మిత్రుడంటే ..ఇలా ..!!>బి.రామకృష్ణారెడ్డి>సఫిల్ గూడ> సికిందరాబాద్ .

 ప్రతి వ్యక్తి తమతమ వ్యక్తిగత జీవితాలలో ఎదురైన వింత అనుభవాలు, తమతో పాటు ప్రయాణించిన మంచి మిత్రులు గుర్తుకొచ్చినప్పుడు...ఆ అనుభం మనకు  ఎదురు పడక పోయినా  ,లేదా ఆ మంచి మిత్రులను కలుసుకునే అవకాశం లేకపోయినా  మన జీవన గమ్యం ఎలా ఉండేదో... అని ఆలోచించినప్పుడు మనస్సు చాలా తేలికగానూ అలాగే  భారంగాను అనిపిస్తుంటుంది.
      " Marriages are made in heaven "అన్న సూక్తిని నిజం చేస్తూ నా 21వ ఏటనే నాకు వివాహం జరిగింది .అప్పుడు నేను  బీఎస్సీ ఫైనల్ ఇయర్  ఎగ్జామినేషన్స్ వ్రాసి  వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్నాను .ఎగ్జామ్ రిజల్ట్స్ రాలేదు, జీవితంలో ఏమాత్రము స్థిరపడని , లోక జ్ఞానం అంతగా తెలియని వయసులోనే వివాహ బంధంతో నాకు పెద్దలు ముడి వేశారు. కారణాలు వెతికితే మాది ఒక మధ్యతరగతి రైతు కుటుంబం. మా తల్లిదండ్రులకు ఆరు మంది మగసంతానంలో నేను రెండవ వాడిని. అప్పటికే మా అన్నయ్య చదువు పూర్తయి ఉద్యోగము లేకుండానే వివాహితులయ్యారు. నిరుద్యోగ సమస్య అధికంగా ఉన్న ఆ రోజుల్లో ఆర్థికంగానూ, రాజకీయంగాను అంతగా పలుకుబడి లేని మధ్యతరగతి కుటుంబీకు లైన మా తల్లిదండ్రులకు నాకు కుదిర్చిన వివాహంతో ఉద్యోగంలో స్థిరపడతాడనే నమ్మకం కలగడం వలన అలా జరిగిందనుకుంటాను .అది ఎలాగంటే మా మామగారు అప్పటికే రైల్వేలో ఒక మోస్తరు ఉన్నత పదవిలో ఉద్యోగం చేస్తూ, ఇతరులకు ఉద్యోగం ఇప్పించి సహాయం చేయడంలో పలుకుబడి కలిగిన వ్యక్తిగా పేరుంది. నా పైచదువులకైనా, ఉద్యోగానికైనా తనదే బాధ్యత అనే ఒప్పందంతో1978లోనే నాకు వివాహం జరిపించారు.
          డిగ్రీ పూర్తి అయ్యేంతవరకు  నాచదువులు తెలుగు మాధ్యమంలోనే జరిగాయి కావున ఇంగ్లీష్ పై ఏమాత్రం పట్టు ఉండేది కాదు. ఆ విషయాన్ని గమనించిన మా మామగారు డిగ్రీలో మంచి రిజల్ట్ వచ్చినా ,తరువాత నన్ను ఎమ్మెస్సీలో చేర్పించడానికే మొగ్గు చూపి ,మూడు యూనివర్సిటీలకు నాతో అప్లై చేయించారు. డిగ్రీలో నాది బయాలజీ కావున నాకు నాగార్జున యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ బయాలజీ అనే కొత్త కోర్సులో అడ్మిషన్ దొరికింది.  వివాహం అయిన రెండవ మాసంలోనే ఎమ్మెస్సీ మొదటి సంవత్సరంలో జాయిన్ అయి గుంటూరులో కొత్త మిత్రులతో రూమ్ లో ఉండేవాడిని.
      "వివాహం విద్య నాశనం శోభనం సర్వనాశనం" అనే పెద్దల సూక్తిని ఋజువు చేస్తూ నాకు చదువుపై ధ్యాస సన్నగిల్లి ,ఈ చదువును మధ్యలోనే ఆపేసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లి పోదామా ...అనే ఆలోచనలో ఉండేవాడిని. అగ్నికి ఆజ్యం తోడైనట్లు నా ఆలోచనలకు కొన్ని కుంటిసాకులు జత కలిశాయి. సాధారణంగా ఎమ్మెస్సీ ఇంగ్లీష్ మాధ్యమమే కాబట్టి క్లాసులో పాఠాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడేవాడిని .నాతో పాటు ఈ కోర్సులో చేరిన విద్యార్థులు,  రూమ్మేట్స్ పట్టణ వాతావరణంలో పెరగటము ,అలాగే ఇంగ్లీషు మాధ్యమంలోనే చదవడం వలననేమో నాకు వారితో సహజంగా కలిసి పోవటానికి ఇబ్బంది పడేవాడిని. నేను ఎన్నుకున్న  ఎన్విరాన్మెంటల్ బయాలజీ అనే ఈ కొత్త కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువని ,ఈ కోర్సును ఇక్కడ ప్రారంభించడంలో యూనివర్సిటీ వారి ముఖ్య ఉద్దేశ్యము.. కొత్త కోర్సులు ప్రారంభిస్తే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుండి ఫండ్స్ వస్తాయి ,అనే భావంతో చేసినట్లు నాకు తర్వాత తెలిసింది. నాతో పాటు ఈ కోర్సులో చేరిన ఎనిమిది మందిలో ఇద్దరూ వేరే డిపార్ట్మెంట్ కి మారిపోయారు .మిగిలిన ఆరు మంది తోనే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి.
       ఇటువంటి పరిస్థితుల్లో  నేను అక్కడే కొనసాగడానికి పూర్తిగా విభేదించి ఎవరితోనూ సంప్రదించకుండా యూనివర్సిటీ ఆఫీసులో ఈ కోర్సును డిస్ కటిన్యూ చేస్తున్నాను..  అని ఒక అప్లికేషన్ ఇచ్చి ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తరవాత ,రెండు రోజులకు టి సి ఇస్తానన్నారు అక్కడి ఆఫీస్ సూపరిటెండెంట్. తర్వాత గుంటూరు రూమ్ కి వచ్చి ,రూమ్మేట్స్ కి  ఈ విషయం చెప్పాను. అందులో నాకు అతి సన్నిహితంగా ఉండే హరిబాబు అనే విద్యార్థి ఈ చర్యను పూర్తిగా వ్యతిరేకించి ,నన్ను బాగా మందలించి ",సర్టిఫికెట్ తీసుకుంటే తీసుకున్నావు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ మాత్రము తీసుకోవద్దు, ఇంటికి వెళ్లినా తిరిగి నాలుగు రోజులకు ఇక్కడికి వస్తావు చూడు".అని తన మనోగతాన్ని బయటపెట్టారు. ఇంకా రెండు రోజులు అక్కడే ఉంటే మిగతా క్లాస్ మేట్స్ తోకూడా చెప్పి నన్ను వెళ్ళడానికి వీలు లేకుండా చేస్తారనే అనుమానంతో మరుసటి రోజే లగేజ్ సర్దుకుని హైదరాబాద్ వచ్చేశాను. 
     పూర్వాపరాలు ఆలోచించకుండా,  అర్థంతరంగా , చెప్పాపెట్టకుండా ఇలా వచ్చిన నాకు, నా  మిత్రుడు ఊహించినట్లుగానే మా మామగారితో, మరియు మా శ్రీమతి తోనూ  చీవాట్లు ఎదురై ,నాలుగు రోజుల తర్వాత అదే లగేజ్తో గుంటూరు రూంమ్ కి వచ్చేసాను. తిరిగి మిత్రుడు హరిబాబుతో కలసి యూనివర్సిటీకి వెళ్లి ,నేను ఇచ్చిన అప్లికేషన్ వాపస్ తీసుకుని ,చదువు కొనసాగించి ఎమ్మెస్సీ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత సాధించాను.
     ఆరోజు మిత్రుడు టిసి తీసుకోవద్దు.. అనే సలహా మేరకే నాకు తిరిగి కాలేజీలో అడ్మిషన్ దొరికే అవకాశం లభించింది. అలాకాక ,టసి తీసుకొని ఉండి ఉంటే ఆ సంవత్సరానికి ఆ చాన్స్ పోయేదట. ఈ పదనిసలలో నేను నా అపరిపక్వత ఆలోచనలకి మొగ్గుచూపి ఉండి ఉంటే ,కొత్తగా సంబంధం కుదుర్చుకున్న మా శ్రీమతి వారి తరఫునుండి, అలాగే మా బంధువులు ,స్నేహితుల నుండి ఎంతటి  చులకన చూపు ఎదుర్కొనేవాడినో.! ఆ రెండు సంవత్సరములు తోటి మిత్రులతో కలసి చదువుకోవడం వలన  ప్రభుత్వ ఉద్యోగం కొరకు  నిర్వహించే పోటీ పరీక్షల్లో నెగ్గి ఒక మోస్తరు గౌరవ ప్రధమైన ఉద్యోగాన్ని సంపాదించి, పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది, సమాజంలో గౌరవంగా బ్రతక కలుగుతున్నాను. నాకు సరైన సమయంలో సరైన సలహా ఇచ్చి నా జీవితాన్ని తీర్చిదిద్దిన మా మామయ్య గారికి, మిత్రుడు హరిబాబుకు జీవితాంతం రుణపడి ఉంటాను. వయోభారంతో , అనారోగ్యంతో తన 81వ ఏట మా మామయ్య స్వర్గస్తులైనారు. కానీ నా ప్రియ మిత్రుడు 2020  సంవత్సరము ఏప్రిల్ నెలలో 'కరోనా'మహమ్మారి బారినపడి ,ఎవరు దగ్గరకు వెళ్లలేని పరిస్థితులలో, ఒక అనాదగా అకాల మరణం పొందాడు. 
ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారతాయో చెప్ప లేము కదా! పైగా ఈ కరోనా కాలంలో!!
                     ***
కామెంట్‌లు