వీర నారూజీ! అచ్యుతుని రాజ్యశ్రీ

 కొన్ని పదాలు మాటలు  మనసుని గాయపరిచి కుళ్ళి కృశించిపోయేలా చేస్తాయి.కొన్ని  ఉత్సాహంని ప్రేరణను కలిగిస్తాయి. అందుకే మాటలు జాగ్రత్తగా వాడాలి. మౌనంగా ఉన్నా చచ్చుపుచ్చు దద్దమ్మ అని తాటాకులు కడతారు. అభిమానవంతుడు మాటపై నిలబడి తన తడాఖా చూపుతాడు. కొన్ని శతాబ్దాల క్రితం  రాజపుత్రులు మాట పై నిలబడి తమ ప్రాణాలు కూడా అర్పించేవారు. అలాంటి  వీరాభిమాని  నారూజీ!
అజ్మీర్ పై విజయం పొందాక మొగల్ సైన్యం  మేవాడ్ రాజధాని  ఉదయపూర్ వైపు సాగిపోతోంది. మహారాణా రాజ్ సింహాకి ఈవిషయం తెలిసి నగరాన్ని  ఖాళీ చేయించాడు. మరి శత్రువుని ఎదుర్కొనే శక్తి  ఆయనకు లేదు.  నగరవాసులు కొండప్రాంతాలకి  పారిపోయారు.కొంత మంది సైనికులు ఔరంగజేబు సైన్యం ని అడ్డగించేందుకై సిద్ధంగా  ఉన్నారు. చాటుగా మాటువేశారు. మొగల్ సైన్యం  నగరంలో ప్రవేశించింది.పిల్లి కుక్క  లాంటి జంతువులజాడ లేకపోటంతో నివ్వెరపోతూ చూస్తూ నిలబడ్డారు.
ఒకేఒక్క వ్యక్తి  నారూజీ  రాజమహల్ ముఖద్వారం వద్ద  నిరీక్షిస్తున్నాడు."నేను  ఒంటరిగా  శత్రువుని ఎదుర్కొని వారి భరతంపడతా"అని రాణాతో వాదించి గెలిచాడు. అతని మొండిపట్టు వెనుక ఓ కారణం ఉంది.  రాణా ఆస్థాన వ్యక్తి ఒకడు తమాషాగా 'నారూజీ!ఈదర్బారు నించి  నీవు ఎన్నో బహుమతులు  సన్మానాలు పొందారు.కాబట్టి నీవు నగరాన్ని విడిచి పెట్టరాదు.'అంతే ఆ మాటనే శిరోధార్యంగా భావించాడు నారూజీ.ఆచిన్న హాస్యపుమాట అతని గుండెల్లో గుచ్చుకుంది. ఆవ్యక్తి ఎంత బతిమలాడినా ససేమిరా  మీతోరాను అని తెగేసి చెప్పారు. రెండు వారాలు గడిచాయి.  మొగల్ సైన్యం ఉదయపూర్ లోకి ఎంచక్కా దూసుకుపోతున్నారు. కోటద్వారాలు దాటి లోపలికి వెళ్ళగానే కాలయమునిలాగా నారూజీ వారి తలలను ఖడ్గం తో తరిగి పోగులు పెట్టసాగాడు.అనుకోని ఈఘటనకు శత్రువులు బిత్తరపోయారు.అంతాకలిసి ఆరాజభక్తుని చుట్టుకుని  హింసించి  నారూజీ తల నరికారు. ఆతని తల కింద పడినా మొండెం  చేతిలోని కత్తి  ఆడటంచూసి దిమ్మెరపోయారు.భయంతో మొగల్ సైన్యం పరుగుతీసింది. ఇలాంటి దేశభక్తులెందరో  చరిత్ర మరుగున పడటం దురదృష్టం. పిల్లల పుస్తకాలలో కనీసం  మోరల్ సైన్స్ లో వీరుల దేశభక్తుల చరిత్ర టూకీగా అన్నా ఉండితీరాలి. అప్పుడే మనదేశ గొప్పతనం  అందరికీ తెలుస్తుంది.