శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు94410 65414, peddissrgnt@gmail.com
వస్తువేదయిన ద్రవములోన మునుగగా
దాని బరువు కొంత తరిగిపోవు
అట్టి సూత్రములను ఆర్కిమెడిసు తెల్పె
తపన గలిగి చూడ తెలియు నిజము.

కాయ రాలి పడుట కాంచెను న్యూటను
తర్కబుద్ధితోడు తా కనుగొనె
భూమి కూడ పెద్ద సూదంటురాయని
తరచి తరచి చూడ తట్టు నిజము.

కలదు మొక్కలకును జీవమనుచు
నరుల వోలె ఏడ్చు నవియు యనుచు
జగతి ప్రజకు తెలిపె జగదీశ చంద్రుండు
శాస్త్ర దృష్టి తెలుపు వాస్తవంబు.

పదవి ఏది రాక పరదేశమేగెను
జన్యుశాస్త్ర శోధ జరిపి తాను
గొప్ప వాడయె హరగోవింద ఖొరానా
ఓర్మి యున్న చోట కాని దేది?

పిచ్చి కుక్క కరువ ప్రాణాలు విడుచుచు
బాధ పడెడు రోగి వేధ జూసి
మందు చెప్పినాడు మహనీయ పాశ్చరు
అట్టి వారి దారి అభిలషణీయంబు.

జగదీశ చంద్ర బోస్   (1858 – 1937)
కామెంట్‌లు