అమ్మ భాష లాలిత్యం :-ఎం. వి. ఉమాదేవి చరవాణి -7842368534

లలిత భావాల రసరమ్య భాష తెలుగు 
చలిత కమలాల బోలిన లిపిగా  గుండ్రంగా 
మధురమైనట్టి వచ్చుహల్లులవి తెలియగా 
సులభ వచనమై సూటిగా భాషనేర్చు 

అమ్మఒడిలోని ఆ కమ్మదనము రుచులు 
నమ్మకమ్మైన వ్యాకరణ విధము గానే  
మన్నుమిన్నుల మధ్యలో సడిగా కుదురుకొని 
కన్నుమలుపక మరి పలక దిద్దు భాష 

ఎన్ని రాజ్యాలు సింహాసనాల పోరుబాట 
కవనకిరణాలు  భువనవిజయాల  గంటమ్ములలో 
కావ్యరూపాల కల్పవృక్ష, కామధేనువులై 
భక్తి సాహిత్య శృంగార నిధులు లంకెబిందెలు 

మాండలీకమ్ము మాలతీ లతగా   అల్లుకుని  
చాటు పద్యాల సామెతల కోట కట్టింది 
శతక అవధాన బురుజుపైనుండి విజయకేతనo 
రాజసమ్ముగనిల్చు రాణి నాభాష తెలుగు 

ధీర సంకల్ప పిడుగైన భాష గిడుగు వ్యవహారం 
సంఘవక్రతల దునుమాడె భాషతో కందుకూరి 
సంప్రదాయమ్ము పొత్తిళ్లలోను సద్భావనలు 
సరస భావనల జీవితసారం  మహిళాకవనం 

ద్రవిడ పదకోశ గంభీర నాదం తెలుగు
విమల అనువాదగ్రంధాల తీరం కథానిలయం   
బాల సాహితీ పవనాలజోరు ఉయ్యాలా 
యువత చైతన్య పరిశోధనలు విశ్వవిద్యాలయాలు 

మూలభావమ్ము చెడనట్టి తెలుగు వైదుష్యం 
మేలి ముత్యాలరాశిగా వెలుగుచున్నది 
నిలిచి సాగాలి తరతరాల దిక్సూచి తానై 
తేనేలూరేటి బంగారు  తెలుగు భాష!

కామెంట్‌లు