ఇండో - పాక్ యుద్ధమప్పుడు పట్టుబడ్డ పాకిస్తాన్ ఖైదీల శిబిరానికి వెళ్ళి వారి లోటుపాట్లను తెలుసుకున్నారు జనరల్ మానెక్ షా.
ప్రతి పాక్ ఖైదీతోనూ కరచాలనం చేసి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు.
అప్పుడు ఓ పాక్ సుబేదారు చెప్పాడు...
" మీ సైన్య విజయానికి కారణం ఇప్పుడు అర్థమైందండి. నేను పాకిస్తాన్ సైనిక దళంలో ఇరవై అయిదేళ్ళుగా పని చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకూ మా సైన్యంలో ఏ ఒక్క దళపతి కూడా మాతో కరచాలనం చేయలేదు.... " అని!
దీనినిబట్టి మానెక్ షా సైనికులతో ఎంత సన్నిహితంగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.
సాహసోపేత భారత సైనికుడిగానూ, జాతీయ హీరో ఫీల్డ్ మార్షల్ గానూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన మానెక్‌షా (1914 ఏప్రిల్ 3 – 2008 జూన్ 27) మొత్తం ఐదు యుద్ధాలలో పాల్గొన్నారు. అందరూ ఆయనను ప్రేమతో 'శ్యామ్ బహదూర్' అని పిలిచేవారు.
ఆయన తల్లిదండ్రులు గుజరాత్ రాష్ట్రంలోని వల్సాద్ అనే చిన్న పట్టణం నుంచి అమృతసర్ (పంజాబ్)కు వలస వెళ్ళారు.
సిల్లూ బోడెను ఆయన ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.
డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో క్యాడెట్‌గా తొలి బ్యాచ్‌లో చేరిన మానెక్ షా 1934లో సైన్యంలో రెండో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జనరల్ కుమారమంగళం నించి 8వ సైనిక దళాల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరించిన మానెక్ షా 1973లో రిటైరయ్యారు.
భారత దేశ స్వాతంత్య్రానంతరం చైనా, పాకిస్థాన్‌లతో జరిగిన మూడు యుద్ధాలోనూ ఆయన ప్రదర్శించిన వ్యూహ చతురత అమోఘం.
1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆయన కారణంగానే పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. పాకిస్తాన్ కు చెందిన వేలాదిమంది యుద్ధఖైదీలుగా పట్టుబడ్డారు.
గొప్ప యోధుడిగా మన దేశానికి ఎన్నో విజయాలందించిన మానెక్ షా 2008లో తన 94వ ఏట తుదిశ్వాస విడిచారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి