తగని స్నేహం.(బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 పూర్వం ఓ రైతు ఇంట్లో కోడిపుంజు, కుక్క ఉండేవి. కోడిపుంజు చావిట్లో గింజలు తింటూ బాగా బలిసింది.  ఆ  పుంజుపై కుక్క చూపు పడింది. దాన్ని తినాలనుకుంది.  సమయం కోసం వేచివుంది. స్నేహం చేయటం మొదలు పెట్టింది. పుంజు దాని స్నేహం నమ్మింది. రెండు చెట్టాపట్టాలేసుకుని తిరగసాగాయి.
        అదే చావిట్లో పావురాయి ఉండేది. ఓ రోజు పుంజుతో ఇలా చెప్పింది." పుంజన్నా! నా మాటవిను. కుక్క స్నేహం మానేయి. అది జంతువు. మనం పక్షులం. మనం శాకాహారులం. అది మాంసాహారి. దానితో మనకు జాతి వైరం ఉంది" అంది. దాని హితవు పుంజుకు నెత్తికెక్కలేదు.  కుక్కతో  స్నేహం మానలేదు. ఓ రోజు ఏకాంత వేళలో పుంజు కుతిక పట్టుకుని , కాళ్ళకింద పెట్టుకుని  మెడ కొరకసాగింది కుక్క.  కోడిపుంజు విలవిలలాడసాగింది. పావురాయి తన పరివారంతో చావిట్లో అలికిడి చేసింది. ఆ శబ్దానికి రైతు వచ్చాడు. కుక్కను కర్రతో బాదాడు. పుంజును వదిలి పారిపోయింది. పుంజు తప్పు తెలుసుకుంది. తగినవారితోనే స్నేహం చేయాలని గ్రహించింది. పావురాయితో చెలిమి చేయటం మొదలు పెట్టింది.
కామెంట్‌లు