో.  ఎడిటోరియల్ విభాగంలో మొదటి రెండు రోజులూ జనరల్ డెస్క్ లో ఎ. కృష్ణారావుగారి సారథ్యంలో పని చేసాను. అయితే జనరల్ డెస్కులో పనికి రానని మూడో రోజున నన్ను మఫిసిల్ డెస్కుకి మార్చారు. 
మఫిసిల్ డెస్కులో కొన్ని నెలలు చేసిన అనంతరం స్పోర్ట్స్ డెస్కులో వాడ్రేవు ఆంజనేయులు గారి దగ్గర పని చేసాను. నా ఉద్యోగ జీవితంలో మరచిపోలేని గొప్ప ఇన్ చార్జ్ ఆంజనేయులుగారు. ఆయన తర్వాత కొద్ది రోజులు తెలిదేవర భానుమూర్తిగారి ఆధ్వర్యంలో పని చేశాను. 
అనంతరం తులసీకృష్ణగారు స్పోర్ట్స్ డెస్క్ ఇన్ చార్జ్ అయ్యారు. ఉదయం పత్రిక 1995 మే నెలలో మూతబడే వరకూ స్పోర్ట్స్ డెస్కులోనే కొనసాగాను. 
ఉదయంలో పని చేస్తున్న రోజుల్లో హైదరాబాదులో ఇంటర్ మీడియా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించే వారు. ఆ టోర్నీలో ఉదయం జట్టుకూడా పోటీపడేది. ఆ సమయంలో నేనూ ఉదయం జట్టు తరఫున ఆడేవాడేని. ఆ సందర్భంలో తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో వయస్సు ఇరవై ఏడేళ్ళుపైనే. తులసీకృష్ణగారు తల్లావజ్ఝల లలితా ప్రసాద్ కు ఈ అపురూపమైన ఫోటోని పంపగా లలితాప్రసాద్ నాకు ఫార్వర్డ్ చేశారు. ఆ ఫోటో చూస్తుంటే నాటి రోజులన్నీ కళ్ళముందు కదలాడాయి. ఫోటోలో ఆంజనేయులుగారు, తులసీకృష్ణగారు, లలితాప్రసాద్, కవి ప్రసేన్,.టి.పి.దాస్, రవికాంత్ రెడ్డి, చంద్రశేఖర్‌, గణేష్,  తదితరులతోపాటు నేనూ ఉండటం ఓ మధురమైన జ్ఞాపకం. 
ఉదయం తర్వాత ఆంధ్రజ్యోతి (మద్రాసు), వార్త (మద్రాసు), జెమినీ టీవీ (మద్రాసు, హైదరాబాద్), సాక్షి (హైదరాబాద్) లలో వర్క్ చేశాను. 
ఈ సంస్థలన్నింటిలో నన్ను భరించిన ఇన్ చార్జులకీ, సహ ఉద్యోగులకు ధన్యవాదాలు. వారందరి సహకారంతోనే దాదాపు మూడు దశాబ్దాలు మీడియాలో కొనసాగి 2012 డిసెంబరులో రిటైరయ్యాను సాక్షి నుంచి. ఆ తర్వాత ఓ ఏడేళ్ళు బుజ్జాయి పిల్లల మాసపత్రికకు ఎడిటర్ గా పని చేసాను.