రాబో:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  మనిషి ప్రాచీన యుగంనుండి తన పనులు సులభతరం చేసుకొనేందుకు జంతువులను మచ్చిక చేసుకున్నాడు.తరువాత కొన్ని పనిముట్లు తయారు చేసుకున్నాడు.కాస్త సైన్స్ అభివృద్ధి చెందాక యంత్రాలు తయారు చేసుకున్నాడు.ఎంతో అభివృద్ధి సాధించిన మనిషి మరో ముందడుగు వేసి మనిషి చేయగలిగిన పనులను ఒక యంత్రం చేత చేయిస్తూ దానికి 'రాబో'(robot) అని పేరు పెట్టాడు.తెలుగులో రాబోట్ లేక రాబో అనవచ్చు.
       రాబోట్ అనే పదం మొట్ట మొదటిసారి ఒక నాటికలో కారెల్ కాపెక్ అనే నాటక రచయిత(1920) ప్రయోగించాడు.రాబోట్ అంటే సేవకుడు అని అర్థం! తరువాత దానిని శాస్త్రజ్ఞులు వాడుకున్నారు.
        జపానులో దీనిని మొదట సృష్టించారు. తరువాత అనేక దేశాల్లోని శాస్త్రజ్ఞలు దీనిని అనేక విధాలుగా అభివృద్ధి చేశారు.సి.డబ్ల్యూ.రెన్వార్ట్  అనే బ్రిటిషు శాస్త్రజ్ఞుడు 1957లో వీటివలన ఎన్నో ఉపయోగాలు ఉన్నట్టు ప్రయోగాల ద్వారా నిరూపించాడు.
       ఇవి పరిశ్రమలలో ఎంతో ఉపయోగ పడుతున్నాయి. ముఖ్యంగా కార్ల పరిశ్రమలో ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి,పదిమంది చేసే పనిని ఒక రాబోట్ ఎంతో ఖచ్చితంగా చేయగలదు.
రాబోట్ ఎలక్ట్రానిక్ చిప్ ద్వరా పనిచేస్తుంది. రాబోట్ లో గల సెన్సర్లు కాంతిని,వస్తు ఘన పరిమాణాన్ని అంచనా వేసి తదనుగుణంగా వ్యవహరిస్తాయి. అందుకే సున్నితమైన గాజు గ్లాసుని పట్టుకుని ఎత్తగలవు లేక ఒక ఇనుప బంతిని తగినంత శక్తి శక్తిని ఉపయోగించి ఎత్తగలవు.
     వీటిని ప్రమాదకర  రసాయనిక పరిశ్రమలలో,ధార్మిక కిరణాలు వెలువడే ఆటమిక్ కర్మాగారాల్లో,వివిధ గ్రహాల వాతావరణ పరిస్థితులు వాటిలో గల ప్రమాదాలను అంచనా వేయడానికి గ్రహాల మీదకు పంపుతున్నారు.
       ఆంధ్ర విశ్వవిద్యాలయం(వైజాగ్) ఇంజనీరింగ్ విభాగం వారు వికలాంగులకు ఉపయోగపడే రాబో చెయ్యిని తయారు చేశారు.
         వీటిలోని పరికరాల వలన ఇవి చాలా ఖరీదు!ఆంగ్ల చిత్రం star wars లో  R2 D2 వంటిరాబోలను మీరు చూసి ఉంటారు.రాబోకాప్ సినిమాలోపోలీస్ రాబో దుష్ట శిక్షణ చేస్తుంటుంది!రజనీకాంత్ నటించిన రాబో కొంత అధివాస్తవికితతో తీసారు.
       రాబోట్లు వైద్యపరమైన ఆపరేషన్లు కూడా చేయగలవు.అంటే ఎక్కడో అమెరికాలో ఉన్న డాక్టర్ టి.వి.,ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ ఉన్న రోగిని చూస్తూ తగిన సూచనలు ఇస్తూ ఆపరేషన్ చెయ్యగలడు.కానీ ఈ పద్దతిని అందరూ ఆమోదించడం లేదు.
         1997 జూలై 4న అంగారక గ్రహం మీదకు 'పాత్ ఫైండర్ అనే వాహనంలో 'సోజర్నర్'అనే రాబోట్ ను పంపారు.అది అక్కడ వాతావరణం నేలల మీద విశ్లేషణలు జరిపి ఆ సమాచారం శాస్త్రజ్ఞులకు అందించింది.
      డాన్స్,ఆటలు ఆడే రాబోట్లు కూడా తయారు చేస్తున్నారు.
       హాంగ్ కాంగ్ కు చెందిన హాన్సన్ రాబోటిక్స్ కంపెనీ 'సోఫియా'అనే అచ్చం అమ్మాయిన పోలిన రాబో తయారు చేసింది.ప్రశ్నలు అడిగితే అది జవాబులు కూడా చెబుతుంది!దీని ఖరీదు సుమారు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది!
        రాబోలను మరింత అభివృద్ధి చేసేందుకు అభివృద్ధి చెందిన దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి.
        మరికొన్ని సంవత్సరాల తరువాత ప్రతి ఇంట్లో టి.వి.వాషింగ్ మెషీన్ ఉన్నట్టు రాబోలు ఉంటాయేమో!
       మంచి విషయం:వెల్లుల్లి లో ఉండే ఆల్లిసిన్ అనే పదార్థం యాంటీ బయోటిక్ గా ఉపయోగపడుతుంది
              *************

కామెంట్‌లు