*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౮౯ - 89)

 శార్దూలము:
*వన్నే యేనుగుతోలుదుప్పటము, బు | వ్వాకాలకూటంబు, చే*
*గిన్నె బ్రహ్మకపాలముగ్రమగు భో |  గేకంఠహారంబు, మే*
*ల్నిన్నీలాగుననుండియుం తెలిసియు | న్నీ పాదపద్మంబుల్చే*
*ర్చెన్నారాయణుడెట్లు మానసమునన్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....

నీకు ఏనుగు చర్మము చక్కని బట్ట.  పుర్రె నీ చేతిలో బిక్ష గిన్నె.  నీవు వేసుకునే హారము ఎంత బావుంటుందో, మహా పెద్ద పాము కదా.  నీకు వున్న అలంకారాలన్నీ ఇంత అందంగా వున్నాయి అని తెలిసి కూడా విష్ణువు నిన్ను కొలిచాడట, ఎలా ......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ చేతిలో కపాలంతో, కాపాలికుడివి అయ్యావు. మహా కాల సర్పాన్ని హారంగా చేసుకుని నీవు పన్నగభూషణుడివి అయ్యావు.  గజచర్మాన్ని వస్త్రం గా చేసుకుని గజచర్మాంబరుడవు అయ్యావు. నెత్తి మీద గంగ, నుదుటి మీద చంద్రుడు. అసలు నీ రూపానికి, సర్వాంగ సుందరంగా కనిపించే విష్ణుమూర్తి రూపానికి సారూప్యత ఏకొంచెమైనా వుందా, ప్రభూ! అయినా సరే, నీ అర్ధనారీశ్వర రూపం ఎంత ముగ్ధ మనోహరం.  అర్ధనారీశ్వర రూపం సుందరమైనా, విష్ణుమూర్తి నిన్ను పన్నగభూషణునిగానే కొలిచి నీ పాదపూజ చేసాడు.  పూజ చేయబడడానికి ముఖ్యమైనది, పూజింపబడే తత్వం గానీ, ఆ తత్వం యొక్క బాహ్య రూపం కాదు అని అందరకీ తెలియజేసాడు, పరాత్పరుడు. నీవు కూడా లింగ రూపంలో నే పూజలు అందుకోవడానికి ఇష్టపడతావు కదా, పంచలింగ రూపా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు