అందరూ చదవాల్సిన మొగ్గలు : -దుగ్గి గాయత్రి,టి.జి.టి.తెలుగు,పరిశోధక విద్యార్థి,కల్వకుర్తి,నాగర్ కర్నూల్,తెలంగాణ.

 పువ్వుపుట్టగానే సహస్రదళాలలో పరిమలించినట్లుగా 
బాల్యంలోనే అసమాన పాండిత్యాన్ని ప్రదర్శించిన దిట్ట
సామాజికతను ఒంటబట్టించుకున్న అపారదేశభక్తుడు పివి
తెలుగు రాష్ట్రాల నుండి  ప్రధానమంత్రిగా పనిచేస్తూ దక్షిణ భారతదేశ ఖ్యాతిని భువిపై నిల్పి, మైనారిటీ ప్రభుత్వాన్ని తన ఒంటిచేత్తో ఎత్తి ప్రభుత్వాన్ని నెలకొల్పిన గొప్ప రాజకీయ దురంధరుడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన అపర చాణక్యుడు తన విప్లవాత్మకమైన  ఆలోచనలు అమలు పరిచి అసాధ్యాలను సుసాధ్య పరిచిన మహా మేధావి . రాజకీయ, ఆర్థిక సంస్కర్తనే  కాకుండా సాహిత్య పూదోటలో విరిసిన కుసుమం .17 భాషలను  నేర్చి పాండిత్యంలో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషావేత్త. కథ ,నవల, అనువాద ,సంపాదక ప్రక్రియలలో ఎన్నో రచనలు చేసి ఎందరో మనసులను చూరగొన్న విలక్షణ రచయిత .స్వాతంత్రోద్యమంలో పాల్గొనడమే కాకుండా ఎన్నో ఆర్థిక, విద్య ,భూ సంస్కరణలు చేపట్టాడు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన గురుకుల సృష్టికర్త. రాజకీయాల్లో ఎన్నో సందర్భాల్లో మౌన వ్రతాన్ని పాటించి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్న మౌనముని .తన సమర్థవంతమైన పరిపాలనతో తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన పివి నరసింహారావు గారి జీవితాన్ని మొగ్గలలో ఇనుమడింప చేసిన వారు మొగ్గల సృష్టికర్త అయిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు. వీరు తన మొగ్గలలో పివి గారి జీవితాన్ని క్లుప్తంగా మన ముందుంచే బృహత్కార్యాన్ని నిర్వహించారు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు తన మొగ్గల పూదోటలో పివి గారి చరిత్రను విరబూయించారు.
నిరంతర సంస్కరణ నిచ్చెన మెట్ల తో తాను ఎదుగుతూ
అందరికీ అభివృద్ధి ఫలాలను అందించిన అభ్యుదయవాది
 సంస్కరణలకు చిరునామాగా నిలిచిన పథగామి పివి
          పై మొగ్గలో పివీని ఆదర్శంగా తీసుకుంటూ మన జీవితాల్లో కూడా ఎన్నో సంస్కరణలు చేసుకోవచ్చని చెప్పకనే చెప్పారు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు.
పివి మదిలో తొలచి వికసించిన సంస్కరణల బీజాలు
భారతదేశమంతటా పూసిన కల్పతరువుల క్షేత్రాలు
నేటి దేశాభివృద్ధికి ఆధారం పివి సంస్కరణఫలాలు
      అనే మొగ్గలో పివి గారి ఆర్థిక సంస్కరణలను ప్రతిబింబించారు. డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు తన ప్రతీ మొగ్గలో రాజకీయ, ఆర్థిక,భూ, విద్య, వాణిజ్య, గ్రామీణాభివృద్ధి, తీవ్రవాద ,మానవ వనరులు, విదేశాంగ విధానాలు, పారిశ్రామిక విధానాలు ఇలా ఎన్నిటినో పివి గారి అసాధ్యాలను తన "అసాధ్యుడు" (పివి మొగ్గలు)లో చక్కగా వివరించిన తీరు ఎంతో అభినందనీయం. ఈ పుస్తకం తెలుగు ప్రజలంతా చదవదగినదని చెప్పటంలో సందేహం లేదు.పివి గారి గురించి ఇంత చక్కటి పుస్తకాన్ని సాహితీలోకానికి అందించిన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారికి నా సాహితీ ప్రణామాలు.

కామెంట్‌లు