మనస్తత్వ కైతికాలు:-రమేశ్ గోస్కుల-కైతికాల రూపకర్త-హుజురాబాద్.
జామ పండు మెరిసి
చిలక చింత తీర్చు
చిలకమ్మ ఎగురుతూ
పసిపాప నోదార్చు
వారేవ్వా సృష్టి
తీరైన పుష్టి

మిరప కారం చూసి
మిరియం మరిచాము
కొన్న జలము త్రాగి
శుద్ధి చేయుట విడిచాము
వారేవ్వా మార్పు
స్వయం శక్తి  తూడ్పు

సమయానుకూలంగా
నడుచు వారెప్పుడూ
వెనుక బడుటన్నది
కాన రాలెదెప్పుడూ
వారేవ్వా కాలం
సరిగుంటే గాలం

అల్పులైన నరులు
రోజు ఏడుస్తుండు
సజ్జనాళి నిరతం
సంతోషపడుచుండు
వారేవ్వా భావాలు
అస్తిత్వ కిరణాలు

మంచి వారందరూ
యెంచి నిలబడెదరూ
చెడ్డ వారందరూ
తుంచ నిలబడెదరూ
వారేవ్వా మంచి చెడు
చేయు పనితో వెలుగు

కాలాన్ని కోరుతూ 
నిలబడాలి నీవు
నీ కొరకు రమ్మంటే
నీవందు కోలేవు
వారేవ్వా మానవా!
సంకల్పమందవా!
 
తామసుండెప్పుడు
ధర్మాలు వల్లింప
చీకట్లో కాగడా
చిత్రమేసి వెతికింప
వారేవ్వా ధర్మం
మారుతున్న మర్మం

పైకి నీతులు చెప్పి
లోన గోతులు తీసి
జనం మధ్య నున్న
దానవాత్ముడు మిడిసి
వారేవ్వా కొందరు
రాకాసుల ఆత్ములు

అత్యాశతో వెళితే
అడవిన చిక్కినట్లు
వింత పేర్లు తొ వచ్చి
విపరీత దోపిడట్లు
వారేవ్వా ప్రైవేట్లు
జనంపై ననే వేట్లు

 గొప్పగా చూపించు
గోతులను  తీయును
వీడకుండా యుండి
విజ్ఞతను  త్రుంచును
వారేవ్వా అప్పులు
తెచ్చునెన్నొ తిప్పలు

సుజనులతో సహవాసం
సుందర బతుకు నీదవును
పువ్వులతో స్నేహ మంది
మరువం శిగనెలుగును
వారేవ్వా స్నేహం
వెలిగించుట నైజం

పోయినట్టి సొమ్ము
తిరిగి రాదెప్పుడు
పొదుపు గుణం నంది
కాపాడనప్పుడు
వారేవ్వా అదుపు
రేపటికగు మదుపు

లాభమాశ చూపును
డబ్బు లెన్నొ కూర్చును
తన ఖర్చులు చూసుకుని
తది తరుల ముంచును
వారేవ్వా దళారీ
అసలైన కిలాడి

బీరాలాడేవాడు
బేరాలెక్కువ చేయు
తను కోరిన ధర కోరి
సరుకు గుణం చౌక చేయు
వారేవ్వా లోబులు
పేడలోని పురుగులు

 కూలి నాలిలెంత 
కష్ట పడుతున్నను
గట్టుకు కట్టెలను
కొట్టి నట్లాయెను
వారేవ్వా శ్రామికులు
అడుగడుగు అగచాట్లు

ఆది కాలం నుండి
అంతయు తామనిరి
అందరిని అవసరాన
ఆట బొమ్మలు చేసిరి
వారేవ్వా అధికులు
ఎత్తుల లో జిత్తులు

పసిడి  చేలల్లోన 
పంట పండిస్తేనే
లోకపు వృత్తులకు
నిలువ నీడయ్యెనే
వారేవ్వా రైతులు
అవనికన్న దాతలు

బ్రహ్మ రాక్షసిలాగ
యంత్రమెంతెగిరినను
మనిషి చేతిలోనవి
మర బొమ్మలే యగును
వారేవ్వా మనిషి
నీకు నీవే సాటి

మంచైతె మనదని
చెడైతే పరులదనిరి
ఒకరిని మించొక్కరు
పరుల నిందించిరి
వారేవ్వా మంచి చెడు
మార్చె ధర్మం తీరు!