సమతా కుసుమాలు:-నెల్లుట్ల సునీత
కన్నీళ్లు కష్టాలు కడగండ్ల మెరుపుల 
పోరాటంతో శ్రమించే  కడు పేదలు
జీవనయానంలో బాధల ప్రవాహంలో
ఆకలి పేగులను మాడ్చుకుంటూ 
అస్తిపంజరంలా బ్రతికేస్తూ  కూడు కరువై 
గూడు లేక  కనికరించే మానవత్వం కానరాక  దానికి తోడు//
 
కరోనా కాలము బాధలు ప్రతి నిత్యము
ఆకలి చావుల ఆరాటాలు శ్రమజీవుల పోరాటాలు
 వైద్య సేవలు విద్యా ఫలాలు అందని అభాగ్యులు//
సామాజిక పెనుమార్పులలో ప్రశ్నార్థకమైన బ్రతుకులు//

జీవిత కమలానికి సరికొత్త సూర్యోదయంరావాలని నిరీక్షణ//
మానవతా మమతలు ముప్పేటగా అల్లుకున్న కవితాధారతో 
ఆదర్శంగా జీవిస్తూ జగమంత ప్రేమను  
పిడికెడంత హృదయంలో పదిలంగా దాచుకుని
 మనసున మాలిన్యాలను అలసత్వం కడిగే స్నేహహస్తం కావాలి మనం//

మానవత్వపు మమతలు పంచి 
సమైక్యతా భావాల  చిత్రాలని చిత్రిస్తూ
 సమరసత సేవాగుణంతో సమాజంలో వెలగాలి 
మానవీయతతో సమతా కుసుమాలను పూయిస్తూ//

 సమస్త జీవకోటికి ఆకలి తీర్చే ఆపన్నహస్తంగా
 విశ్వ సోదరత్వం అనే నైతికతతో సేవా సమరసతను చాటాలి
నిస్వార్థంతో  దురాశలు వదిలి//