ప్రాణం ఖరీదు -ఎం. వి. ఉమాదేవి . నెల్లూరు

ఆహార విహారాల అనుభవం 
నవరసాల నాటకంలో 
పండిపోయిన పాత్రలు.. 
చివరి మజిలీలో 
కొట్టుమిట్టాడే ప్రాణం ఖరీదు..?!
చూపించిన మమతానురాగాలు 
కూడేసి ఇచ్చిన ఆస్తిపాస్తులు.. 
బేరీజు వేయలేని వ్యక్తిత్వం..? !

తడియారిన చర్మంపైన స్పర్శ 
గత వైభవం చిత్రవిభజనగా 
అనుకున్నవన్ని జరగవు 
కానీ.. 
ఆశ వెంబడిస్తూ.. 
ఇంకా నాల్రోజుల ఆయువుగా 
గుంజాటన పడే ఆత్మకు 
నువ్వు వెళ్ళాలి అంటూ.. 
ఇక పనిలేదనే పంచభూతాల 
పరామర్శలు..?! 

ఒకమంచి ఆలోచన మాత్రం 
ఈ జన్మకు ఖరీదులేదనీ.. 
మరో శైశవ గీతమై త్వరలో 
పల్లవించే పని ఉందని.. 
కర్మ సిద్ధాంతం ఓదార్పు!!

-ఎం. వి. ఉమాదేవి . నెల్లూరు