తేలు కుట్టిన దొంగ:-కంచనపల్లి వేంకట కృష్ణారావు -9348611445

   సూరి చదువుసంధ్యలు లేకుండా అల్లరి చిల్లరిగా పెరిగాడు.పని చేయాలంటే వాడికి బద్దకం. దొంగతనాలతో సులభంగా సంపాదించవచ్చునని చిల్లర దొంగతనాలు మొదలు పెట్టాడు.
       అయినా వాడికి తగిన డబ్బుగానీ,బంగారం కానీ ఎక్కడా దొరకడం లేదు.
        ఒకసారి వాడు వీధిలో పోతూఉంటే ఒక ఇంటి దగ్గర జనం ఉన్నారు.వాళ్ళక్కడ ఎందుకు ఉన్నారని ఒక వ్యక్తిని అడిగాడు.
        "అయ్యా, ఈ ఇంట్లో  ధన్వంతరి అని పేరు మోసిన వైద్యుడు ఉన్నాడు.ఆయన హస్తవాసి మంచిది అందుకే రోగులు వచ్చారు,వీరంతా రోగులే" అని చెప్పాడు. 
       వెంటనే సూరిలో దుర్భుద్ధి పుట్టింది.వైద్యుడు బాగా సంపాదిస్తున్నాడు.ఈరాత్రికి  ఇతని ఇంట్లో ఏదో విధంగా ప్రవేశించి ధనం దోచుకోవాలి అనుకుని వెళ్ళాడు.
          ఆ రాత్రి రెండు గంటల వేళ  ధన్వంతరి పెరటి గోడ దూకి వెనుక తలుపు గొళ్ళెం మెల్లగా విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి ఆ గుడ్డి వెలుతురులో ఇటు అటు వెతికి ఒక ఇనప్పెట్టెను కని పెట్ట గలిగాడు.
        మెల్లగా తన తెచ్చుకున్న చిన్న గుణపంతో  ఆపెట్టె మూత తియ్యాలని ప్రయత్నించాడు.అయినా మూత రాలేదు! ఇక లాభంలేదని అవకాశం కోసం పెట్టెను తడమ సాగాడు.
        ఆ పెట్టె మీద ఓ తేలు పాకుతోంది! అది చటుక్కున సూరి వేలు మీద కాటు వేసింది.అంతే సర్రున మంట పుట్టి భుజం వరకు బాధ పాక సాగింది.
ఇక ఓర్చుకో లేక వాడు కెవ్వున కేక పెట్టాడు. ఆ కేక విని ధన్వంతరి నిద్ర లేచి ఆశ్చర్యపోతూ వాడి దగ్గరకు వచ్చి వాడు దొంగ అని గ్రహించాడు.అయినా వాడికి తేలు కుట్టినట్టు గ్రహించాడు.
         ధన్వంతరిని చూసి సూరి బెదరి పోయాడు.
         "అయ్యా,బుద్ధి గడ్డితిని మీఇంట్లో దొంగతనానికి వచ్చాను.తేలు కరచింది మందు వెయ్యండి, నన్ను రాజభటులకు అప్పగించకండి"అని నమస్కారంతో,బాధతో వేడుకున్నాడు. 
      "ఏడవకు మందు వేస్తాను"అని గబుక్కున లోపలికి వెళ్ళి ఆకు పసరు తెచ్చి తేలుకుట్టిన చోట పూశాడు.వాడికి ఉపశమనం లభించింది.వెంటనే తేలును వెతికి దానిని చంపి వేశాడు ధన్వంతరి.
        కొంతసేపటికి సూరి తేరుకున్నాక,"ఎందుకు ఈ పాడు పని చేస్తున్నావు?నీ కాలు కన్ను బాగున్నాయి కదా"అడిగాడు ధన్వంతరి.
        "అయ్యా,చదువులేదు నాకు పని దొరకలేదు, అందుకని దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాను"అని కళ్ళలో నీళ్ళతో చెప్పాడు.
       "చూడు నేను మంచి వాణ్ణి కాబట్టి నిన్ను రాజ భటులకు అప్పగించడంలేదు.ఈ పాడు వృత్తిలో ఉంటే ఎప్పటికయినా పట్టుపడతావు అప్పుడు తీవ్రమైన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.నీవు మారతానని చెప్పు నీకు నా వైద్యశాలలో పని ఇస్తాను,జీతం ఇస్తాను"చెప్పాడు ధన్వంతరి.
       ధన్వంతరి మంచి మనస్సుకు సూరిలో మార్పు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి "మీరు పని ఇస్తానన్నారు అదే నాకు భాగ్యం"అని చెప్పాడు.
      మరుసటిదినమే సూరిని రమ్మన్నాడు ధన్వంతరి.
సూరి వచ్చాడు.తనరోగులను వరుసగా లోనికి పంపడం, తనతో పాటు అడవికి తీసుకవెళ్ళి మూలికలు తీసుక రావడం వంటి పనులు చేయిస్తూ భోజనం పెడుతూ తగిన జీతం ఇచ్చి ధన్వంతరి సూరి జీవితంలో మంచి మార్పు తీసుక వచ్చాడు.
         అందుకే తప్పు చేసిన వారిని శిక్షించకుండా వారిలో మార్పు తీసుక రావడానికి ప్రయత్నించాలి.
             ****************
మీకు తెలుసా?
      మన దేశం ఎక్కువ వెండి వినియోగిస్తున్నా తగినన్ని వెండిగనులు లేవు. రాజస్థాన్ లో అతి కొదిగా జింకుతో పాటు దొరుకుతుంది!
              *****************

కామెంట్‌లు