కథ మారింది!:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445

  సుబ్బారావు(సుబ్బయ్య కాదు) జాగ్రత్తగా చెట్టు ఎక్కి ఓ పెద్ద కొమ్మను కొట్ట సాగాడు.గొడ్డలి జారి కింద పారుతున్న నదిలో పడిపోయింది!
      "అయ్యో"అని సుబ్బారావు అనుకునేంతలో నదీదేవత "ఇదుగో నాయన" అంటూ దేవత బంగారు గొడ్డలితో ప్రత్యక్ష మయింది.
     ఆమెకు నమస్కారం పెట్టి "అమ్మా అది నాదికాదు" చెప్పాడు.
      దేవత చిరునవ్వుతో మరలా నదిలోకి వెళ్ళి ఈ సారి వెండి గొడ్డలి తెచ్చి సుబ్బారావుకుచూపించి
"ఇది నీదేనా?" అడిగింది
       "ఇది కూడా నాది కాదమ్మా"అన్నాడు సుబ్బారావు.
       దేవత మరలా చిరునవ్వుతో నదిలో మునిగి అసలు గొడ్డలి అంటే ఇనప గొడ్డలితో  ప్రత్యక్షమయింది.
       కళ్ళు చిట్లించి ఆ గొడ్డలిని చూసి "అయ్యో, ఇదికూడా నాది కాదమ్మా"అన్నాడు సుబ్బారావు.
       ఈ సారి నదీ దేవత బోలెడు ఆశ్చర్య పోయి, "మరి పడిపోయిన గొడ్డలి ఎటువంటిది?"అని అడిగింది.
        "తల్లీ, నాగొడ్డలి ప్లాటినంతో చేసినది,వజ్రాలు,వైఢూర్యాలు పొదిగి ఉంటుంది" అని తాపీగా చెప్పాడు సుబ్బారావు.
       "హతవిధీ,కలియుగం వచ్చేసింది..." అని అనుకుంటూ తలపట్టుకుని మాయమయిపోయింది నదీ దేవత!
                  

కామెంట్‌లు