ఎన్నాళ్ళకెన్నాళ్ళకో వేమన్న గోపీతో మాటలు: -- యామిజాల జగదీశ్


 కొన్ని నెలల క్రితం మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ తో మాట్లాడినప్పుడు డా. ఎన్. గోపీగారి గురించి కొన్ని మాటలు రాసి పంపించమని కోరిన వెంటనే 
"కవిత్వ చుక్కాని గోపి" అంటూ
"హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరం లోని భువనగిరిలో పుట్టిపెరిగిన ఎన్. గోపి ఆచార్యులుగా, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా, వేమన జీవితం - సాహిత్యంపై సాధికారికమైన పరిశోధన చేసిన ఉద్దండుడిగా అందరికి తెలుసు. కవిత్వమంటే ఆయనకు ప్రీతి. తెలుగు సాహిత్యములో కొత్త ప్రక్రియ నానీలు శ్రీకారం కట్టిండు. కవిగా కేంద్ర సాహిత్య అకాడెమి పురస్కారం  అందుకున్నాడు. 1970వ దశకం నుంచే  తెలంగాణ జీవితాలను, భాషను తనదయిన రీతిలో అక్షరబద్దం చేసిండు. తంగెడుపూలు పేరిట తన కవితా సంకలనాన్ని వెలువరించి తెలంగాణ మట్టిపరిమళాన్ని అక్షరాలుగా మలిచిండు. ఆయన రాసిన జలగీత ఎన్నో దేశ, విదేశ భాషల్లోకి అనువాదమయి తెలుగు కవితా గొప్పదనాన్ని నిరూపించింది.  గోపి గారు రాసిన కవిత్వం పలు భాషల్లోకి తర్జుమా అయ్యింది. సుప్రసిద్ధ పరిశోధకులు సాహిత్య చరిత్రకారులు ఆరుద్ర మద్రాస్ లైబ్రరీలో తరచు తారస పడిన గోపి పరిశోధనను అద్భుతమని మెచ్చుకున్నాడు అంటే దాని గొప్పదనం తెలుస్తుంది. నిజానికి విదేశాల్లోని వేమన పద్యాలను సేకరించి వాటిలోని ప్రామాణికతను లెక్కగట్టి సెప్పిండు. ఏది ప్రక్షిప్తం, ఏది ఒరిజినలో ఆయన సాధికారికంగా నిర్ధారించాడు. ఎందరో పరిశోధకులకు మార్గదర్శిగా నిలిచిండు...." 
అంటూ మెయిల్లో పంపాడు. అందుకు సంగిశెట్టికి కృతజ్ఞతలు చెప్తూ విషయానికొస్తున్నాను....
ముప్పై తొమ్మిదేళ్ళ క్రితం నేను మద్రాసు నుంచి హైదరాబాదుకి వచ్చిన రోజులవి. రాంనగర్లో కమ్యూనిటీ హాల్ ఎదురుగుండా ఉన్న వీధిలో మొదటి ఇంట్లో గోపీగారు ఉంటే ఆ వీధిలోనే ఓ అయిదారిళ్ళవతల కాంగ్రెస్ నేత జీఎస్. రెడ్డి గారింట మేడమీద ఓ గదిలో అద్దెకుంటున్న మా అన్నయ్య ఆనంద్, తల్లావజ్ఝల శివాజీ, తల్లావజ్ఝల లలితాప్రసాదులతో నేనూ కలిసాను. ఇక్కడికి మూడిళ్ళవతల సీనియర్ పాత్రికేయులు జి. కృష్ణగారు ఉండేవారు. వాళ్ళింటే భోజనం గట్రానూ. రోజులో ఎక్కువ గంటలు వారింటే ఉండేవాడిని. కృష్ణగారివద్దకు ఎందరెందరో పెద్దలు వచ్చిపోతుండేవారు. వారిలో కొందరు కాళోజీ, వావిలాల గోపాలకృష్ణయ్య, గద్దర్, ఎన్. గోపి, సామల సదాశివ, చీమకుర్తి శేషగిరిరావు.  వీరందరిలో ఒక్క గోపీగారే ఎప్పుడూ వేమన గురించే మాట్లాడుతుండేవారు. అందుకే ఆయనను "వేమన్న గోపీ" గారని చెప్పుకునే వాళ్ళం. ఆయన వేమనపైన పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నించి డాక్టరేట్ పట్టా పొందారుకూడా. 
తెలుగు నేర్చుకోవడం, చదువుకోవడం వల్లనే తాను గొప్ప కవి అయ్యానని ఓ కార్యక్రమంలో చెప్పిన గోపీగారు నలబైకి పైగా పుస్తకాలు రాశారు. ఆయన పుస్తకాలలో నేను మొట్టమొదటగా చదివింది తంగెడు పూలు. 
ఇక నేనీ మధ్య చదివిన పుస్తకాలలో ఒకటి వేమన్న వెలుగులు. మూడేళ్ళపాటు ఈ శీర్షికతోనే సాక్షి ఫన్డేలో గోపీగారు రాసినవి లక్షలాది మంది పాఠకుల మనన్నలు పొందాయనడం అతిశయోక్తికాదు. 2012 జనవరిలో పుస్తక రూపంలో వెలువడిన ఈ వేమన్న వెలుగులులో 428 పద్యాలకు వ్యాఖ్యానముంది. వేమన్న మూడు వేల పద్యాలలోని ముఖ్యమైన భావాలన్నింటికీ ప్రాతినిధ్యం వహించే పద్యాలు ఇందులో పొందునరచినట్టు, వేమన్న భావజాలసమగ్రతను దృష్టిలో పెట్టుకున్న సంకలనమిది అని గోపీగారు తెలిపారు.  
ఆయన అధ్యాపకవృత్తివల్ల కాబోలు వేమన్న వెలుగులు పుస్తకంలో ప్రతి పద్యానికి కేవలం తాత్పర్యం మాత్రమే కాక  భావాలను విశదీకరించిన తీరు చదువుతుంటే మళ్ళా మళ్ళా చదవాలనేలా ఉందీ పుస్తకం. అనేక చోట్ల ఆయా మాటలకున్న అనేకానేక అర్థాలు ఇవ్వడం ఆసక్తిగా చదివించింది. ఇందువల్ల నేను తెలుసుకున్న పదాలనేకం. ముఖ్యంగా ఈ పుస్తకం ప్రత్యేకత ఇదేనని చెప్పుకోవచ్చు. 
అక్షరదోషాలెక్కడా దొర్లకుండా ముచ్చటగా ముద్రితమైన ఈ అయిదు వందల పేజీల పుస్తకానికి ముఖచిత్ర రచన ప్రముఖ కథకులు, చిత్రకారులు అయిన శీలా వీర్రాజుగారు చేశారు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. గోపీగారి ఇంటి ఆవరణ రెండో అంతస్థులో వేలాది పుస్తకాలతో ఓ గ్రంథాలయం ఉంది. దీని పేరు "వేమన విజ్ఞాన మందిరం". ఈ మందిరంలో పెట్టుకోడానికి శీలా వీర్రాజుగారు వేమన పెయింటింగ్ వేసిచ్చారు. దానినే ఈ గ్రంథానికి ముఖచిత్రంగా వాడారు. నిజానికి ఈ పుస్తకమందిరాన్ని ఒకానొకప్పుడు నేను మా అత్తగారితో కలిసి వారింటికి వెళ్ళినప్పుడు సందర్శించాను. 
చాలా ఏళ్ళ తర్వాత నిన్న రాత్రి (5.7.21) గోపీగారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన మాట వింటుంటే ఎంత హాయిగా అన్పించిందో. నేనీ భాగ్యనగరానికి వచ్చిన తొలిరోజుల్లో విన్న అదే గొంతునే విన్నాను. ఎక్కడా మాటతీరుగానీ స్వరంగానీ మారలేదు. కృష్ణగారి సంతానాన్ని పేరుపేరునా అడిగిన ఆయన మాటల్లో ఆప్యాయతానురాగాల అనుభూతి పొందాను. నేరుగా వస్తే పుస్తక మందిరాన్ని చూడొచ్చు...కబుర్లు చెప్పుకోవచ్చన్నారు. త్వరలోనే ఆయన ఇంటిమీదికి వాలి  మాటలముచ్చట్లతో ఆనందంగా గడపాలని ఆశగా ఉందీ మనసుకి.