అఖండ తేజమా!శత కోటి వందనం!:-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన),ఆరోగ్య పర్యవేక్షకులు,చిట్యాల,నల్గొండ,9542236764
అమర వీరుల త్యాగ నిరతికి నిలువెత్తు సాక్ష్యం
విదేశీ శత్రు మూకల భరతం పట్టే సింహ స్వప్నం
నర నరం దేశభక్తి ఉరకలెత్తించే సమైక్యతా రాగం
జాతి యశస్సు దశదిశలా చాటే స్వేచ్ఛా తరంగం

తర తరాల బానిసత్వపు విముక్తి శుభ సంకేతం
తల్లి భారతికి వీరతిలకం దిద్దే విజయ సంకల్పం 
కాషాయ తెలుపు ఆకుపచ్చ సమ వర్ణ సంగమం
శాంతి శౌర్య త్యాగాల ధర్మచరిత్ర సంకలన గ్రంథం 

సత్య అహింసల ధర్మ ప్రబోధాల శాంతి శిఖరం
బిన్నత్వంలో ఏకత్వ భావనా ఉత్తుంగ తరంగం  
ప్రాంత భాష కుల మతాలకతీత ప్రగతి రథచక్రం
ఆధ్యాత్మిక చింతన సకల కళా సంపద కాసారం

సంస్కృతీ సాంప్రదాయ వారసత్వ నిలయం
ఒకరి నొకరు తోడుగా వందేమాతర నినాదం
శాస్త్ర సాంకేతిక ప్రతిభా పాటవాల కీర్తి కిరీటం 
దయార్ధ్ర హృదయ కరుణ రసాత్మక ప్రవాహం

దేశ రక్షణ ధ్యేయమై తహ తహ లాడే అఖండ తేజం
జాతి ఆత్మ గౌరవ నినాద రెపరెపల స్వేచ్ఛా భారతం
దేహం తృణ ప్రాయమని చాటే అమర వీరుల ధీరత్వం
ఉజ్వల భవితవ్య ఆకాంక్షల దీపామా!శతకోటి వందనం!


కామెంట్‌లు