;నాన్న:--.మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలు=జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 కం.
బుడిబుడి యడుగులు నేర్పుచు
వడివడిగను బడికి పంపు వాస్తవమెరిగిన్,
కడు మోదమ్ముగ చదువును
సడలక నేర్వగను నాన్న సంతసమొందున్.
కం.
ముద్దుగ మాటలు పలికిన
శ్రద్ధగ విను చుండు నాన్న శ్రావ్యత నొప్పన్,
బుద్ధులు జెప్పుచు బిడ్డకు
పెద్దల వలెను తీర్చిదిద్దు పేర్మిగ  తానున్.
కం.
బిడ్డల బెంచుట కొరకును
న్నడ్డంకులుయెన్ని యైన నదరక నుండున్,
దుడ్డులు సంపాదించును
బిడ్డల వృద్ధికి నెపుడున్ ప్రేమగ నాన్నే.
కం.
అనయము ధైర్యము నింపుచు
వినయము బోధించునాన్న వేదము తీరున్,
మనమున దలచిన జాలును
ధనముగ  మాచెంత నుండు ధర్మజుడిలలో .