ఆద్దాల ప్రదర్శన :--మంగారి రాజేందర్ జింబో

  
         ( అగస్ట్ 2018)
చాలా మందిని చూస్తున్నప్పుడు చిన్నప్పటి అద్దాల ప్రదర్శన గుర్తొస్తుంది.
మా వేములవాడలో శివరాత్రి చాలా పెద్ద పండుగ. నెల రోజుల ముందు నుంచే జాతరకు మా వూరు సిద్ధమయ్యేది. జాతర గ్రౌండ్‌లో కొత్తకొత్త షాపులు వెలిసేవి. సర్కస్ వచ్చేది. లైట్లను వెలిగించే అమ్మాయి. మోటారుసైకిలుతో విన్యాసాలు చేసే గ్లోబు ఇలా ఎన్నో వచ్చి చేరేవి.
ఈ ప్రదర్శనలు, పిల్లలనే కాదు పెద్దలను కూడా బాగా ఆకర్షించేవి. వీటితోబాటూ అద్దాల ప్రదర్శనని కూడా ఏర్పాటు చేసేవారు. అది హాస్యంగా వుండేది. పది పైసలు ఇచ్చి టికెట్టు కొనుక్కుని లోనికి వెళ్తే రకరకాల అద్దాలు కన్పించేవి. ఒక అద్దం మన పొడవుని పెంచేది. మరో అద్దం మనల్ని కురచగా చేసేది. ఇంకో అద్దం మనల్ని లావుగా, సన్నగా చేసేవి. ఇలా రకరకాల అద్దాలలో మా ప్రతిబింబాలని చూసి నవ్వుకునేవాళ్లం.
జాతర ప్రభావం, ఉత్సాహం పిల్లల్లో చాలాకాలం కొనసాగేది. అప్పుడు స్మార్ట్ ఫోన్లు లేవు. వుంటే మా ఫొటోలను తీసుకునేవాళ్లం. 
మనం మనమే. 
కానీ అద్దాలు మన రూపురేఖల్ని మార్చేవి. 
ఇప్పుడు అద్దాల ప్రదర్శనలు లేవు. కానీ రకరకాలుగా వున్న మనుషులు ఎక్కువగా కన్పిస్తున్నారు.
కొంతమంది వ్యక్తులు తాము ఉన్నదానికన్నా ఎక్కువ ఊహించుకొని గర్వపడుతూ ఉంటారు.
మరి కొంతమంది తాము వున్న స్థితికన్నా తక్కువ ఊహించుకొని ఆత్మన్యూనతతో బాధపడుతూ వుంటారు.
చుట్టూ వున్న మనుషులని, సమాజాన్ని గమ్మతె్తైన అద్దాలుగా ఊహించుకొని ఈ రకంగా అభిప్రాయపడుతూ ఉంటారేమో.
ఈ రెండు అభిప్రాయాలూ సరైనవి కాదు.
మనం మనమే. 
ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అట్లా అని తక్కువగా ఊహించుకోవాల్సిన పనిలేదు.

కామెంట్‌లు