గుడ్మార్నింగ్ :-(323 వ రోజు)తుమ్మేటి రఘోత్తమరెడ్డి

 పొద్దున ఓ గొప్ప వ్యక్తి గురించి తెలిసింది. అతను రిటర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.మాకు సమీప జిల్లా మనిషి. అతను తన జీవితకాలంలో దాదాపు రెండు లక్షల పుస్తకాలను సేకరించాడు.సేకరించడం అంటే కొనడమే! అందుకోసం అతను తన ఉద్యోగ జీతం నుండి క్రమంగా ఖర్చు పెట్టాడు.రెండు లక్షల పుస్తకాలు అంటే, మామూలు విషయం కాదు.ఓ మనిషి తన జీవితకాలంలో చెయ్యగల గొప్ప కృషి. తను పుట్టి పెరిగిన బ్రతికిన గ్రామంలో ఆ లైబ్రరీ పెట్టాడు.అందుకు పాత ఇంటిని పడగొట్టి,దాతల సహకారంతో ఓ యాబై లక్షల రూపాయల వ్యయంతో, పక్కా బిల్డింగ్ కట్టించాడు.
'మా గ్రామానికి గర్వకారణం' అని ,ఆ గ్రామ సర్పంచి కూడా అన్నాడు.అంతేకాకుండా, ఆ రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు మరో గొప్ప పని చేసారు.తనకు ఉన్న ఆరెకరాల భూమిని ,ఆ గ్రామానికి చెందిన పేదలకు పంచెసారు.ఇది కూడా అసాధారణ విషయం. అతనికి సంతానం ఉందా లేదా అని నాకు అనుమానం వచ్చింది.
సంతానం లేని వారిలో కొందరు ,అటువంటి సత్కారాలు చేస్తారు. తెలిసిన వారిని సంప్రదిస్తే, ఉన్నారు అని జవాబు వచ్చింది.
అతను వారిని ఎలా ఒప్పించాడు? మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా? అతను ఎంత సంఘర్షణ పడి ఉంటాడు? 
ఇప్పుడు ఎలా ఉంటున్నారు?
'కూతురు దగ్గర ఉంటున్నారు ఇప్పుడు' అని,
'అతన్ని  ఆ మధ్య రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా సన్మానించిందని' ,మిత్రుడు చెప్పాడు.
వెళ్ళి దర్శించుకోవలసిన మహానుభావులు!
ఇదే విషయాన్ని నిన్న మరో ఇద్దరు మిత్రులకు చెప్పినప్పుడు, వారు మరో వ్యక్తి గురించి చెప్పారు. అతను ఓ మాజీ ఎమ్మెల్యే. మాకు సమీప జిల్లా వారే.అతను తనకు పూర్వుల నుండి సంక్రమించిన కొన్ని ఎకరాల భూమిని సంతానానికి పరిమితంగా పంచి, మిగతా భూమిని పేదలకు పంచేసాడు.అలా పంచడం వల్ల తమకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, ఇవాళ ఎకరం కోట్లు పలుకుతోందని,కొడుకులు కోడళ్లు గుర్రుగా ఉన్నారట.
ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ మీద ఆధారపడి, ఇక్కడి సమీపంలో ఓ రెంటెడ్ అపార్ట్మెంట్ లో ,వృద్దాప్యాన్ని గడుపుతున్నారు భార్యాభర్తలు. సంతానంతో కలిసి ఉండటం లేదు. అతని అభిమానులు అప్పుడప్పుడు అతన్ని దర్శిస్తారు. 
మరో మహారచయిత బ్రతికి ఉన్నంత కాలం, విధిలేక మిన్నకున్న అతని సంతానం, ఆ రచయిత మరణానంతరం ఆ పెద్ద మండువా లోగిలి ఇల్లును పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ కట్టించుకున్నారు.అది తమ పూర్వుల ఇల్లు అని, అందులోనే తామందరు పుట్టి పెరిగిన వారని,అదింకా బాగానే ఉందని,ఆ మహారచయిత ఉద్దేశం. కానీ, అతను మరణించిన తరువాత, ఆయన నలుగురు కొడుకులు ఆ పురాతన భవనాన్ని పడగొట్టించారు.ఆ మహారచయిత తాను బ్రతికి ఉన్నంత కాలం తమకు ఏమీ సంపాదించి ఇవ్వలేదు అని వారందరికీ గుర్రుగా ఉండేది.
సామాజిక స్పృహతో జీవితాన్ని గడిపిన వారిని, సంతానం పట్టించుకోదు.ఎక్కడికి వెళ్లావు? ఎప్పుడు వస్తావు వంటి వంటి ప్రశ్నలు ఉండవు.కుటుంబాలకు సంపాదించి పెట్టింత కాలమే , కుటుంబంలో విలువ ఉంటుంది.
మనం మన అవసరాలకు సరిపడా మాత్రమే సంపాదించుకోవాలని,ఆస్తులను పోగు చెయ్యకూడదు అని,ప్రకృతి వనరులు మొత్తం సమాజపు బ్రతుకుతెరువుకు ఉపయోగపడాలని ఎవరైనా భావిస్తే,అలా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే,కుటుంబాలు వెలివేస్తాయి.సమాజాన్ని పట్టించుకున్న వారిని, కుటుంబాలు పట్టించుకోవు.
పోనీ అలా సంపాదించి పెట్టిన వారిని కూడా పట్టించుకుంటారా అంటే, అదీ లేదు.వారిదీ చివరికి విషాదమే
మనుషుల విషాదం ఏమిటి అంటే?
సంతానాన్ని కనగలరే కానీ, వాళ్ల గుణాలను కనలేరు.
ఎవరో అదృష్టం ఉన్న వారికి మినహా!
గుణాలు పుట్టుకతో పుడతాయి. మధ్యలో రావు.
తమ జీవితాన్ని సమాజ సేవకు అర్పించిన వారిని, ప్రభుత్వాలు గుర్తించి పట్టించుకోవాలి.పెన్షన్ రూపంలో పట్టించుకుంటున్నాయి,ఇంకా పట్టించుకోవాలి.ఎందుకంటే వారు సమాజపు పెద్దలు కూడా!
వ్యక్తులు తమ బాధ్యత మరిచినా,వ్యవస్థ మరువకూడదు!అది ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనం!
సమాజాన్ని పట్టించుకున్న వారిని, ప్రభుత్వాలు పట్టించుకోవాలి.అదే ప్రజాస్వామ్య సంస్కృతి విలువ!
అలాగే, సామాజిక స్పృహతో బ్రతికే వారు,తమ గురించి కూడా స్పృహతో ఉండాలి. తమ ఏర్పాట్లు గురించి ,తమ జాగ్రత్తలో తాము ఉండాలి.

కామెంట్‌లు