పేరుతో చేసుకున్న పరిచయం:-- యామిజాల జగదీశ్
 అనుకోకుండా కాదు అనుకునే పరిచయం చేసుకున్నానాయనతో, అదీను, పేరు చూసి!
అవును, నిజమే, ఆయన పేరే నన్ను ఆకర్షించింది. ఆ తర్వాతే ఆయన చిత్రాలు... నేనొకప్పుడు వ్యక్తిగత సమస్యతో సతమతమైనప్పుడు ఏదైనా న్యాయపరమైన సలహా ఇస్తారేమో ఊరట చెందడానికని ఆయనను పరిచయం చేసు కున్నాను. ఇంత ఉపోద్ఘాతం చెప్పి ఆయన పేరేంటో చెప్పలేదు కదూ....విషయానికొస్తాను. ఆయన పేరు జస్టిస్ వజ్రగిరి. జస్టిస్ అనే మూడక్షరాలతోనే స్నేహం కోసం చేయి చాచాను. ఆయన ఏ కోర్టులో జస్టిసో అనుకున్నా. ఫోన్లో లైన్ కలవడంతోనే చాలా నెమ్మదైన స్వరంతో జస్టిస్ గారేనాండీ నమస్కారం అన్నాను. ఆయనా ప్రతి నమస్కారం చేశారు. తీరా మాటల మధ్యలో తెలిసింది జస్టిస్ అనేది ఆయన పేరని, ఆయన జస్టిస్ కాదని, ఆర్టిస్ట్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే జస్టిస్ అనే పేరుండటం నేను మొదటిసారిగా వింటున్నాను ఆయనద్వారా. నా సమస్యకు సలహా అడుగుదామనుకున్న నేను ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన చిత్ర జగత్తు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాను. ఆయన కుంచె నించి ఊపిరి పోసుకునే ప్రతి బొమ్మా అద్భుతం. అమోఘం. 
వజ్రగిరి జోసఫ్, విమలమ్మ దంపతుల సుపుత్రులైన  కళాకారుడే జస్టిస్ వ్రజగిరి. ఆయన అచ్చంగా బహుముఖ ప్రజ్ఞాశాలి.
కారణం, చిత్రకారునిగా, కవిగా, రచయితగా, తబలా వాయిద్యకారునిగా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకునిగా, క్రైస్తవ సందేశకునిగా కొనసాగుతున్న జస్టిస్  1966లో సత్తెనపల్లిలో జన్మించారు.
ఇంటర్ వరకు చదివాక మ్రదాసులో డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ ప్యాసయిన జస్టిస్  కమర్షియల్ చిత్రకారునిగా స్థిరపడ్డరు.
 
ముప్పై ఎనిమిదేళ్ళుగా అనేక రకాల చిత్రాలతో ప్రజల మనసులో చెరగని స్థానాన్ని సంపాదించిన జస్టిస్ చిత్రాలు అందానికీ, నూతన శైలికి అద్దం పడతాయి. 
ఆయన చిత్రాలు రాజకీయ నాయకులు, సినీప్రముఖులతోపాటు అన్ని వర్గాలవారి అభిమానాన్ని చూరగొన్నాయనడం ఒట్టి మాట కాదు. పోర్ట్రయిట్ చిత్రకళలో ఆయనది అందె వేసిన శైలి. 
అచ్చం ఫోటోలాగే గీసే ఆయన బొమ్మలు చూసిన క్షణాన ఆశ్చర్యపోతారు. ఔరా అనకమానరు. 
ప్రముఖుల పుస్తకాలకు ముఖచిత్రాలను వేసిచ్చిన జస్టిస్ వాల్ పెయింటింగులు, సైన్ బోర్డులు, బ్యానర్లు, సన్మానత్రాలు వ్రాసివ్వడంలో ఆయన పంథాయే వేరు.
ఎన్నో కవితలు కూడా రాసిన జస్టిస్ "బొమ్మలు గీద్దాం రండి" అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఎవరైనాసరే చిత్రకళను సులభంగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
బైబిల్ సారాంశాన్నంతటిని ఒకే చిత్రంగా చిత్రించి ఆంధ్రప్రదేశ్ లో  ఓ కొత్త రికార్డు నెలకొల్పిన జస్టిస్ 300 మందికి పైగా ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను పెన్సిల్ తో ఫోటోలలాగా చిత్రించి మరొక రికార్డును సృష్టించడం విశేషం.
తను గీసిన మహాకవి గుఱ్ఱం జాషువా చిత్రాలు ఆంధ్రదేశమంతటా అనేక పుస్తకాలకు ముఖచిత్రాలుగా, జాషువా గారి కార్యక్రమాలకు ఇప్పటికీ వాడుకుంటున్నారని జస్టిస్ చెప్పారు.
ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఎంతో మందికి చిత్రకళ నేర్పించారు. 
ఆయన వద్ద శిక్షణ పొందిన వారిలో పలువురు డ్రాయింగ్ టీచర్లుగా, కమర్షియల్ ఆర్టిస్టులుగా స్థిరపడ్డారు.
సమాజానికి ఉపయోగపడే చిత్రాలు గీయడమంటే ఆయనకు మక్కువెక్కువ. 
సున్నితమనస్కులైన "జస్టిస్"తో  పరిచయమేర్పడిన తర్వాత ఆయనతో మైత్రిని వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కారణం, ఆయన మాటతీరు మృదువైనది. ఆయన కళానైపుణ్యం అందమైనది.
సత్తెనపల్లి, వినుకొండ తదితరప్రాంతాలలో పలు కార్యక్రమాలు నిర్వహించి కళాకారులను ఘనంగా సత్కరించిన జస్టిస్ మంచి వక్తగానూ పేరుప్రఖ్యాతులు పొందారు.
తానీ రోజు ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్యకారకులు తన తండ్రిగారేనని ఎంతో వినమ్రతతో చెప్పుకునే జస్టిస్ పొందిన  అవార్డులూ రివార్డులూ అనేకం. అయినప్పటికీ తను గీసిన చిత్రాలను చూసి ప్రజలు బాగుందంటూ మెచ్చుకునేటప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదంటారు జస్టిస్.
ఎవరైనా అంకితభావంతో సాధన చేస్తే మేటి చిత్రకారులుగా రాణించవచ్చన్నది ఆయన అభిప్రాయం. 
తన పేరుతో ఎదురైన ఓ విచిత్ర సంఘటనను జస్టిస్ చెప్పారు....
ఓరోజు ఆయన తనకప్పటికే పరిచయమున్న ఓ స్థానిక ఎమ్మెల్యేను కలవడానికి వెళ్ళారు. అయితే అక్కడున్న ఓ సెక్యూరిటీ అతను "ఎవరండి" అని అడగడంతో ఈయన తన పేరు "జస్టిస్" అని చెప్పుకున్నారు. ఆ వెంటనే సెక్యూరిటీ అతను సాదరంగా తీసుకుపోయి ఓ గదిలో ఉన్న కుర్చీని తుడిచి కూర్చోమని చెప్పి ఆ వ్యక్తి లోపలకెళ్ళి "జస్టిస్ వచ్చారు సార్" అన్నాడు. ఎమ్మెల్యేగారికి ఈయన జస్టిస్ కాదని, తన పేరే జస్టిస్ అని తెలుసు కనుక జస్టిస్ రావయ్యా అన్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడి ఇవతలకు వచ్చాక మీరెక్కడ అంటే ఏ కోర్టు జస్టిస్ అని సెక్యూరిటీ మనిషి నెమ్మదిగా అడగ్గా నేను "జస్టిస్" నే కానీ ఏ కోర్టులోనూ జస్టిస్ కాదని, నా పేరే జస్టిస్ అని చెప్పగా ఆ మనిషి విస్తుపోయాడు. 
ఇప్పటికీ నాకు అర్థం కానిదేమిటంటే వాళ్ళ తండ్రిగారు "జస్టిస్" అనే పేరు ఎలా పెట్టారనే. ఆయన స్కూల్ సర్టిఫికెట్లోనూ ఈ జస్టిస్ అనే పేరే నమోదైంది. ఆయన అసలు పేరే జస్టిస్. 
ఏదేమైనా ఆయన పేరు మాత్రం బలేగా ఉంది.