దేవుని జవాబు..అచ్యుతుని రాజ్యశ్రీ

 ఇప్పుడు జనంలో భక్తి బాగా పెరిగిందనే చెప్పవచ్చు. గుడికి వెళ్లి  తమ కోరిక తీరటంకోసం దేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.అంతవరకూ బానే ఉంది. కానీ చేతిలో ఓ కాగితం ముక్కపట్టుకుని తాము చేసే ప్రదక్షిణాల సంఖ్య వేస్తూ తిరగటం శివ కి నచ్చదు.శివ రోజూ గుడికి వచ్చి భక్తి తో నమస్కరించి  హుండీలో కానుక వేయడు కానీ బైట ఉన్న దివ్యాంగులకి పండు బిస్కెట్లు  పంచుతాడు.అందరూ వెంటపడతారు కానీ వారికి వేయడు.ఇలా వేస్తూపోతే సోంబేరులు తయారు అవుతారు అని శివ  అభిప్రాయం.
 ఆరోజు  శివ గుడికి వెళ్లాడు.తొలి ఏకాదశి  ..జనం  ఒకరిని ఒకరు తోసుకుంటూ  మీద మీద పడుతున్నారు.శివా కి చాలా బాధగా  అనిపించింది. రోజూ లాగా  దైవ దర్శనం కాలేదు."దేవుడూ!నీ కింత పక్షపాత బుద్ధి పనికి రాదు. రోజూ వచ్చే నాకు నీ దర్శనం  లేకుండా చేశావు.స్పెషల్ పూజ కి టికెట్ కొనను.ఆడబ్బుతో  దివ్యాంగులకి వస్తురూపేణ సాయం చేస్తున్నాను. డబ్బు ఇస్తే వారు బీడీ సిగరెట్ కొనుక్కుంటున్నారు. దుస్తులు ఇస్తే  అమ్ముకుంటున్నారు.  నేను చేసిన పాపం ఏంటి?"
భగవంతుడు పకపకా నవ్వాడు. "పిచ్చివాడా!ఈజనాలు కన్నతల్లి తండ్రులను ముసలితనం వచ్చాక సరిగా చూడటం లేదు.
: కానీ వారు పోయాక ఆర్భాటంగా  పేపర్లలో వేయించి  అన్న దానం అని గొప్పలు చెప్పుకుంటారు. ఇక మొక్కులు పేరు తో లక్షలు కుమ్మరిస్తారు.కానీ  బీద పిల్లలకి పుస్తకాలు పెన్నులు కొని ఇవ్వడానికి  బుద్ధి పుట్టదు. అలాగే  మనకి తెలిసిన వివరాలు విషయాలు ఇంకోరికి చెప్పితే  వారు  ఆయా పోటీలలో పాల్గొని  మనకు ప్రైజ్ రాకుండా వారే కొట్టేస్తారు అనే దుగ్ధ ఉంటుంది.  నాకు పూజ చేయకున్నా ఫర్వాలేదు. గుడి కి రాకున్నా ఏమీ అనుకోను. అన్నింటా నన్ను  చూసేవాడే నిజమైన భక్తుడు అర్థం అయిందా శివా!"
అంతే శివా కి చెప్పలేనంత తృప్తి  ఆనందం కలిగింది. ఇదే నిజమైన భక్తి.
కామెంట్‌లు