శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు-94410 65414, peddissrgnt@gmail.com

ఈలపాటలు తెలుగు జోలపాటలుగాను
అరువదేండ్లు ఆడి నాటకాలు 
కీర్తి గాంచినాడు కే. రఘురామయ్య
ప్రతిభ వెలికి తీయ ఫలితముండు.

సరిగమపదనిసల సంగీత ద్వారము
తెరచి వాయులీన తీగ ద్వార
నాద సృష్టిచేయ నాయుడు సరియేరి?
నేర్వవచ్చు కళలు నేత్రహీనులును.

గజ్జె కట్టి ఆడి గళమెత్తి గర్జించి
ఆదిభట్ల దాసు ఆంధ్రదేశ
వాశి పెరుగ జేసె హరికథా గానాన
విద్య నేర్చి ముందు వెల్లడించు.

ఆలి పరమ గడుసు టాల్ స్టాయ్ కు, జాన్సన్ కు
అయిన గాని వారు ఆగలేదు
గ్రంథకర్తలందు గొప్పవారయ్యిరి
కోర్కె గట్టిదైన కానిదేది? 

చూపులేనివాడు చిలకమర్తి కవి
ఆంధ్ర, సంస్కృతాంగ్ల భాష లరసె
తెలుగు ప్రజకు కొంత వెలుగు చూపె
లోటు అడ్డమౌనె లోతు హెచ్చ.
 

కామెంట్‌లు