*జోలాపురం మొనగాడు - -* డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

  శేషన్న స్కూలైపోగానే ఇంటికి చేరుకున్నాడు. కాళ్ళు చేతులు కడుక్కోని భార్య యిచ్చిన కాఫీ తాగుతూ కొడుకు కోసం చూశాడు. ఎక్కడా కనబళ్ళా. “ఎక్కడికి పోయాడే వీడు” పెళ్ళాన్ని కేకేశాడు.
“ఏమో... ఎదురింటి నాగరాజుగాడొచ్చి పిలిస్తే బైటకురికినాడు. వీధిలో చూడండి”
వంటింట్లోంచే సమాధానమొచ్చింది. శేషన్న కాఫీ తాగి వీధి చివరనున్న ఖాళీస్థలం దగ్గరికి పోయినాడు. అక్కడ చేతిలో బ్యాట్ పట్టుకొని వీధిలోని పిల్లలతో క్రికెట్టాడుతున్న కొడుకు కనిపించినాడు.
“రేయ్... హరీ... ” తండ్రి పిలుపుతో వాడదిరిపడి చేతిలోని బ్యాట్ అన్నే పడేసి పరుగులాంటి నడకతో తండ్రి దగ్గరకు చేరి, తప్పు చేసినోనిలా తలొంచుకొని నిలబన్నాడు. శేషన్న వాన్ని కోపంగా చూస్తూ “ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు. ఆ వెధవాటలు ఆడొద్దని... పో ... పోయి తొందరగా ముఖం కడుక్కొని గ్రౌండుకు పో” అన్నాడు. హరి మనసంతా క్రికెట్ వైపే లాగుతోంది. నీరసంగా నెమ్మదిగా ఇంటివైపు అడుగులేయసాగినాడు.
" ఏందిరా ... పెళ్ళినడక నడుస్తున్నావ్. వినబళ్ళేదా ” వెనకనుండి వచ్చిన అరుపుతో అదిరిపడి ఇంటి వైపు ఉరికినాడు.
హరి ఇంటికి చేరుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళమ్మ దగ్గరకు చేరుకున్నాడు. కాసేపు ఆన్నే అటూ ఇటూ తచ్చాడుతూంటే వాళ్ళమ్మ “ఏరా... ఇంకా ఈన్నే నిలబన్నావ్. వచ్చే నెల్లోనే గదా కబడీ సెలక్షన్స్. పో... పోయి... బాగా ప్రాక్టీస్ చెయ్. మీ నాన్నగాని వచ్చాడనుకో ఇంతెత్తు ఎగురుతాడు” అనింది.
హరి వాళ్ళమ్మ దగ్గరకు పోయి " మా... నువ్వన్నా చెప్పుమా నాన్నకి. అసలా కబడీ అంటేనే నాకిష్టం లేదుమా. స్కూళ్ళో అందరూ “ఏందిరా... మీ నాన్న నీకు లేబరోళ్ళ ఆట నేర్పిస్తున్నాడంటనే” అంటూ ఒగటే ఎగతాళి చేస్తున్నారు. తల కొట్టేసినట్లైపోతోంది. మా... మా... క్రిటెక్టో, బాస్కెట్ బాలో నేర్చుకుంటామా. నువ్వైనా చెప్పుమా నాన్నకు. ప్లీజ్ మా” ప్రాధేయపడుతుంటే అప్పుడే ఇంట్లోకొచ్చిన శేషన్నకు ఆ మాటలు వినబన్నాయి. తానెంతో ప్రేమించే, ఇష్టపడే ఆట గురించి అలా మాట్లాడుతుంటే ఒళ్ళు ఆవేశంతో ఒణికింది.
" ఏందిరోయ్... మీ అమ్మతో ఏందో అంటున్నావ్. ఒళ్ళు గాని కొవ్వెక్కిందా. క్రికెట్టంట క్రికెట్టు. మట్టసంగ గ్రౌండుకు పో... వచ్చే నెలనే సెలక్షన్స్. అందులోగాని సెలెక్ట్ కాలేదనుకో... వుంటాది నీకు” హెచ్చరించినాడు.
ఆ మాటలకు హరి వాళ్ళమ్మ “ఏంది నీవు మరీను... వాడొద్దు మొర్రో అంటుంటే వాన్నట్లా సంపుకోని తింటున్నావు. ఐనా అసలీ పనికిమాలిన ఆటలు నేర్పిచ్చే బదులు, ఆన్ని తీస్కపోయి ఏ కంప్యూటర్ సెంటర్లోనో పడేస్తే వానికింత ఫ్యూచరన్నా వుంటాది గదా. ఎంతసేపూ కబడీ.... కబడీ అంటూ వాని ప్రాణం తీస్తుంటావు. ఆ
గ్రౌండ్ నుంచి అలసిపోయొచ్చి తినగానే మంచమెక్కుతున్నాడీ మధ్య. హాఫియర్లీ మార్కులు చూడు. ఎంత తగ్గిపోయినాయో” అంటూ ఆ ఆటపట్ల తనకున్న వ్యతిరేకత తెలియజేసింది.
ఆ మాటలకు శేషన్న ప్రాణం చివుక్కుమనింది. ఇన్నేళ్ళు కలిసి జీవించినా తన జీవితంలో ఒక భాగమైన కబడీ గురించి దానిపట్ల తనకున్న ప్రేమ గురించి ఆమె అర్థం చేసుకోలేక పోతున్నందుకు బాధపన్నాడు. అంతలోనే ఫోన్ మ్రోగింది.
" హలో... శేషన్న వున్నాడా?” “ నేనే మాట్లాడేది. నీవు” 
" నేన్రా గోపీని, గుర్తు పట్టలా” 
“ ఏరా.... గోపీ... ఎప్పుడొచ్చినావ్ వూర్నించి.”
“ రెండు రోజులైందిలే రేపొద్దున్నే పోవాల. ఇంటికాన్నే వున్నా. వస్తావా. ఎన్ని రోజులైంది మనం కలిసి.”
" సరే... సరే... ఓ గంటలో వస్తా. ఎక్కడికీ పోవద్దు” ఫోన్ పెట్టేసినాడు.
గోపి శేషన్నకి బాల్యమిత్రుడు. ఇద్దరిదీ జోలాపురమే. హైస్కూలు వరకూ కలసి చదువుకున్నారు.
గోపీ మంచి ఖోఖో ఆటగాడు. లంగోటా బిగించి బరిలోకి దిగితే ముట్టేసుకునేటోడే లేడు. నేషనల్స్ వరకూ పోయినాడు. తర్వాత రైల్వేలో వుద్యోగం సంపాదించి ప్రస్తుతం హైద్రాబాద్లో వుంటున్నాడు. శేషన్న మిత్రున్ని కలవడానికి జోలాపురం బైలుదేరినాడు.
జోలాపురం కర్నూలుని ఆనుకునే వుంటాది. ఒంటౌను దాటి, హిందూ శ్మశానవాటిక దాటి, జమ్మిచెట్టు దాటి, హంద్రీ దాటగానే జోలాపురం. ఒకప్పుడు మధ్యన అరకిలోమీటరు దూరముండే పచ్చని పంటపొలాలు రెంటినీ వేరు చేస్తూండేవి. ఇప్పుడు ఆ పొలాలు మాయమై ఇండ్లు పడడంతో దాదాపుగా కర్నూల్లో కలసిపోయింది. టౌను కల్చర్ మొత్తం ఆక్రమించింది. శేషన్న జోలాపురంలో అడుగు పెట్టగానే మధురమైన అనుభూతికి గురయినాడు. చిన్నప్పన్నించీ పెరిగి పెద్దదై వుద్యోగమొచ్చేంత వరకు వున్న వూరు. పిల్లల చదువులకోసం టౌన్లో కొచ్చేశాడు. స్నేహితులు, బంధువులు, పరిచయస్తులు వూరంతా వున్నారు. చిరపరిచితమైన పరిసరాలను ఆప్యాయంగా చూస్తూ కనబన్న వాళ్ళందర్నీ పలుకరిస్తూ ముందుకు పోసాగినాడు.
కర్నూలు నుండి పిల్లలు ప్రయివేట్లు ముగించుకొని ఆటోల్లో, సైకిళ్ళమీద వూళ్ళోకి పోతున్నారు. కళ్ళాల్లో, వీధుల్లో, ఖాళీ స్థలాల్లో అనేకమంది పిల్లలు బ్యాట్లు పట్టుకోని
క్రికెట్టాడుతున్నారు. వాళ్ళను చూడగానే హృదయం కళుక్కుమనింది. ఒకప్పుడు ఈ వూళ్ళో కబడీ అంటే ఎంత ఫేమస్. జోలాపురం ఆటగాళ్ళంటే ఎంత క్రేజు. ఎంత మర్యాద. ఎక్కడ చూసినా వూరినిండా కబడీ ఆడే పొట్టెగాళ్ళే కనబడేటోళ్ళు.
శేషన్నకి ప్రతాపన్న గుర్తుకొచ్చినాడు. వూళ్ళో చిల్లంగోడు, కోతికొమ్మచ్చి, బొంగరాలాట,
గోలీలాట ఆడుకునే పొట్టెగాళ్ళందర్నీ పోగుజేసి "రేయ్... ఎప్పుడూ ఇవే ఆటలాడితే ఏమొస్తాదిరా. ఇవన్నీ అప్పుడప్పుడు సరదాకు ఆడుకునేవి. మనకూ, మనూరికి పేరొచ్చే ఆట ఆడాల. కబడీ నేర్చుకోండి. మీరు వూ అంటే నేన్నేర్పుతా” అన్నాడు.
ఇష్టపడినోళ్ళందర్నీ కలిపి కొన్ని టీములు తయారుచేసి డిఫెన్స్, అఫెన్స్ ఎట్లా ఆడాల, క్యాచింగ్ ఎట్లా చేయాల, చైన్ పట్టుకొని కోర్టులో వేగంగా ఎట్లా కదలాల,
బోనస్ లైన్ తొక్కగానే రెండవకాలు ఎట్లా పైకెత్తాల, ఆగకుండా గుక్కపోకుండా కూత ఎట్లా బెట్టాల, ఒకడు పట్టుకోగానే మిగతావాళ్ళంతా వాన్ని ఎట్లా వేగంగా చుట్టుముట్టాల, ఎదుటోడు పట్టుకోడానికి వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోవాల, పాయింట్లు ఎక్కువున్నప్పుడు ఎట్లా టైంపాస్ చేయాల... అన్నీ నెమ్మదిగా తాను స్టేట్ కు ఆడిన అనుభవంతో ఒక్కొక్కటే నేర్పించినాడు. ప్రతిరోజూ పొద్దునా, సాయంత్రం కేసీకెనాల్ వెంట వినాయక టెంపుల్ వరకు రన్నింగ్ చేసొచ్చి, వామప్ చేసేటోళ్ళు. కబడీ ప్రాక్టీస్ పూర్తికాగానే కేసీకెనాల్లో ఈతకొట్టి స్నానం చేసేటోళ్ళు .
శేషన్న చామన ఛాయతో ఒంపులు తిరిగిన కండలతో ఆరడుగుల ఎత్తుతో, పోతపోసిన కంచు విగ్రహంలా వుండేటోడు. వేగంగా ఆటలోని మెలకువలన్నీ నేర్చేసుకున్నాడు. మైదానంలో అప్పుడే కట్లు తెంచుకున్న కోడెదూడలా హుషారుగా కదిలేటోడు. క్యాచింగ్లో అతన్ని మించినోడు లేడని గ్రామంలో పేరు. ఆట జరిగేటప్పుడు కాటెయ్యడానికి సిద్ధంగున్న కాలనాగులా వుండేటోడు. క్షణంలో వెయ్యోవంతులో, కళ్ళుమూసి తెరిచేంతలోగా, సింహంలా లంఘించేటోడు. పట్టుకున్నాడంటే పులినోట చిక్కిన జింకపిల్లలా అవతలోడు విలవిలలాడాల్సిందే. తప్పించుకునే ప్రశ్నే లేదు. అవతలోళ్ళు శేషన్న వున్నవైపు రావడానికే జంకేటోళ్ళు. పాయింట్లు పోతున్నాయంటే చాలు ఆవేశంతో, ఆగ్రహంతో రగిలిపోతూ స్టెన్ గన్ చేతబట్టి బార్డర్లో నిలబడే
వీర సైనికునిలా, ఏకంగా బెడ్ లైన్ మీదే ఎర్రబడిన కళ్ళతో కాపుకాసేటోడు. బెడ్ లైన్ దాటాలంటేనే అవతలోళ్ళ గుండెలు దడదడలాడిపోయేవి.
శేషన్నకు నడుస్తావుంటే తాము చిన్నప్పుడు ఆడుకునే గ్రౌండు కనబడింది. తోటి ఆటగాళ్ళు గుర్తుకొచ్చారు. ఆ కోలాహలం కళ్ళముందు మెదిలింది.
పోటీ జరుగుతుందంటే చాలు... వూరు వూరంతా ఆన్నే వుండేది. పోటీల్లో పాల్గొనే ఆటగాళ్ళకు మద్దతుగా ట్రాక్టర్లు, ఎద్దులబండ్లు, సైకిళ్ళు వేసుకొని ఆయా వూరోళ్ళు వచ్చేటోళ్ళు. ఇసక వేస్తే రాలనంత జనంతో మైదానమంతా కిటకిటలాడిపోయేది. జనాలు వుద్రేకంతో వూగిపోయేటోళ్ళు. ఈలలు, అరుపులు, కేకలు, చప్పట్లు, సవాళ్ళు, పైపందాలతో మైదానం మారుమ్రోగి పోయేది.
'ఎత్తుర నా కొడుకుని', 'పట్కోరా వాన్ని',
'మొగోడంటే వీడ్రా',
'ఏయ్... ఎయ్యిరా వాన్ని.... అరుపులతో బైటి నుంచి వుద్రేక పరచేటోళ్ళు.  ఆటగాళ్ళు పౌరుషంతో తొడలను చరుచుకుంటూ, పందెం కోళ్ళలా, పోట్ల గిత్తల్లా, సై అంటే సై అంటూ ఢీ కొనేటోళ్ళు. జనాలని అదుపు చేయడానికి వూళ్ళోని పెద్దరెడ్లు, వాళ్ళ గాసగాళ్ళు, పోలీసులు కోర్టుచుట్టూ బారికేడ్లు కట్టి, నాటుకట్టెలు చేతపట్టి పహారా కాసేటోళ్ళు.
శివరాత్రికి, శ్రీరామనవమికి, సంక్రాంతికి, జాతర్లకు, తిరునాళ్ళకు అనేక వూళ్ళలో ఘనంగా పోటీలు జరిపేటోళ్ళు. ఏ గ్రామంలో బహుమతి ఎక్కువగా వుంటే అక్కడికి
శేషన్న మిత్రులతో పోయేటోడు. పాణ్యం, జోలాపురం, మిడూరు, మామిదాలపాడు, సిమెంట్ నగర్, కర్నూలు, గౌళిగేరి, రైల్వేటీములు రంగంలోకి దిగుతున్నాయంటే చాలు పోటీ యమా రంజుగా వుండేది. ఆడా మగా, పిల్లా పీచు, ముసలీ ముతకా పరుగెత్తుకోనొచ్చేటోళ్ళు, విరగబడే జనాల్తో సందడే సందడి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో, ఏ క్షణంలో ఆట ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేక పోయేటోళ్ళు. టెన్షన్తో నరాలు తెగిపోయేవి.
ఆటలో గెలుస్తే... క్షణాల్లో గ్రామానికి వార్త చేరిపోయేది. వూరంతా సంబరంగా, తప్పెట్లతో, పూలమాలలో పొలిమేరలోనే ఎదురొచ్చేటోళ్ళు. వీరతిలకం దిద్ది, దిష్టితీసి, మెళ్ళో పూలదండలేసి, రంగురంగుల కాగితాలతో అలంకరించిన ట్రాక్టర్ పై నిలబెట్టి, ముందుగా తప్పెట్లు మోగుతావుంటే, వూళ్ళోని కుర్రకారు నాటుసారా తాగి హుషారుగా, కైపుగా చిందులు తొక్కుతా వుంటే, వీధుల్లో ఆడోళ్ళు, మొగోళ్ళు రోడ్లపైనా, అరుగులపైనా, మిద్దెలపైనా నిలబడి చేతులూపుతూంటే, పెళ్ళిగాని కన్నెపిల్లలు రెప్ప వాల్చకుండా తలుపు సాటునుంచి విశాలమైన కాటుక కళ్ళతో ఆరాధనగా చూస్తావుంటే, పొగరుబట్టిన గిత్తల్లా రొమ్ములిరుచుకొని, కోరమీసం తిప్పుతూ ఠీవిగా అటూ ఇటూ చూస్తూ, చిరునవ్వులు చిందిస్తూ, జనాల జయజయ ద్వానాల హోరులో జోరుగా, హుషారుగా వూరువూరంతా తిరిగేటోళ్ళు.
కబడీ ఆటన్నా, ఆటగాళ్ళన్నా, అప్పట్లో ఎంత ప్రేమ. ఎంత గౌరవం. పిల్లలు మాకు నేర్పియ్యన్నా అంటే మాకు నేర్పియ్యన్నా అంటూ వెంటబడి సతాయించేటోళ్ళు. ఇప్పుడు నేర్పిద్దామన్నా ఎవడూ దొరకడం లేదు. నేర్చుకోండ్రా అంటే అది మాస్ ఆటన్నా, దెబ్బలు తగుల్తాయి అంటూ పారిపోతున్నారు. కొడుకు గుర్తుకొచ్చాడు. తన కొడుకే తన మాట విననప్పుడు ఎవర్ననుకొని ఏం లాభంలే అని నిట్టూర్చాడు.
నడుస్తుండగానే గోపీ వాళ్ళ ఇల్లొచ్చింది. శేషన్నను చూడగానే గోపీ బెరబెరా బైటకొచ్చి ఆప్యాయంగా చేయందుకొన్నాడు.
" ఏంవై... వచ్చి రెండ్రోజులైతే పోయే ముందా ఫోన్చేసేది. అవ్లే... యాడ గుర్తుంటాంలే” శేషన్న ప్రేమగా కోప్పన్నాడు. .
" సారీరా... నిన్ననే కలుద్దామనుకున్నా... కానీ... చెల్లెలికి పెండ్లి చూపులు. బిజీ బిజీ. వచ్చినా ప్రశాంతంగా మాట్లాడుకోడానికి టైం దొరకదు గదా” అంటూ లోపలికి తీసుకొనిపోయాడు.
ఇద్దరూ మంచమేసుకొని మిద్దెపైన కూచున్నారు. చల్లనిగాలి వంటిని హాయిగా స్పృశించసాగింది. చిన్ననాటి ముచ్చట్లు, స్నేహితులు, అల్లర్ల గురించి మాట్లాడుకుంటుంటే సమయం వేగంగా దొర్లిపోసాగింది.
" అవ్రా... నీ కొడుకు హరి ఎట్లున్నాడు. కబడీ నేర్పిస్తున్నావంటనే... నీ మాదిరి తయారవుతున్నాడా?” మాటల మధ్యలో గోపీ ప్రశ్నించినాడు.
శేషన్న చిన్నగా నిట్టూరుస్తూ “ఏం లాభం లేదురా. మొన్న వాళ్ళ కోచ్ ని కలిశా. మీ పిల్లోనికి ఆటమీద ఆసక్తి లేదు. పరధ్యానంగా ఎప్పుడు అటూ యిటూ చూస్తుంటాడు. కష్టమే అన్నాడు. వీనికా క్రికెట్టు దయ్యం పట్టుకున్నట్టు పట్టుకుందిరా. ఎంతసేపూ దానిమీదే ధ్యాస. సందు దొరికితే చాలు సందుల్లో కురికి క్రికెట్టాడుతుంటాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు” అన్నాడు.
గోపీ మంచమ్మీద వెల్లకిలా పడుకొని ఆకాశం కేసి చూస్తూ “నిజమేరా... ఈకాలం పొట్టెగాళ్ళకు క్రికెట్ మీదున్న మోజు దేని మీదా లేదు. మనకాలంలో క్రికెట్టంటే ఎవనికి తెల్సు చెప్పు. కపిల్‌దేవ్ వరల్డ్ కప్ గెల్చుకొచ్చినా మనకేం పట్టలా. కానీ మన పల్లెల్లో అడుగడుగునా ఆంటెనాలు వెలిశినాయి చూడు అప్పన్నించీ మొదలైందీ పిచ్చి. అదీగాక మన పొట్టెగాళ్ళు కాన్వెంట్ చదువులకోసం కర్నూలుకి పోవడం మొదలెట్టినారు. ఆ కాన్వెంట్ స్కూళ్ళలో కబడీలు, ఖోఖోలు ఎవడాడిస్తున్నాడు చెప్పు. అంతా క్రికెట్టే. ఈట్ క్రికెట్ , స్లీప్ క్రికెట్, డ్రింక్ క్రికెట్... టీవీలు క్రికెటర్లను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ టీవీలో వస్తే నగరం నగరమంతా కరోనా వాతపన్న కంటైన్మెంట్ ప్రాంతంలా మారిపోతూంది. ఈ కాన్వెంట్ పిల్లలు క్రికెట్ మాయలో పడి వైట్ ప్యాంట్లో వైట్ షర్టు దూర్చి, ప్యాడ్లు కట్టుకొని, గ్లవుజులేసుకొని, కాళ్ళకు బూట్లతో, నెత్తిన టోపీతో, బ్యాటెత్తుకోని స్టైల్ గా గ్రౌండ్లలో ఆడుతావుంటే... మనోళ్ళకు మనాటలన్నీ మొరటుగా కన్పించి దానివైపుకే దుంకేస్తున్నారు. ఓ కొక్కోకోలలా, కాల్గెట్ లా , టిక్ టాక్ లా, రేనాల్డ్స్ లా, కాన్సర్లా, కరోనాలా, ఎయిడ్స్ లా పల్లె పల్లెకూ పాకిందిది. ఇంగ్లీషోడు పొద్దుపోక మన భారతదేశంలో తిని అరగక, కాలుమీద కాలేసుకుని కూర్చున్న రోజుల్లో... చౌహాన్లకు,  టాకూర్లకు, పటాన్లకు, నవాబ్ లకు నేర్పినాడట... ఈ రోజు ఈ బలిసినోళ్ళ ఆట దేశ్ కీ ధడ కన్” అంటూ విచారంగా నవ్వినాడు.
" అందుకే రా... నా కొడుకుని దీన్నుండి తప్పించి మనాట నేర్పించాలనుకునింది. కానీ వీలు పడ్డం లేదు” అంటున్న శేషన్న మాటలకు అడ్డంపడిన గోపి “మనమేం చేయలేంరా. గుర్రాన్ని తొట్టివరకూ తీస్కొని పోవచ్చు. కానీ తాపలేం గదా. చుట్టూ వుండే సమాజం ఎట్లుంది. మీడియా మాయెట్లుంది. మన పిల్లలు దీన్నుండి ఎట్లా తప్పించుకోగలరు? లాభం లేదురా. వాళ్ళిష్టానికి వాళ్ళనొదిలేయాల్సిందే. బలవంతంగా రుద్దలేం . ఐనా ఇంకా కబడీ అక్కడక్కడ అన్నా పల్లెల్లో నన్నా బ్రతికింది. మరి మా ఖోఖో, డైరెక్టుగా చెప్పాలంటే చచ్చిపోయింది. ఇండియా కబడీ, ఖోఖో టీముల్లో కనీసం ఒక్కని పేరన్నా చెప్పమని అడుగు. ఒక్క పిల్లోడన్నా చెప్తాడేమో చూద్దాం. పేరుకి దేశంలో రెండూ గొప్ప క్రీడలే. కానీ ఒకటి మినుకుమినుకు మంటోంది. ఇంకోటి ఆరిపోయింది. ప్రభుత్వాలకూ శ్రద్ధలేదు. ప్రజలకూ మన ఆటల్ని బతికించుకోవాలన్న ధ్యాసలేదు. రవీంద్రభారతిలో అంతరించిపోతున్న జానపద కళలను అప్పుడప్పుడు ప్రదర్శిస్తున్నట్లు... ముందు ముందు కబడీ, ఖోఖోలను గూడా ప్రదర్శించాల్సి వస్తుందేమో” ఆవేదనగా అన్నాడు.
టైం ఎనిమిదవుతూ వుంది. ఆకాశమంతా చీకటావరించింది. ఇద్దరిమధ్యా కొన్ని క్షణాలు మౌనంగా, విషాదంగా గడిచిపోయినాయి. “నే వస్తారా.. టైమైంది” అంటూ శేషన్న పైకి లేచినాడు.
గోపీ గుమ్మం వరకూ వచ్చి వీడ్కోలు పలికినాడు. ఇంటికి పోతావుంటే దారి మధ్యలో తాను చిన్నప్పుడు కబడీ ఆడిన గ్రౌండు కన్పించింది. గ్రౌండు మధ్యలో పిల్లలు క్రికెట్టాడి పోతూ... పోతూ... మరచిపోయిన వికెట్లు తలెత్తుకోని ఠీవిగా నిలబడి కనబడినాయి. వాటిని చూస్తూ వుంటే శేషన్నకు అవి తన గుండెల్లోనే దింపినట్లుగా అనిపించి హృదయం కళుక్కుమనింది.

కామెంట్‌లు