అవకాశాలు :- మంగారి రాజేందర్ ‘

 (7 September 2019)

అవకాశాలు ఒకేసారి తలుపు తడతాయి. ఒక్కసారి మనం వాటిని అందుకోకపోతే అవి అందకుండా పోతాయని అంటూ వుంటారు.
కొంతవరకు ఇది నిజమే!
అంటే పాక్షిక సత్యం.
వచ్చిన అవకాశాలని జారవిడుచుకోవద్దని ఇలాంటి పద బంధాలని సృష్టించారు.
ఈ ప్రపంచంలో ఏ విషయానికి సంపూర్ణత వుండదు. అన్నీ పాక్షిక సత్యాలే!
ప్రతి సందర్భంలోనూ ఆశావహంగా ఉండటం మాత్రమే సంపూర్ణ సత్యం. 
అలాంటి దృక్పథాన్ని అలవర్చుకోవడం వల్ల మానసిక ప్రశాంతతే కాదు. మన జీవితంలో పురోగతి కూడా లభిస్తుంది.
వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు చాలా తక్కువగా వుంటారు. 
అవకాశాలని జారవిడుచుకున్న వ్యక్తులే అధికం. అలా జారవిడుచుకున్న వ్యక్తులు నిరుత్సాహంగా వుండాల్సిందేనా?
కానే కాదు.
అవకాశాలు రైల్వే ప్లాట్‌ఫారమ్ మీద రైలు లాంటివి. అవి సరైన సమయానికి రావొచ్చు. సరైన సమయానికి రాకపోవచ్చు.
మనం రైల్వేస్టేషన్ దరిదాపులకి రాగానే మనం ఎక్కాల్సిన ట్రైన్ రైల్వేస్టేషన్‌ని వదిలి వెళ్లిపోవచ్చు.
మనం ఎక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటు అన్నాడు ఓ తెలుగు కవి. అది అతిశయోక్తి.
ఒక రైలు వెళ్లిపోతే
మరో రైలు వస్తుంది.
కొంత ఆలస్యం జరుగవచ్చు.
కానీ
రైలు రాకుండా పోదు.
రైలు వస్తుంది.
అవకాశాలు రైలు లాంటివే.
రైలు మిస్ కాగానే మనం కలవరపాటు చెందాల్సిన పని లేదు. మరో రైలు అందుకోవడానికి ప్రయత్నం చేయాలి.
అవకాశాలూ అంతే