చార్జింగ్ :-మంగారి రాజేందర్ జింబో

 
 
           ( 12 January 2019)
         
ఈరోజుల్లో మొబైల్ ఫోన్ లేని మనిషి కన్పించడం లేదు. ఎవరిని చూసినా వాళ్లు మొబైల్‌ని చూస్తూనో మాట్లాడుతూనో కన్పిస్తున్నారు. ఇది ఈ రోజుల్లో కనిపిస్తున్న దృశ్యం.
మనుషుల్తో వ్యక్తిగతంగా మాట్లాడటం తగ్గిపోయింది. ఫోన్‌లో మాట్లాడటం పెరిగిపోయింది.
ఉదయం లేస్తూనే మొబైల్ ఫోన్లని చార్జింగ్ పెడతారు. మధ్యమధ్యలో కూడా చార్జింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది పవర్ బ్యాంక్‌లని వెంట పెట్టుకుంటారు. ఈ మొబైల్ ఫోన్లు లేక ముందు మనుషులు ఎలా బతికారో అన్న సంశయం ఆ కాలాన్ని చూడని వ్యక్తులకు కలుగుతుంటుంది.
చార్జింగ్ లేకపోతే ఎంత ఖరీదైన మొబైల్ ఫోన్ అయినా ఉపయోగం ఉండదు.
ఒక్క మొబైల్‌కే కాదు. చార్జింగ్ అనేది అందరికీ అవసరమే. 
ఈ రొటీన్ జీవితం నుంచి బయటపడి అలా-
ఓ పల్లెటూరుకి వెళ్లి ఎద్దులబండి (కచ్చురం)లో ప్రయాణం చెయ్యాలి. 
పొలం గట్టున వెళ్లి పచ్చటి పొలాలని చూస్తూ ఉండాలి. 
దూరంగా ఉన్న అక్క దగ్గరికో చెల్లి దగ్గరికో  వెళ్లి ఓ రెండు రోజులు గడిపి రావాలి.
దగ్గర్లో వున్న ఓ గుట్ట మీదికి వెళ్లి అక్కడ వున్న దేవునికి దండం పెట్టుకోవాలి. ఆ కొండ పైనుంచి కదలాడే బస్సులని చూస్తూ గడపాలి.
మన ఊరి బయట వున్న వాగు దగ్గరికో, చెరువు దగ్గరికో, నది దగ్గరికో వెళ్లి ఓ గంట గడుపవచ్చు.
చిన్ననాటి స్నేహితులతో కలిసి ఓ గంట గడిపి నవ్వుకోవచ్చు.
ఇవన్నీ మనల్ని మనం చార్జింగ్ చేసుకునేవే.
చార్జింగ్ చేసుకోవడానికి సుదూర ప్రయాణాలు ఊటీ, కొడైకెనాల్, కాశ్మీర్లు, సిమ్లాలు మాత్రమే కాదు మన చుట్టూ ఎన్నో ఉన్నాయి.
పూటపూటకి మొబైల్‌ని చార్జింగ్ చేసుకునే మనం, మనల్ని మనం చార్జింగ్ చేసుకోవడం మర్చిపోతున్నాం.
మొబైల్‌ని చార్జింగ్ చేయడం ఎంత అవసరమో, మనల్ని మనం చార్జింగ్ చేసుకోవడం ఇంకా అవసరం.
కాదంటారా?
కామెంట్‌లు